భద్రాచలం,వెలుగు: దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా భద్రాచలంలో బుధవారం వైద్య,ఆరోగ్యశాఖ నిర్వహించిన కార్యక్రమంలో ప్రోటోకాల్ గొడవ జరిగింది. మాజీ ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ లీడర్ బాలసాని లక్ష్మీనారాయణను వేదికపైకి పిలవడంతో భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య అలిగి వెళ్లిపోయారు. ముందుగా భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో కంటి పరీక్షల శిబిరాన్ని ఎమ్మెల్యే వీరయ్య ప్రారంభించారు.
ఆ తర్వాత కేకే ఫంక్షన్హాలులో దశాబ్ది ఉత్సవాల వేడుక జరిగింది. దీనికి మాజీ ఎమ్మెల్సీ బాలసాని ముందుగా రావడంతో ఆయనను వేదికపైకి ఆహ్వానించారు. ఇదే సమయంలో ఉత్సవాలకు ఎమ్మెల్యే వీరయ్య వచ్చారు. అయితే బాలసాని లోపల ఉన్న విషయాన్ని బయట నుంచే తెలుసుకున్నారు. బాలసానిని వేదికపైకి పిలిచారని తెలుసుకుని అసహనం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ తెలియదా అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లోపలికి పోకుండానే వీరయ్య వెనుతిరిగి వెళ్లిపోయారు.