నారసింహుడి సేవలో సీఎస్ శాంతికుమారి

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామిని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి దర్శించుకున్నారు. గర్భగుడిలో స్వయంభూ నారసింహుడిని దర్శించుకుని ప్రధానాలయ ముఖ మండపంలో స్వామివారి ఉత్సవమూర్తులకు అష్టోత్తర పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన సీఎస్ కు ఈవో భాస్కర్ రావు ఆధ్వర్యంలో ఆలయ అధికారులు స్వాగతం పలికారు. ప్రధానాలయ ఉత్తర రాజగోపురం నుంచి ఆలయంలోకి చేరుకున్న ఆమెకు.. త్రితల గోపురం వద్ద ప్రధానార్చకులు నల్లంతిఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు, కాండూరి వెంకటాచార్యుల ఆధ్వర్యంలో అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి స్వామివారి దర్శనం కల్పించారు. 

స్వామివారిని దర్శించుకున్న అనంతరం ప్రధానాలయ ముఖ మండపంలో సీఎస్ కు ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేయగా.. ఈవో భాస్కర్ రావు లడ్డూప్రసాదం, స్వామివారి శేషవస్త్రాలను అందజేసి స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు. అనంతరం కొండపైన కొలువై ఉన్న పర్వతవర్థినీ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో పార్వతీపరమేశ్వరులను దర్శించుకుని లింగమూర్తికి అభిషేకం, బిల్వార్చన పూజలు చేశారు.