దశాబ్దిలో చోటులేని పాత్రికేయ రంగం!

దశాబ్దిలో చోటులేని పాత్రికేయ రంగం!

తెలంగాణ కోసం ఎవరు ఎన్ని ఉద్యమాలు చేసినా.. ఫలానా వారు అలా ఉద్యమించారు, ఇలా ఉద్యమించారని వార్తా కథనాల రూపంలో బయటి ప్రపంచానికి తెలిసేలా చేసింది మాత్రం పాత్రికేయులే. ఇది ఎవరైనా ఒప్పుకోక తప్పదు. తెలంగాణ చరిత్రను, సంస్కృతిని, భాష, యాసల పట్ల ప్రజలను చైతన్య పరిచింది, తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవసరాన్ని, దోపిడీకి గురవుతున్న తీరును కళ్ళకు కట్టినట్టుగా వ్యాసాలు, ప్రత్యేక కథనాల రూపంలో ప్రచురితం అయ్యేలా చేసింది తెలంగాణ పాత్రికేయులే. కేవలం వృత్తిపరంగానే కాకుండా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు ఉద్యమానికి నడుం బిగించి ఉద్యమించిన తీరును ఒక్కసారి పరిశీలిద్దాం.

మే 31, 2001 న బషీరాబాగ్​ ప్రెస్ క్లబ్ లో  తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఏర్పాటు చేసి పలు దఫాలుగా జిల్లాలు, మండలాల వ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణలో భాగమై సమైక్యవాదుల ఆగడాలను నిలదీస్తూ స్వరాష్ట్రం కోసం ఉద్యమించారు. 2010 ఏప్రిల్ 28న 'తెలంగాణ కోసం తెలంగాణ జర్నలిస్టులు' అనే నినాదంతో తెలంగాణ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. 2010 అక్టోబర్ 4న తెలంగాణ జర్నలిస్టుల ఆధ్వర్యంలో హైదరాబాద్ లో 'మీడియా మార్చ్' నిర్వహించి ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వాణిని వినిపించారు. 2010 డిసెంబర్ 5న ఆర్టీసీ కళాభవన్ లో రాష్ట్రీయ లోక్ దళ్ నేత అజిత్ సింగ్ హాజరవగా తెలంగాణ పాత్రికేయుల మహా సభ నిర్వహించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను దశదిశలు చాటారు. 2011 మే 19న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తెలంగాణ జర్నలిస్టుల ఫోరం 'ఒక చేత్తో కలం మరో చేత్తో ఉద్యమం' అనే నినాదంతో ధర్నా నిర్వహించి సమైక్యవాద నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. 2012 అక్టోబర్ 16న V6, హెచ్ఎంటీవీ, టీ న్యూస్, వంటి మీడియా సంస్థలపై సీమాంధ్ర ప్రభుత్వం చూపిస్తున్న వివక్షకు వ్యతిరేకంగా ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. 
ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అన్ని వర్గాల కృషిని రాష్ట్ర వ్యాప్తంగా వార్తల ద్వారా, ప్రత్యేక కథనాల ద్వారా, ఎడిటోరియల్ ఆర్టికల్స్ ద్వారా దేశ నలుమూలలకు చాటడమే కాకుండా క్రియాశీలక ఉద్యమాల్లో జర్నలిస్ట్ ల పాత్ర అన్ని వర్గాల ప్రజల కంటే గొప్పదని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

జర్నలిజమే తెచ్చిన తెలంగాణలో వివక్షనా?

దశాబ్ది ఉత్సవాలంటూ వివిధ రంగాల ప్రగతిని సభల రూపంలో చాటుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం.. జర్నలిజం రంగంలో అభివృద్ధిని ఎందుకు చాటుకోలేని స్థితిలో ఉంది? తెలంగాణ కోసం అన్నీ తామై జర్నలిస్టులు చేసిన కృషి బూడిదలో పోసిన పన్నీరేనా? తెలంగాణాలో జర్నలిస్టులు చేసిన తప్పేంటి? స్వరాష్ట్రం కోసం అన్నీ తామై ఉద్యమించడమేనా? రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వార్తలు, ప్రత్యేక కథనాలు, రచనలు, వ్యాసాల రూపంలో ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేయడమేనా? మీడియా సాయం లేకుండానే తెలంగాణ సమగ్ర అభివృద్ధిని ప్రజలకు చేరవేయడం జరుగుతోందా? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో, అభివృద్ధిలో మీడియా పాత్ర లేదా? ఎందుకు జర్నలిస్టులపై ప్రభుత్వం ఇంత వివక్ష చూపుతోంది? స్వరాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో జర్నలిజం రంగం ప్రగతి చెప్పుకోవడానికి ఏమీ లేకపోవడానికి కారణం ఎవరు? అనే ప్రశ్నలు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో రాష్ట్ర జర్నలిస్టుల మదిలో సూదులై పొడుస్తున్నాయి.

