- ఐదేండ్లుగా క్రిమినల్స్ డేటా సేకరించిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో
- దేశంలో ఎక్కడ నేరం జరిగినా గుర్తించేలా డిజిటల్ రికార్డులు సిద్ధం
- రాష్ట్రంలో 16,540 సైబర్ క్రైమ్ లింకులు
హైదరాబాద్, వెలుగు: టెక్నాలజీకి అనుగుణంగా సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త స్కెచ్‌లు వేస్తున్నారు. ఆన్‌లైన్ అడ్డాగా అందినకాడికి దోచేస్తున్నారు. ఫేక్ మొబైల్ నంబర్లు, బ్యాంక్ అకౌంట్లతో పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నారు. ఇలా దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో 96,686 క్రైమ్ లింక్స్‌ను రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో(సీఎస్‌బీ) గుర్తించింది. ఇందులో రాష్ట్రంలో నమోదైన 16,540 క్రైమ్ లింక్స్ ఆధారంగా స్పెషల్ ఆపరేషన్స్ చేస్తున్నది. సైబర్ నేరాల్లో వినియోగించిన 13,435 సిమ్ కార్డులు, 8,292 ఐఎంఈఐ నంబర్లు, 1,416 యూఆర్‌ఎల్ లింక్స్‌ను బ్లాక్ చేసింది. ఈ డేటా బేస్ ఆధారంగానే ఇటీవల రాజస్థాన్‌లో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించింది. సైబర్ నేరగాళ్లకు బ్యాంక్ అకౌంట్లు అందించిన 27 మందిని అరెస్ట్ చేసింది.
గ్రేటర్‌లో రూ.1,009.55 కోట్లు లూఠీ సైబర్ నేరాలను అరికట్టేందుకు సైబర్ సెక్యూరిటీ బ్యూరో స్పెషల్ ఆపరేషన్స్ ప్రారంభించింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని డిస్ట్రిక్ట్ సైబర్ కోఆర్డినేట్ సెంటర్స్, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ నుంచి డేటా సేకరిస్తున్నారు. ఇలా గత ఐదేండ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన సైబర్ క్రైమ్ కేసుల డేటా డేస్‌తో డిజిటల్ రికార్డ్‌లు రూపొందించారు. రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్టర్ అవుతున్న కేసులతో పోల్చితే హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలోనే సైబర్ నేరాలు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఈ ఏడాది 9 నెలల వ్యవధిలోనే 54,103 కేసులు రిపోర్ట్ కాగా.. రూ.1,009.55 కోట్లు సైబర్ నేరగాళ్లు దోచేశారు. ఇందులో కేవలం 10 శాతం కేసులు మాత్రమే ట్రేస్ అవుతున్నాయి.
టార్గెట్ హైదరాబాద్
సౌత్ ఇండియాలోని తమిళనాడు, కేరళ, కర్నాటక, ఏపీతో పోల్చితే హైదరాబాద్‌లో హిందీ, ఇంగ్లీష్ మాట్లాడేవారు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. దీంతో రాజస్థాన్, బిహార్, జార్ఖండ్, వెస్ట్‌బెంగాల్ సహా ఢిల్లీలోని సైబర్ నేరగాళ్లు హైదరాబాద్‌ను టార్గెట్ చేశారు. ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్స్ సహా ట్రేడింగ్, పార్ట్ టైమ్ జాబ్స్ వంటి దాదాపు 25 రకాలుగా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు.
ఇలాంటి సైబర్ నేరాల్లో ఇప్పటికే అరెస్టైన నిందితులు, వారి ఫింగర్ ప్రింట్స్, ఆధార్ నంబర్ వంటి పూర్తి వివరాలను సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు డిజిటల్ రికార్డ్ చేస్తున్నారు. క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాఫికింగ్ నెట్‌వర్క్ అండ్ సిస్టమ్స్ (సీసీసీటీఎన్‌ఎస్)లో అప్‌లోడ్ చేస్తున్నారు. వీటితో పాటు సైబర్ క్రైమ్ కేసుల్లో ఉపయోగించిన ఫోన్ నంబర్స్, ఐపీ అడ్రస్‌లతో డేటా తయారు చేశారు. ఈ విధానంతో దేశంలో ఎలాంటి సైబర్ క్రైమ్ కేసు రిపోర్ట్ అయినా సంబంధిత పోలీసులకు వెంటనే సమాచారం చేరుతుంది. దీంతో ఆయా నేరాలకు సంబంధించిన డేటాబేస్‌తో నిందితులు, డబ్బు ట్రాన్స్‌ఫర్‌అయిన బ్యాంక్ అకౌంట్లను సులభంగా గుర్తించేందుకు అవకాశం ఉంటుంది.
సీక్యాప్స్‌తో రాష్ట్రాల మధ్య కోఆర్డినేషన్
దేశంలోని అన్ని రాష్ట్రాల పోలీసుల మధ్య కోఆర్డినేషన్ కోసం సీక్యాప్స్(సీవైసీఏపీ) పేరుతో సైబర్ క్రైమ్ అనాలసిస్ అండ్ ప్రొఫైలింగ్ సిస్టమ్ ను ఏర్పాటు చేశారు. ఆయా రాష్ట్రాల పోలీసులు పాస్‌వర్డ్స్, యూజర్ ఐడీ ద్వారా సీక్యాప్స్‌ను యాక్సెస్ చేసుకునే అవకాశం కల్పించారు. ఈ క్రమంలోనే మహారాష్ట్ర, కర్నాటక, రాజస్థాన్, జార్ఖండ్, గోవాతో కలిసి మన పోలీసులు జాయింట్ సైబర్ క్రైమ్ కోర్డినేషన్ సెంటర్‌గా ఆపరేషన్స్ చేస్తున్నారు. ఈ ఆరు రాష్ట్రాల పోలీసులు సైబర్ క్రైమ్ డేటాను షేర్ చేసుకుంటున్నారు. సైబర్ నేరాలు, నేరగాళ్ల డేటాబేస్, ఉపయోగిస్తున్న టెక్నాలజీ గురించి అవసరమైన సమాచారం తెలుసుకుంటున్నారు.