- కాంగ్రెస్‌లో తమ వర్గం వారికే ఇవ్వాలని పట్టుబడుతున్న ఎమ్మెల్యేలు
- లీడర్ల చుట్టూ తిరుగుతున్న ఆశావహులు
- పాలమూరు, వనపర్తి జిల్లాల అధ్యక్షులను ఖరారు చేసిన బీజేపీ
- గద్వాల, నారాయణపేట, నాగర్‌కర్నూల్ పోస్టులుపెండింగ్
మహబూబ్‌నగర్, వెలుగు: ప్రధాన పార్టీల జిల్లా అధ్యక్ష పోస్టుల కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. లోకల్ బాడీ ఎలక్షన్లు దగ్గర పడుతుండడంతో ఈ పోస్టులను భర్తీ చేయాలని పార్టీల హైకమాండ్లు భావిస్తుండగా.. లీడర్లు మాత్రం వర్గాలుగా విడిపోయి తమ మద్దతుదారులకే ఈ పోస్టులను ఇవ్వాలనే డిమాండ్‌ను తెరమీదకు తీసుకొస్తున్నారు.
హాట్ కేకుల్లా డీసీసీ పోస్టులు..
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో డీసీసీ అధ్యక్ష పదవుల కోసం పోటీ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక కొత్త డీసీసీలను నియమిస్తారనే చర్చ జరిగినా, పార్లమెంట్ ఎన్నికలు రావడంతో వాయిదా పడింది. కొద్ది నెలల కిందట టీపీసీసీ చీఫ్ పోస్టును హైకమాండ్ భర్తీ చేసినా.. డీసీసీలను పెండింగ్‌లోనే పెట్టింది.
అయితే నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యుల్ వెలువడుతుందనే ప్రచారం జరుగుతుండడంతో, ఆ లోపు ఈ పోస్టులను భర్తీ చేయాలని హైకమాండ్ భావిస్తోంది. కానీ, ఒక్కో జిల్లాలో ముగ్గురు నుంచి నలుగురు చొప్పున డీసీసీ అధ్యక్ష పీఠం కోసం పోటీ పడుతున్నారు. తమకు అనుకూలంగా ఉన్న లీడర్ల పంచన చేరి ఆశావహులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
దీనికితోడు కొందరు ఎమ్మెల్యేలు తమ వర్గంలో లీడర్‌కే అధ్యక్ష పోస్టు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు ఎమ్మెల్యేల మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్లు టాక్ కూడా ఉంది. ప్రధానంగా మహబూబ్‌నగర్ డీసీసీ పోస్టు కోసం ఇద్దరు ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నట్లు బహిరంగంగానే చర్చ జరుగుతోంది. తమ వర్గం లీడర్లకే అధ్యక్ష పోస్టు ఇవ్వాలని ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది.
వీరితో పాటు ఏండ్లుగా పార్టీని నమ్ముకున్న తమకు కూడా చాన్స్ ఇవ్వాలని ఎన్పీ వెంకటేశ్, సంజీవ్ ముదిరాజ్, సిరాజ్ ఖాద్రి తదితరులు టైం వచ్చినప్పుడుల్లా తమ వాణి వినిపిస్తున్నారు. అయితే అనూహ్యంగా ఎంఎస్ఎన్ ఫార్మా కంపెనీల అధినేత మన్నే జీవన్‌రెడ్డి పేరు తెరమీదకు వస్తోంది. ఆయన రేవంత్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడు కావడంతో.. దాదాపు డీసీసీ పోస్టు కన్ఫాం అవుతుందనే టాక్ నడుస్తోంది. దీనికితోడు పార్టీ లీడర్లు ఆయన పట్ల సానుకూలంగా ఉన్నట్లు తెలిసింది.
