వీలైనన్ని ఎక్కువ రోజులు అసెంబ్లీ..త్వరలో ఉత్తమ లెజిస్లేటర్ అవార్డు: స్పీకర్​ ప్రసాద్​

  • ప్రజాస్వామ్యంలో చట్టసభలది కీలకపాత్ర
  • ప్రజలకు ఎమ్మెల్యేలు జవాబు దారీగా ఉండాలని సూచన
  • ఎమ్మెల్యేలు ఓడిపోవడానికి పీఏలు కారణం: మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
  • ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు రెండురోజుల ఓరియంటేషన్​ ప్రోగ్రామ్​ ప్రారంభం

హైదరాబాద్, వెలుగు: ప్రజాస్వామ్యంలో చట్ట సభలది కీలక పాత్ర అని, ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టు చట్టాలను రూపొందించాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలపై ఉందని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు.  చట్టాల రూపకల్పనతో పాటు వాటి అమలు తీరు, ప్రజలకు అవి ఎంతవరకు ఉపయోగపడుతున్నాయనే దానిపై కూడా చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు ప్రజలు ఆసక్తిగా గమనిస్తుంటారనే విషయం గుర్తుంచుకోవాలని సూచించారు.

బుధవారం జూబ్లీహిల్స్ లోని ఎంసీహెచ్‌‌‌‌‌‌‌‌ఆర్డీ ఇన్​స్టిట్యూట్​లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు రెండ్రోజుల లెజిస్లేచర్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్​ను స్పీకర్ ప్రసాద్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్​​ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఉద్దేశించి స్పీకర్ మాట్లాడారు.

అసెంబ్లీ వ్యవహారాలపై  సభ్యులకు పూర్తి అవగాహన ఉండాలని.. అప్పుడే సభలో అర్ధవంతంగా మాట్లాగలుగుతారని  చెప్పారు. కొత్త సభ్యులతో పాటు సీనియర్ సభ్యులందరికీ ఈ ఓరియంటేషన్ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. గతంలో మాదిరిగా ఒకటి, రెండ్రోజులు కాకుండా ఎక్కువ రోజులు సమావేశాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు లాగా ఉత్తమ లెజిస్లేటర్ అవార్డు ఇచ్చే అవకాశాన్ని కూడా పరిశీలిస్తామని స్పీకర్ చెప్పారు.

మీ ఫోన్లు మీరే ఎత్తండి: మండలి చైర్మన్​ గుత్తా

ఎమ్మెల్యేలు ప్రజలకు దూరం కావడానికి, ఓడిపోవడానికి పీఏలే కారణమని.. ప్రజా ప్రతినిధులను ప్రజలకు దూరం చేసేది కూడా వీరేనని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ‘‘ఎమ్మెల్యే కోసం ఎవరైనా ఫోన్ చేస్తే.. కొందరు పీఏలు ఫోన్ ఎత్తి దురుసుగా మాట్లాడుతారు. దీంతో ప్రజలకు ప్రజాప్రతినిధులు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే ఎమ్మెల్యేలే తమ ఫోన్లను దగ్గర పెట్టుకొని నేరుగా ప్రజలతో మాట్లాడాలి” అని సూచించారు. ప్రస్తుతం ఎన్నికల ఖర్చు విపరీతంగా పెరిగిందని, ఇది సమాజానికి మంచిది కాదన్నారు. అతి సామాన్యుడు కూడా పోటీ చేసేలా పరిస్థితులు ఉండాలని అభిప్రాయపడ్డారు. కొత్తగా ఎన్నికైన 57 మంది ఎమ్మెల్యేలు ఈ ప్రోగ్రామ్​ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 

ఇది పార్టీలతో సంబంధం లేని ప్రోగ్రామ్​: మంత్రి శ్రీధర్​బాబు

లెజిస్లేచర్ ఓరియంటేషన్​ మీటింగ్​కు, పార్టీలకు ఎలాంటి సంబంధం లేదని అసెంబ్లీ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ ప్రోగ్రామ్ కు రాకపోవడం విచారకరమన్నారు. ఈ కార్యక్రమాలకు రావాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు, ఆ పార్టీ ఎమ్మెల్సీలకు విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు. ఉత్తమ ఎమ్మెల్యే, ఉత్తమ ఎమ్మెల్సీ అవార్డులు ఇక నుంచి ఏటా ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుందన్నారు. గత పదేండ్లలో ఎప్పుడూ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించలేదని తెలిపారు.

మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని ఎక్కువ రోజులు నడిపితే అంత మంచిదన్నారు. 2014 నుంచి 4 నుంచి 5 రోజులు మాత్రమే సమావేశాలు నడుపుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వీలైనన్ని ఎక్కువ రోజులు నడిపించాలని కోరుతున్నానని చెప్పారు. కార్యక్రమంలో మంత్రులు  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్,  ఎమ్మెల్సీ, పీసీసీ చీఫ్​ మహేశ్ కుమార్ గౌడ్ , తెలంగాణ లెజిస్లేచర్ సెక్రటరీ నరసింహాచార్యులు, 65 మంది ఎమ్మెల్యేలు,  ఎమ్మెల్సీలు హాజరయ్యారు. బీజేపీ ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు. 

బీఆర్​ఎస్​ దూరం 

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం చేపట్టిన ఈ ఓరియంటేషన్​ ప్రోగ్రామ్​ను బీఆర్ఎస్ బహిష్కరించింది. ఆ పార్టీ సభ్యులు ఈ కార్యక్రమానికి అటెండ్​ కాలేదు. అసెంబ్లీ సమావేశాల మొదటి రోజుననే తమను సభలోకి అనుమతించకుండా అడ్డుకున్నారని ఆరోపిస్తూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ ప్రోగ్రామ్ కు దూరంగా ఉన్నారు. 

నేను స్పీకర్​ను.. నాకు ఏ పార్టీతో సంబంధం ఉండదు: గడ్డం ప్రసాద్​

“నేను స్పీకర్​ను.. నాకు ఏ పార్టీతో సంబంధం ఉండదు” అని అసెంబ్లీ స్పీకర్​ గడ్డం ప్రసాద్ కుమార్​ స్పష్టం చేశారు. మంగళవారం కేటీఆర్ తనపై చేసిన విమర్శలకు స్పీకర్ బుధవారం కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఎంసీహెచ్‌‌‌‌‌‌‌‌ఆర్డీ ఇన్​స్టిట్యూట్​లో  ఆయన మీడియాతో మాట్లాడారు. తాను స్పీకర్ కావడానికి బీఆర్ఎస్ కూడా మద్దతు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు.

సీనియర్ సభ్యుడిగా ఉన్న కేటీఆర్ కూడా స్పీకర్ పై విమర్శలు చేయడం సరికాదని ఆయన అన్నారు. అసెంబ్లీ సమావేశాల మొదటి రోజుననే తమను సభకు రాకుండా అడ్డుకున్నారని, సభలో తమకు మాట్లాడే అవకాశం స్పీకర్ ఇవ్వడం లేదని కేటీఆర్ చేసిన ఆరోపణలపై స్పీకర్​ ప్రసాద్  స్పందిస్తూ.. సభలో మాట్లాడేందుకు ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ కు ఎన్ని అవకాశాలు ఇచ్చినా ఆ పార్టీ నేతలు సద్వినియోగం చేసుకోవడం లేదన్నారు.