
సీఎస్ V/S స్పెషల్ సీఎస్
ఈ నెల 20 దాకా క్లాస్‌లు లేవన్న సీఎస్..
ఒకటి నుంచే మొదలు పెట్టించిన స్పెషల్ సీఎస్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఆన్లైన్ క్లాస్‌లపై పంచాయితీ నడుస్తోంది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గైడ్‌లైన్స్ ను రాష్ట్రంలో అమలు చేస్తామని సీఎస్ ఇచ్చిన ఉత్తర్వులకు.. విద్యాశాఖలో అమలవుతున్న ఉత్తర్వులకు ఏ మాత్రం పొంతలేకుండా పోయింది. సీఎస్ ఆర్డర్స్ ప్రకారం ఈ నెల 20 వరకు ఆన్లైన్ క్లాస్‌లు ఉండవు. కానీ.. ఇప్పటికే స్పెషల్ సీఎస్ ఆర్డర్స్ మేరకు ఈ నెల 1 నుంచే ఆన్లైన్ క్లాస్‌లు స్టార్ట్ అయ్యాయి. ఎవరి ఉత్తర్వులు ఫాలో అవ్వాలో తెలియక హెడ్మాస్టర్లు, టీచర్లు అయోమయానికి గురవుతున్నారు.
కేంద్రం ఏం చెప్పిందంటే..!
కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 29న అన్‌లాక్ 4 గైడ్‌లైన్స్ రిలీజ్ చేసింది. సెప్టెంబర్ 30 వరకు స్కూళ్లు, కాలేజీలు తెరవొద్దని, సెప్టెంబర్ 21 నుంచి ఆన్ లైన్ క్లాసులు మాత్రమే నిర్వహించవచ్చని స్పష్టం చేసింది. ఆన్లైన్ పాఠాల పర్యవేక్షణ కోసం 50 శాతం స్టాఫ్ నే వాడుకోవాలని సూచించింది. 9 నుంచి 12వ క్లాస్ స్టూడెంట్లకు డౌట్స్ ఉంటే, పేరెంట్స్ అనుమతితోనే వారిని బడులకు అనుమతించాలని ఆదేశించింది. వీటిని రాష్ట్రంలోనూ ఉన్నదున్నట్లుగా అమలు చేయాలని జీవో ఎంఎస్ 120ని చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ గత నెల 31న జారీచేశారు. కానీ విద్యాశాఖ స్పెషల్ సీఎస్ చిత్రా రాంచంద్రన్.. ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్‌ను స్కూళ్లకు రావాలని ఆదేశాలిచ్చారు. ఆగస్టు 5న రాష్ట్ర కేబినెట్ నిర్ణయం మేరకే ఆన్లైన్, డిజిటల్ క్లాసులు ప్రారంభిస్తున్నట్లు ఆమె ఆగస్టు 24న ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆగస్టు 27 నుంచి టీచర్లు, లెక్చరర్లు, నాన్ టీచింగ్ సిబ్బంది స్కూళ్లు, కాలేజీలకు వెళ్లాలని ఆ ఆర్డర్స్‌లో స్పష్టం చేశారు. అయితే ఆ తర్వాత ఐదారు రోజులకే కేంద్ర ప్రభుత్వ గైడ్‌లైన్స్ ను అమలు చేస్తున్నట్లు సీఎస్ సోమేశ్ కుమార్ ఆర్డర్స్ ఇచ్చారు. ఆయన ఆర్డర్స్ ప్రకారం స్పెషల్ సీఎస్ ఆర్డర్స్‌లో మార్పులు చేయాల్సి ఉన్నా.. చేయకపోవడం వివాదాస్పదమైంది.
స్కూళ్లలో కరోనా వ్యాప్తి
స్పెషల్ సీఎస్ ఆదేశాలతో లెక్చరర్లు, టీచర్లంతా బడి బాట పట్టారు. కరోనా పాజిటివ్ టీచర్లకు, క్వారంటైన్లో ఉన్నవారికి కూడా మినహాయింపు లేకపోవడంతో వారూ స్కూళ్లకు వస్తున్నారు. దీంతో చాలా స్కూళ్లలో కరోనా వ్యాప్తి మొదలైంది. తొలిరోజే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఓ కేజీబీవీ స్కూల్లో మహిళా టీచర్ కు కరోనా రావడంతో.. మిగిలిన 20 మంది టీచర్లు క్వారంటైన్‌కు పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పలు జిల్లాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి.
20 తర్వాతే ఆన్ లైన్ క్లాసులు: టీచర్స్ యూనియన్లు
పీఆర్టీయూ, టీఎస్‌యూటీఎఫ్, ఎస్టీయూ తదితర టీచర్స్ యూనియన్లు, జాక్టో, టీఎస్పీసీ తదితర జేఏసీలు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయాలని కోరాయి. ఈ నెల 20 తర్వాతే ఆన్లైన్ క్లాసులు ప్రారంభించాలని, అప్పటి నుంచే 50 శాతం టీచర్లను వినియోగించుకోవాలని యూనియన్ల నేతలు విజ్ఞప్తి చేశారు.
కో ఆర్డినేషన్ లోపమే కారణమా?
డిజిటల్ క్లాసుల విషయంలో సీఎస్, స్పెషల్ సీఎస్ ల మధ్య కో ఆర్డినేషన్ లోపం వల్లే గందరగోళం ఏర్పడినట్లు విద్యాశాఖలో చర్చ జరుగుతోంది. కేంద్రం గైడ్‌లైన్స్ ను ఉన్నదున్నట్లు అమలు చేస్తున్నట్టు సీఎస్ ప్రకటించారు. కేబినెట్ నిర్ణయం ప్రకారం క్లాసులు నిర్వహిస్తున్నట్టు స్పెషల్ సీఎస్ చెబుతున్నారు. దీంతో స్పెషల్ సీఎస్ డిజిటల్ క్లాసుల విషయాన్ని సీఎస్ దృష్టికి తీసుకుపోయినా.. సీఎస్ కేంద్ర గైడ్‌లైన్స్ విషయాన్ని స్పెషల్ సీఎస్ తో చర్చించినా.. ఈ సమస్యకు ముందే పరిష్కారం లభించేందని ఆఫీసర్లు చెప్తున్నారు. కానీ ఎవరికి వారే ఉత్తర్వులివ్వడంతో సమస్య వచ్చిందని అంటున్నారు. అయితే సీఎస్ ఆదేశాలే ఫైనల్ కాబట్టి.. సీఎస్ ఆదేశాలను స్పెషల్ సీఎస్ అమలు చేయాలని వారు పేర్కొంటున్నారు.
For More News..