బకాయిలు చెల్లించాలని కోరుతున్న పాడి రైతులు

బకాయిలు చెల్లించాలని కోరుతున్న పాడి రైతులు
  • ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పేరుకుపోయిన ఇన్సెంటివ్స్
  • రెండేండ్లలో దాదాపు రూ.2.90కోట్లు పెండింగ్

మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: పాల రైతులకు ప్రోత్సాహం అందడం లేదు. పాడి పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు ఇన్సెంటివ్స్ ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఆ మేర బకాయిలు విడుదల చేయడం లేదు. గత రెండేండ్లుగా ఇదే పరిస్థితి ఉంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు రూ.2.90కోట్లు పెండింగ్ లో ఉన్నాయి. దీంతో పాల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇన్సెంటివ్స్ ఎప్పుడెప్పుడు పడతాయా? అని ఎదురు చూస్తున్నారు.

ఇదీ సంగతి..
విజయ డైరీ ద్వారా పాలు అమ్మే రైతులకు ప్రతి లీటరుకు రూ.4 ఇన్సెంటివ్ ఇస్తామని 2017లో ప్రభుత్వం ప్రకటించింది. గేదె, ఆవు పాలు అమ్మే రైతులు తొలుత దీనిద్వారా లబ్ధి పొందారు. ఏడాది పాటు క్రమం తప్పకుండా నిధులు విడుదల చేసిన ప్రభుత్వం.. ఆ తర్వాత చేతులెత్తేసింది. కాలక్రమేణా నిధులు ఆపేసింది. దీంతో రైతులు విజయ డైరీకి పాలు పోయడం తగ్గించారు. ప్రైవేటు కంపెనీలు నేరుగా లీటర్​కు రూ.50చొప్పున చెల్లిస్తుండడంతో.. అటు వైపే కొందరు రైతులు మొగ్గుచూపుతున్నారు. దీంతో విజయ డైరీ ప్రైవేటు పోటీని తట్టుకునే శక్తి రోజురోజుకూ కోల్పోతోంది.

అంతటా ఇదే పరిస్థితి..
ఉమ్మడి జిల్లా పరిధిలో దాదాపు 7,500 మంది రైతులు  ఏండ్ల నుంచి విజయ డైరీకి పాలు పోస్తున్నారు. తొర్రూరు, మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌, వరంగల్‌‌‌‌‌‌‌‌, నర్సంపేట, సంగెం, ధర్మసాగర్‌‌‌‌‌‌‌‌, ములుగు, ఏటురునాగారం, జనగామలో పాలశీతలీకరణ కేంద్రాలు ఉన్నాయి. వీటి ద్వారా గ్రామాల్లో పాలు సేకరిస్తుంటారు. గేదె పాలకు లీటరుకు రూ.36.50(వెన్నె శాతం 5 ఉంటే) చెల్లిస్తుండగా, ప్రభుత్వ ప్రోత్సాహంతో కలుపుకొని రూ.40.70 చెల్లిస్తారు. వెన్నె శాతం 10శాతం ఉంటే ఇన్సెంటివ్ తో కలుపుకొని రూ.77.40 వరకు చెల్లిస్తారు. ఇక ఆవు పాలకు  లీటర్ కు రూ.35.65(వెన్న శాతం 3 ఉంటే) చెల్లిస్తుండగా.. ఇన్సెంటివ్ తో కలుపుకొని రూ.39.88 రైతులకు ఇస్తారు. కానీ గత రెండేండ్ల నుంచి ప్రభుత్వం ప్రోత్సాహక నిధులు విడుదల చేయడం లేదు. దీంతో రైతుల ఖాతాల్లో పాల డబ్బులు తక్కువగా పడుతున్నాయి. దీనివల్ల తరచూ డైరీ నిర్వాహకులు, రైతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి.

పెండింగ్​బకాయిలు చెల్లించాలి
విజయ డైరీకి పాలుపోస్తున్న రైతులకు ప్రోత్సాహక నిధులు ఇవ్వకపోవడం దారుణం. రైతుల ఆదాయం అంతంతమాత్రంగానే ఉన్న తరుణంలో ప్రభుత్వం ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదు. రైతుల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి. – కందాటి అశోక్ రెడ్డి, కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు

ప్రభుత్వం వద్దే పెండింగ్
రైతులకు సంబంధించిన ఇన్సెంటివ్స్ ప్రభుత్వం వద్దే పెండింగ్ లో ఉన్నాయి. 2020 ఏప్రిల్ నుంచి పెండింగ్ లో ఉన్నాయి. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. సర్కారు నుంచి నిధులు విడుదల కాగానే రైతులకు అందజేస్తాం. – ప్రదీప్, డైరీ డీడీ, ఉమ్మడి వరంగల్ జిల్లా