ఉద్యోగాల పేరిట మోసం

ఉద్యోగాల పేరిట మోసం
  • యువతను సైబర్ నేరగాళ్లకు బానిసలుగా అమ్మేస్తున్న ఏజెంట్లు
  • రాష్ట్రవ్యాప్తంగా 9 కేసులు.. 8 మంది అరెస్ట్

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: థాయ్‌‌‌‌లాండ్‌‌‌‌, బ్యాంకాక్‌‌‌‌లో ఉద్యోగాల పేరిట యువతను సైబర్ నేరగాళ్లకు బానిసలుగా అమ్మేస్తున్న ఏజెంట్లు, మధ్యవర్తులను టీజీ సైబర్‌‌‌‌ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌‌‌‌బీ) అధికారులు అరెస్ట్ చేశారు. మొత్తం 15 మందిలో 8 మందిని అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. మరో ఐదుగురు అబ్రాడ్​లో ఉన్నట్లు టీజీ సీఎస్​బీ డైరెక్టర్ శిఖాగోయల్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘జిల్లాల నుంచి యువతను మయన్మార్​కు తరలించిన ఏజెంట్లు, కన్సల్టెన్సీల వివరాలను సీఎస్​బీ అధికారులు సేకరిస్తున్నారు. 

రాష్ట్ర వ్యాప్తంగా ఈ తరహా 9 కేసులు నమోదయ్యాయి. మయన్మార్​లో సైబర్ నేరగాళ్ల వద్ద బానిసలుగా మారిన 540 మంది ఇండియన్లను కేంద్ర ప్రభుత్వం రక్షించి స్వదేశానికి తిరిగి రప్పించింది. వీరిలో తెలంగాణకు చెందిన 24 మంది రెండు విడతల్లో ఈ నెల 10, 11వ తేదీల్లో స్వస్థలాలకు చేరుకున్నారు. వీరిని మోసం చేసి విదేశాలకు తరలించిన ఏజెంట్లపై సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేశాం’’ అని శిఖాగోయల్ పేర్కొన్నారు. విదేశాల్లో ఉద్యోగాల పేరిట వచ్చే ఆఫర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు. ఇలాంటి మోసాలకు గురైతే 1930 లేదా www.cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలని ఆమె పేర్కొన్నారు.