జిన్నింగ్ మిల్లుల ఓనర్లతో ప్రభుత్వ చర్చలు సఫలం

జిన్నింగ్ మిల్లుల ఓనర్లతో ప్రభుత్వ చర్చలు సఫలం
  • యధావిధిగా జరిగిన పత్తి కొనుగోళ్లు
  • సీసీఐ నిబంధనలను వ్యతిరేకించిన యజమానులు
  • మంత్రి తుమ్మల నాగేశ్వర రావుతో కలిసి చర్చ

హైదరాబాద్, వెలుగు: జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలతో ప్రభుత్వం నిర్వహించిన చర్చలు సఫలం కావడంతో పత్తి కొనుగోళ్లు తిరిగి ప్రారంభమయ్యాయి. సీసీఐ తీరుకు నిరసనగా పత్తి కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు జిన్నింగ్ మిల్లులు ప్రకటించాయి. దీంతో సోమవారం ఆదిలాబాద్, వరంగల్​లోని ఏనుమాముల, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలోని మార్కెట్లలో కొనుగోళ్లు నిలిచిపోయాయి.

ఈ సమాచారం తెలియక ఆదివారం రాత్రికే వ్యవసాయ మార్కెట్లు, జిన్నింగ్ మిల్లులకు రైతులు పెద్దఎత్తున పత్తి లోడ్లతో తరలివచ్చారు. సోమవారం పొద్దున వ్యాపారులు పత్తి కొనుగోలు చేసేందుకు ముందుకు రాకపోవడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే కొనుగోళ్లు ఎలా నిలిపివేస్తారంటూ మండిపడ్డారు. 

వెనక్కి తగ్గిన సీసీఐ అధికారులు

జిన్నింగ్ మిల్లుల యజమానుల నిరసన నేపథ్యంలో.. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, మార్కెటింగ్ శాఖ సంచాలకులు ఉదయ్ కుమార్ రంగంలోకి దిగారు. సీసీఐ సీఎండీ లలిత్ కుమార్ గుప్తా, స్టేట్ కాటన్ జిన్నింగ్ మిల్లుల సంఘం అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ఇతర సభ్యులతో సమావేశమై చర్చలు జరిపారు. సీసీఐ తీసుకొచ్చిన నిబంధనలు, జిన్నింగ్ మిల్లర్ల అభ్యంతరాలపై చర్చించారు. రైతులకు ఇబ్బంది కల్గకుండా పాత పద్ధతిలోనే పత్తి కొనుగోళ్లు జరుపుతామని సీసీఐ హామీ ఇవ్వడంతో మిల్లుల ఓనర్లు వెనక్కి తగ్గారు. మధ్యాహ్నం నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభించారు.