మొదలైన పత్తి కొనుగోళ్లు : పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

మొదలైన పత్తి కొనుగోళ్లు : పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ
  • మార్కెట్లు, జిన్నింగ్‌‌‌‌ మిల్లుల వద్ద రైతుల పడిగాపులు
  • కేంద్ర మంత్రిని కలిసి సమస్య పరిష్కరించాలని కోరిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

మంచిర్యాల/చెన్నూరు, వెలుగు : ఆధార్‌‌‌‌ సర్వర్‌‌‌‌ పని చేయకపోవడంతో పది రోజుల నుంచి పత్తి రైతులు పడుతున్న కష్టాలు ఎంపీ వంశీకృష్ణ చొరవతో ఎట్టకేలకు తీరిపోయాయి. సర్వర్‌‌‌‌ను పునరుద్ధరించడంతో గురువారం మధ్యాహ్నం నుంచి కొనుగోళ్లు ప్రారంభం అయ్యాయి. సర్వర్‌‌‌‌ డౌన్‌‌‌‌, ఇతర సాంకేతిక సమస్యల కారణంగా ఈ నెల 10 నుంచి సీసీఐ సెంటర్లలో పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. దీంతో రైతులు.. వ్యవసాయ మార్కెట్లు, జిన్నింగ్ మిల్లుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. 

పత్తి లోడ్‌‌‌‌తో వచ్చిన బండ్లు కిలోమీటర్ల మేర బారులుదీరాయి. రైతుల ఇబ్బందులు తెలుసుకున్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ బుధవారం ఢిల్లీలో కేంద్రమంత్రి జి.కిషన్‌‌‌‌రెడ్డిని కలిసి పత్తి రైతుల సమస్యను వివరించారు. రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో స్పందించిన కిషన్‌‌‌‌రెడ్డి వెంటనే కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌‌‌‌తో చర్చించారు. ఆయన సీసీఐ చైర్మన్‌‌‌‌, ఎండీ లలిత్‌‌‌‌కుమార్‌‌‌‌తో మాట్లాడి ఆధార్‌‌‌‌ సర్వర్‌‌‌‌ను పునరుద్ధరించడంతో కొనుగోళ్లు ప్రారంభం అయ్యాయి. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్‌‌‌‌ నాయకులతో కలిసి గురువారం చెన్నూర్‌‌‌‌ ఎమ్మెల్యే డాక్టర్ జి.వివేక్‌‌‌‌ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ఫొటోలకు క్షీరాభిషేకం చేశారు.

దళారుల దందాకు చెక్

పత్తి కొనుగోళ్లలో దళారుల దందాకు చెక్‌‌‌‌ పెట్టేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు రైతుల పట్టా పాస్‌‌‌‌బుక్‌‌‌‌, ఆధార్‌‌‌‌, బ్యాంక్‌‌‌‌ అకౌంట్‌‌‌‌తో పాటు ఎన్ని ఎకరాల్లో పత్తి సాగు చేశారు ? ఎంత దిగుబడి వచ్చింది ? అనే వివరాలతో పాటు ఏఈవోల ధ్రువీకరణ పత్రం తప్పనిసరి. ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో ఆధార్‌‌‌‌ నంబర్‌‌‌‌ ఎంటర్‌‌‌‌ చేయగానే దానికి లింక్‌‌‌‌ చేసిన ఫోన్‌‌‌‌ నంబర్‌‌‌‌కు ఓటీపీ వస్తుంది. 

ఈ నంబర్‌‌‌‌తో రైతుల పేరిట పత్తి కొనుగోళ్లు జరుగుతున్నాయి. తద్వారా దళారుల దందాకు ఆస్కారం ఏర్పడింది. దీనిని కంట్రోల్ చేయడానికి రైతుల వేలిముద్రలు కూడా తీసుకోవాలని నిర్ణయించారు. రైతులే స్వయంగా సీసీఐ సెంటర్లకు వచ్చి వేలిముద్రలు వేస్తేనే వారి పేరిట పత్తి కొనుగోలు చేస్తామని ఆఫీసర్లు ప్రకటించారు.

చివరి వరకూ కొంటాం : కలెక్టర్‌‌‌‌ కుమార్ దీపక్‌‌‌‌

ఆధార్‌‌‌‌ సర్వర్‌‌‌‌ అందుబాటులోకి రావడంతో జిల్లాలో పత్తి కొనుగోళ్లను పునఃప్రారంభం అయ్యాయని కలెక్టర్‌‌‌‌ కుమార్‌‌‌‌ దీపక్‌‌‌‌ చెప్పారు. గురువారం కలెక్టరేట్‌‌‌‌లో మీడియాతో మాట్లాడారు. పది రోజులుగా కొనుగోళ్లు నిలిచిపోవడం వల్ల రైతుల వద్ద ఉన్న పత్తిని చివరకూ కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రైతులు ఎవరూ ఆందోళన చెందొద్దని, టోకెన్లలో కేటాయించిన తేదీల ప్రకారం పత్తిని తీసుకురావాలని సూచించారు. అందరూ ఒకే సారి వస్తే ఇబ్బందులు ఎదురవుతాయని, దీనిని గమనించి సీసీఐకి సహకరించాలని కోరారు.