దశాబ్ది ఉత్సవాలు పండుగలా నిర్వహించాలి : జగదీశ్ రెడ్డి

సుర్యాపేట, వెలుగు: తెలంగాణ అవతరణ దశాబ్ది వేడుకలను పండుగలా నిర్వహించాలని మంత్రి జగదీశ్​రెడ్డి అన్నారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఉత్సవాల నిర్వాహణపై గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన నియోజకవర్గ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. సంబరాలలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు  అందుకున్న లబ్ధిదారులతో పాటు ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. సంక్రాంతిని మరిపించేలా రైతులు ఈ సంబరాలలో పాల్గొనేలా చూడాలని  కోరారు. 

కాంగ్రెస్ ది కొంగజపం.. బీజేపీది దొంగజపం

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొంగ జపం చేస్తుండగా, బీజేపీ దొంగ జపం చేస్తోందని మంత్రి ఆరోపించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దశాబ్ది ఉత్సవాలపై బీజేపీ, కాంగ్రెస్​ రాజకీయం చేస్తున్నాయన్నారు. ఆ రెండు పార్టీలకు దశాబ్ది ఉత్సవాల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. తెలంగాణ గురించి రాజీనామా అంటేనే తోక ముడిచిన కిషన్ రెడ్డి ఇప్పుడు ఈ ఉత్సావాల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. 

సద్దుల చెరువుకు అంతర్జాతీయ సొబుగులు

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ ను అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు మంత్రి జగదీశ్​ రెడ్డి ప్రకటించారు. ప్రఖ్యాత డిజైనర్లతో ప్రణాళికలు రూపు దిద్దుకుంటున్నాయని ఆయన వెల్లడించారు. గురువారం రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ ఎండీ మనోహర్, మున్సిపల్ చైర్మన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ, అడిషనల్ కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, సూర్యాపేట మున్సిపల్ కమిషనర్ రామంజుల్ రెడ్డితో కలిసి ఆయన సద్దుల చెరువును సందర్శించారు. మినీ ట్యాంక్ బండ్ లో పర్యాటకుల విహారం కోసం త్వరలో బోట్ షికారును ప్రారంభించనున్నట్లు తెలిపారు. 

సక్సెస్ చేయాలి

యాదాద్రి/నల్గొండ అర్బన్/హాలియా/హుజూర్ నగర్ :  దశాబ్ది ఉత్సవాల్లో ప్రజలు పాల్గొని సక్సెస్​ చేయాలని  శాసన మండలి చైర్మన్​ గుత్తా సుఖేందర్​రెడ్డితోపాటు పలువురు, ఎమ్మెల్యేలు, నాయకులు పిలుపునిచ్చారు. గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్​లో ఏర్పాటు చేసే వేడుకలకుగుత్తా  ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. యాదాద్రి కలెక్టరేట్​లో గురువారం నిర్వహించిన మీటింగ్​లో ప్రభుత్వ విప్​, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత  మాట్లాడారు. ఉత్సవాల్లో అన్ని వర్గాల ప్రజలకు భాగస్వామ్యం కల్పించాలన్నారు. అభివృద్ధికి సంబంధించిన వివరాలను ఎక్కడికక్కడ ప్రదర్శించాలని అధికారులను ఆదేశించారు. హాలియా వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో  నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ ఉత్సవాలకు సంబంధించి సన్నాహక సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. వేడుకలను విజయంతం చేయాలని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఓ ప్రకటనలో కోరారు.  ఆయాచోట్ల పలువురు నాయకులు ఉత్సవాలపై ప్రజాప్రతినిధులకు, ప్రజలకు పలు సూచనలు చేశారు.