ఏపీకి ఎన్ని నీళ్లు ఇస్తే.. మాకు అన్ని ఇవ్వాలి: తెలంగాణ డిమాండ్

ఏపీకి ఎన్ని నీళ్లు ఇస్తే.. మాకు అన్ని ఇవ్వాలి: తెలంగాణ డిమాండ్
  • కృష్ణా ట్రిబ్యునల్ ముందు తెలంగాణ డిమాండ్
  • కృష్ణా డెల్టా స్కీమ్​కు పోలవరం నుంచి 80 టీఎంసీల తరలింపు
  • సాగర్​ ఎగువన కర్నాటక, మహారాష్ట్రకు 35 టీఎంసీలు, ఏపీకి 45 టీఎంసీలు ఇచ్చేలా గతంలో ఒప్పందం
  • చింతలపూడి లిఫ్ట్​ ద్వారా మిగులు జలాలను సాగర్ ఎడమ కాల్వ చివరి ఆయకట్టుకు ఇవ్వాలి
  • సాగర్​ ఎడమ కాల్వ నుంచి ఇన్​బేసిన్ అవసరాలకే వాడాలని స్పష్టీకరణ

హైదరాబాద్, వెలుగు: పోలవరం నుంచి కృష్ణా డెల్టా స్కీమ్​కు ఏపీ నీటిని తరలిస్తే.. కృష్ణాలో తెలంగాణకు అదనంగా 45 టీఎంసీలు కేటాయించాల్సిందేనని కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ 2 ముందు తెలంగాణ స్పష్టం చేసింది. గోదావరి నీటిని కృష్ణాకు మళ్లిస్తే.. కృష్ణాలో తమకు ఎక్కువ వాటా కావాలంటూ కర్నాటక, మహారాష్ట్రలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయని గుర్తు చేసింది. 

ఏపీ రెండు, మూడో పంటలకూ నీళ్లు తీసుకెళ్లాలనుకుంటే గోదావరి నుంచే తీసుకోవాలని, కృష్ణాలో ఒక్క చుక్క కూడా వాడుకోవద్దని ఆ రెండు రాష్ట్రాలు డిమాండ్​ వినిపిస్తున్నాయని పేర్కొంది. ఈ వివాదాన్ని పరిష్కరించుకునేందుకు కర్నాటక, మహారాష్ట్రలతో ఏపీ 1978లో ఒప్పందం చేసుకున్నదని వివరించింది. పోలవరం నుంచి కృష్ణా డెల్టాకు తరలించే 80 టీఎంసీల్లో నాగార్జునసాగర్​కు ఎగువన 35 టీఎంసీలను ఆ రాష్ట్రాలకు ఇచ్చేలా ఒప్పందం కుదిరిందని పేర్కొంది. 

మిగతా 45 టీఎంసీలు ఏపీ వాడుకుంటుందని తెలిపింది. ప్రస్తుతం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయినందున.. ఏపీకి ఎంత కోటా వచ్చిందో అంత మేర కృష్ణా జలాలను తెలంగాణకు కేటాయించాలని తేల్చి చెప్పింది. గురువారం ట్రిబ్యునల్​లో తెలంగాణ తరఫున సీనియర్ అడ్వకేట్​ సి.ఎస్. వైద్యనాథన్ వాదనలు వినిపించారు. ఈ క్రమంలోనే గోదావరి వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్​లో పేర్కొన్న అంశాలను ట్రిబ్యునల్ దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పటికే పోలవరం నీళ్లను బనకచర్లకు తరలించుకుపోయేలా పోలవరం కాల్వల కెపాసిటీలను పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నదని పేర్కొన్నారు. ఇందులో నాగార్జునసాగర్​ నీటినీ సప్లిమెంట్​లాగా వాడుకునేలా కుడి కాల్వనూ జీబీ లింక్​లో ప్రపోజ్ చేశారని అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఔట్​సైడ్ బేసిన్​కే..

ఏపీ ప్రస్తుతం చేపడుతున్న జీబీ లింక్​తో పాటు చింతలపూడి లిఫ్ట్, తాడిపూడి లిఫ్ట్ స్కీమ్ విస్తరణలతో నీళ్లను ఔట్ సైడ్ బేసిన్​కే తరలించేందుకు ప్లాన్ చేస్తున్నదని తెలంగాణ అడ్వకేట్లు వాదనలు వినిపించారు. కృష్ణా డెల్టా స్కీమ్ చేపట్టేటప్పుడు తొలుత డ్రైన్ వాటర్ గురించి ప్రస్తావించలేదని, ఆ తర్వాత డీపీఆర్​ను మార్చి డ్రైన్ వాటర్​ను చేర్చారని గుర్తు చేశారు. 

కేడీఎస్​కు తరలించాలనుకుంటున్న 152.2 టీఎంసీల జలాల్లో ఆ డ్రైన్ వాటర్స్​ను కూడా చేర్చాల్సిన అవసరం ఉందని కోరారు. ఏటా 3 వేల నుంచి 4 వేల టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నాయని, ఆ నీళ్లనే చింతలపూడి స్కీమ్​ ద్వారా ఔట్​బేసిన్​కు తరలించాలని సూచించారు. ప్రస్తుతం సాగర్ ఎడమ కాల్వ ద్వారా ఏపీలోని చివరి ఆయకట్టుకు నీళ్లిస్తున్నారని, అలాంటి ప్రాంతాలకు చింతలపూడి ద్వారా నీటిని తరలించుకోవచ్చని పేర్కొన్నారు. కాబట్టి సాగర్ ఎడమ కాల్వ నీటిని కేవలం ఇన్​సైడ్ బేసిన్ అవసరాలకే వినియోగించేలా చూడాలన్నారు. తదుపరి వాదనలు మే 14 నుంచి 16 వరకు కొనసాగనున్నాయి.

తాగునీటికి 17 టీఎంసీలు కావాలి:కేఆర్ఎంబీకి తెలంగాణ లేఖ

రాష్ట్రంలో తాగునీటి అవసరాల కోసం 17 టీఎంసీల నీళ్లు కావాలని కేఆర్ ఎంబీకి తెలంగాణ తెలిపింది. జులై వరకు ఆ మేరకు నీటి కేటాయింపులు చెయ్యాలని కోరుతూ ఏఎన్ సీ అనిల్ కుమార్ గురువారం బోర్డుకు లేఖ రాశారు. కృష్ణ బేసిన్ లోని జనాభాకు అనుగుణంగా 17 టీఎంసీలు అవసరమవుతాయని తెలిపారు. అయితే ప్రస్తుతం సాగర్​లో నీటి ఆవిరి నష్టాలు కాకుండా కేవలం 16 టీఎంసీల నీళ్లే ఉన్నాయని, మొత్తం నీటిని తెలంగాణ అవసరాలకే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.