వనపర్తి డీసీసీ స్థానాన్ని ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయిస్తారనే టాక్ నడుస్తోంది. ఇందుకు ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డి కూడా సానుకూలంగా ఉన్నట్లు ఆయన అనుచరుల ద్వారా తెలిసింది. అయితే బీసీ సామాజిక వర్గానికి చెందిన లీడర్ శ్రీనివాస్ గౌడ్ కూడా తనకు చాన్స్ ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈయన మేఘారెడ్డి, చిన్నారెడ్డిలకు అనుకూలంగా ఉండడం కూడా కలిసొచ్చే అవకాశం ఉంది.
నారాయణపేట డీసీసీ అధ్యక్షుడిగా ప్రస్తుతం ప్రశాంత్ కుమార్ రెడ్డి కొనసాగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈయన మక్తల్ అసెంబ్లీ టికెట్ ఆశించగా.. హైకమాండ్ డీసీసీ పోస్టు ఇచ్చి బుజ్జగించింది. అయితే ఈ టర్మ్ కూడా ఆయన్నే కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. అయితే సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్ పరిధిలోని కోస్గి, మద్దూరు మండలాలకు చెందిన లీడర్లు కూడా నారాయణపేట డీసీసీ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.
Also Read :- రైతుల ఖాతాల్లోభరోసా డబ్బులు
నాగర్‌కర్నూల్ కాంగ్రెస్‌లో పరిస్థితి భిన్నంగా ఉంది. ఈ జిల్లాల్లో అధ్యక్ష పోటీ కోసం ఎవరూ పోటీ పడడం లేదని తెలిసింది. కొందరు మాజీ ఎంపీపీలు, జడ్పీటీసీల పేర్లు తెరమీదకు వచ్చినా.. వారు ఈ పోస్టు తీసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపడం లేదని తెలిసింది. దీంతోఈ జిల్లాలో అధ్యక్ష పదవికి పోటీ కనిపించడం లేదు. అయితే ప్రస్తుత డీసీసీగా ఉన్న అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణను తిరిగి కొనసాగిస్తారా? లేదా కొత్త వారికి చాన్స్ ఇస్తారా? అనేది సస్పెన్స్‌లో ఉంది.
బీజేపీలో మూడు పోస్టులు పెండింగ్..
బీజేపీ హైకమాండ్ రెండు జిల్లాల అధ్యక్షులను నాలుగు రోజుల కింద ప్రకటించింది. ఉమ్మడి జిల్లాల్లో ఐదు జిల్లాలకు గాను మహబూబ్‌నగర్ అధ్యక్షుడిగా శ్రీనివాస్ రెడ్డి, వనపర్తి అధ్యక్షుడిగా నారాయణ పేర్లను ఖరారు చేసింది. వీరిద్దరికీ రెండోసారి అవకాశం కల్పించింది. అయితే నారాయణపేట, గద్వాల, నాగర్‌కర్నూల్ అధ్యక్షులను ప్రకటించలేదు.
నారాయణపేట నుంచి సత్య యాదవ్, మక్తల్ నుంచి బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి, భాస్కర్, కోస్గి నుంచి ప్రతాప్ రెడ్డి అధ్యక్ష పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. రెండు సార్లు అధ్యక్ష పదవులు నారాయణపేట వాసులకే రావడంతో ఈసారి మక్తల్‌కు లేదా సీఎం నియోజకవర్గం నుంచి ప్రతాప్ రెడ్డికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయి. ఎంపీ డీకే అరుణ వీరిలో ఎవరికి మద్దతు తెలిపితే వారికే అధ్యక్ష పోస్టు దక్కనుంది.
నాగర్‌కర్నూల్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ప్రస్తుతం ఎల్లేని సుధాకర్ రావు కొనసాగుతున్నారు. అయితే ఈయన స్థానంలో కొత్త వారిని నియమించేందుకు హైకమాండ్ కసరత్తు చేస్తున్నా.. జిల్లా స్థాయిలో పరిచయాలు ఉన్న లీడర్లు లేక ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం.