- కలర్స్ కంపెనీకి స్టేట్ కన్స్యూమర్ ఫోరమ్ ఆదేశాలు
- కస్టమర్ కట్టిన డబ్బులను 9% వడ్డీ,50 వేల పరిహారంతో తిరిగి ఇచ్చేయాలని తీర్పు
హైదరాబాద్ సిటీ, వెలుగు: బరువు తగ్గించడంలో ఫెయిల్ అయినందుకు కస్టమర్ నుంచి వసూలు చేసిన ఫీజును వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని కలర్స్ హెల్త్‌కేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని తెలంగాణ స్టేట్ కన్స్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్(టీఎస్‌సీడీఆర్‌సీ) స్పష్టం చేసింది. వెయిట్ లాస్ ట్రీట్‌మెంట్ పేరుతో వసూలు చేసిన రూ.1.05 లక్షల ఫీజును దానిపై 9% వడ్డీతోపాటు రూ.50 వేల పరిహారం చెల్లించాలని జిల్లా ఫోరం ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
సంగారెడ్డి జిల్లా ఎద్దుమైలారానికి చెందిన ఓ విద్యార్థిని తన బరువు తగ్గించుకునేందుకు 2022లో కలర్స్ హెల్త్‌కేర్ ఇండియాను ఆశ్రయించింది. ఏడాది పాటు చేసే ట్రీట్‌మెంట్ కోసం రూ.50 వేలు అడ్వాన్స్ గా చెల్లించింది. జాయిన్ అయ్యాక మరో రూ.55వేలు చెల్లించింది. ట్రీట్‌మెంట్ స్టార్ట్ చేసి ఎనిమిది నెలలు గడుస్తున్నా యువతి బరువు ఏ మాత్రం తగ్గలేదు. పైగా యువతిని ట్రీట్‌మెంట్ టైంలో సంస్థ స్టాఫ్ తిట్టడంతోపాటు ఇబ్బందులకు గురిచేశారు.
కూతురి పరిస్థితిని గమనించిన తల్లిదండ్రులు తమ ఫీజు తిరిగి ఇవ్వాలని కోరగా..సంస్థ అందుకు నిరాకరించింది. దాంతో బాధితులు డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ ఫోరమ్ ను సంప్రదించారు. ఇరు వర్గాల వాదనలు విన్న జిల్లా ఫోరం.. చికిత్స పేరుతో వసూలు చేసిన రూ.1.05 లక్షలు, దానిపై 9% వడ్డీ, రూ.50 వేల పరిహారం కస్టమర్ కు చెల్లించాలని కంపెనీని ఆదేశిస్తూ తీర్పునిచ్చింది.
ఈ తీర్పును సవాలు చేస్తూ కలర్స్ హెల్త్ కేర్ ఇండియా ప్రతినిధులు స్టేట్ కన్స్యూమర్ ఫోరమ్ ను ఆశ్రయించారు. అయితే, వాదనల అనంతరం రాష్ట్ర ఫోరం ఇన్‌ఛార్జ్ డైరెక్టర్ మీనా రాంనాథన్, జ్యుడిషియల్ మెంబర్ శేషుబాబుల ధర్మాసనం కలర్స్ హెల్త్‌కేర్ అప్పీలును కొట్టివేసింది. డిస్ట్రిక్ట్ ఫోరమ్ ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ..పరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.