ఏది ఏమైనా.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు జర్నలిస్టుల కృషిని ప్రభుత్వం మరిచిపోతే అంతకన్నా దుర్మార్గం మరోటి లేదనేది స్పష్టం. ఇప్పటికైనా జర్నలిస్టులపై ప్రభుత్వ దృక్కోణం మార్చుకొని జర్నలిస్టుల సంక్షేమానికి, అభివృద్ధికి పాటుపడాల్సిన అవసరం ఉంది. దశాబ్ది ఉత్సవాలలో జర్నలిజం రంగం గురించి చెప్పుకోవడానికి ప్రభుత్వం దగ్గర ఎలాగూ ఏమి లేదు. కనీసం రజతోత్సవ ఉత్సవాల నాటికైనా జర్నలిజం రంగాన్ని ప్రభుత్వం అభివృద్ధి చేసుకుంటుందని, అప్పటికి పాత్రికేయ రంగం అభివృద్ధిని సగర్వంగా చాటుకునేలా అప్పటి ప్రభుత్వం ఉండాలని ఆశిద్దాం.

స్వరాష్ట్రంలో ఒరిగింది ఏంటి?

స్వరాష్ట్రం సాధించుకున్నాక ఈ దశాబ్ద కాలంలో తెలంగాణ జర్నలిస్టులకు ఒరిగిన లబ్ది ఏంటి..? అని ఒక్కసారి ఆలోచించుకుంటే ఒరిగిన లబ్ది లేకపోగా.. జర్నలిస్టులు తమ హక్కులను కోల్పోవాల్సి వచ్చింది అని చెప్పవచ్చు. ఇందుకు సాక్ష్యాలుగా ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక వార్తా కథనాలు రాసిన జర్నలిస్టుల పై ఎన్ని కేసులు నమోదు అయ్యాయో పరిశీలించి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి దశాబ్ద కాలంలో స్వరాష్ట్రంలో జర్నలిస్టులపై నమోదైన కేసుల సంఖ్యను ఒక్కసారి పరిశీలిస్తే అర్థమవుతుంది. అలాగే, జర్నలిస్టులకు ప్రతి రెండు సంవత్సరాలకు జారీ చేసే ప్రభుత్వ గుర్తింపు కార్డు అయిన అక్రెడిటేషన్ కార్డుల విషయంలోనూ సమైక్య రాష్ట్రంలో లేని నిబంధనలు స్వరాష్ట్రం ఏర్పడ్డాక పెద్ద, చిన్న, మధ్యస్థ దినపత్రికలు, చానెళ్లు అంటూ విపరీతమైన కొత్త నిబంధనలు విధించి కార్డుల జారీలో కోత విధించి జర్నలిస్టుల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇక జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి అరచేతిలో వైకుంఠం చూపినట్టు స్విమ్మింగ్ పూల్, స్పోర్ట్స్ ఇండోర్ స్టేడియం, కమ్యూనిటీ హాల్ ఇతరత్రా సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కట్టించి ఇచ్చే బాధ్యత తనదేనని స్టేట్మెంట్ లు ఇవ్వడం విదితమే.. కానీ ఈ దశాబ్ద కాలంలో సీఎం ఇచ్చిన మాటలు నిలుపుకోకపోగా ఒక్క ఖమ్మం జిల్లా జర్నలిస్టులకు తప్పితే మరే ఇతర జిల్లాల జర్నలిస్టులకు కనీసం ఇంటి స్థలాలు అయినా కేటాయించిన దాఖలాలు కనిపించలేదు.

భావవ్యాప్తి జరిపింది జర్నలిస్టులే

ఆంధ్రా యాజమాన్యాల చేతిలో ఉన్న మీడియా సంస్థల్లో పని చేస్తూ మా ఆకాంక్ష తెలంగాణ సాధన అంటూ గళమెత్తి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అందుకు సంబంధించిన వార్తలు, వ్యాసాలు, ప్రత్యేక కథనాలు రాసి తీరుతామని జీతాలు ఇవ్వకపోయినా, యాజమాన్యాల శిక్షలకోర్చి, కుటుంబం బజారున పడ్డా ఆర్ధిక ఇబ్బందులకోర్చి స్వరాష్ట్రం కోసం ఉద్యమించింది తెలంగాణ పాత్రికేయులే..! సీమాంధ్ర ఏలుబడిలో అణచివేతకు గురైన సమాజాన్ని ప్రజల జీవన స్థితిగతులను ప్రపంచానికి చూపిన ఘనత తెలంగాణ జర్నలిస్టులదే. ఎవరు ఎన్ని ఉద్యమాలు చేసినా వాటిని పత్రికా ప్రచురణల రూపంలోనో, టివి, రేడియో మాధ్యమాల ద్వారా ప్రసారం చేయటమో లేకపోయి ఉంటే తెలంగాణ ఉద్యమం అంత ఉవ్వెత్తున ఎగసిపడేదా? భావవ్యాప్తి జరిగేదా? ఉద్యమ తీవ్రత ఢిల్లీకి తెలిసేదా? అని ఒక్కసారి ప్రశ్నించుకుంటే తెలంగాణ ఉద్యమంలో పాత్రికేయుల పాత్ర ఏంటో ఇట్టే అర్థమయిపోతుంది.


- శ్రీనివాస్ గుండోజు,జర్నలిస్ట్​