- ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పిలుపు
- పదేండ్లలో విభజన హామీలు అమలు చేయలే
- రాష్ట్రానికి గాడిదగుడ్డు తప్ప ఏమీ ఇవ్వలేదని ఫైర్
హైదరాబాద్, వెలుగు: ‘‘పదేండ్ల కన్నీళ్లను యాదుంచుకుందాం.. ప్రజాద్రోహుల పాలనను అంతం చేద్దాం’’ అంటూ మోదీ సర్కారుపై రాష్ట్ర కాంగ్రెస్ ట్విటర్ వేదికగా ప్రజలకు పిలుపునిచ్చింది. గత పది సంవత్సరాలలో కేంద్రంలోని బీజేపీ తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిందని మండిపడింది. విభజన హామీల అమలు చేయలేదని విమర్శించింది. రాష్ట్ర ప్రజలు కట్టిన పన్నుల్లో సరైన వాటా, నీళ్లు, నిధులు అడిగితే.. కేంద్ర ప్రభుత్వం గాడిదగుడ్డు ఇచ్చిందని ఫైర్ అయింది. రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వంటి విభజన చట్టం హామీలను అమలు చేయలేదని గుర్తుచేసింది. రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే ఐటీఐఆర్, ఇండస్ట్రియల్ పార్కులు ఇవ్వలేదని పేర్కొంది. హైదరాబాద్ కు ఇండస్ట్రియల్ కారిడార్లు రాకపోవడం, కరీంనగర్, వరంగల్ ఇంకా స్మార్ట్ సిటీలు కాలేదని తెలిపింది. యువత భవితకు ఉపయోగపడే ట్రిపుల్ ఐటీ, మెడికల్ కాలేజీలు, ఐఐఎం, ఎన్ఐడీ విద్యాలయాలు, నవోదయ, కేంద్రీయ విద్యాలయాలను తెలంగాణకు మంజూరు చేయడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించింది.