బుల్లెట్ బండ్లపై నూతన దంపతులు... రిసెప్షన్కు వినూత్న ఎంట్రీ

పెళ్లి రిసెప్షన్ కు మామూలుగా అయితే ఏ కారులోనో..నడుచుకుంటూ లేదా..గుర్రపు బండిపై నవ వధూవరులు వెళ్తుంటారు. ఓ కొత్త జంట మాత్రం వెరైటీగా వెడ్డింగ్ రిసెప్షన్ కు చేరుకుంది. బుల్లెట్ బండ్లపై రాయల్ గా ఎంట్రీ ఇచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో బుల్లెట్ బండ్లపై  పెళ్లి రిసెప్షన్ కు కొత్త జంట హాజరైన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

పాల్వంచకు చెందిన పెండేలా రామకృష్ణారావు ప్రమీల దంపతుల కుమారుడు రవితేజ. ఇతను ఆంధ్రప్రదేశ్ లోని లక్నవరానికి చెందిన డాక్టర్ సింధును జూన్  7వ తేదీన వివాహం చేసుకున్నాడు. ఇందులో భాగంగా రిసెప్షన్ వేడుకను పాల్వంచ పట్టణంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఈ వేడుకుకు నూతన దంపతులు  బుల్లెట్ బండ్లపై వచ్చారు. ఇంటి నుంచి చెరో బుల్లెట్ బండిని నడుపుతూ ఫంక్షన్ హాల్ వరకు చేరుకున్నారు.

బుల్లెట్ బండ్లపై కొత్త జంట వెళ్తుంటే ముందు, వెనుక కుటుంబ సభ్యులు, బంధువులు సైతం ద్విచక్రవాహనాలు నడుపుకుంటూ వారిని అనుసరించారు. అంతేకాకుండా  నూతన దంపతులపై   పూలు చల్లుతూ ఫంక్షన్ హాలుకు తీసుకురావడంతో స్థానికులు ఆసక్తిగా తిలకించారు.