- కేఆర్ఎంబీ మీటింగ్‌లో తెలంగాణ డిమాండ్
- లేదంటే 50 శాతమైనా కేటాయించాలి
- 2015లో జరిగిన 66:34 ఒప్పందం.. ఆ ఒక్క ఏడాదికే
- ఏపీకి 66% కేటాయిస్తే,76 శాతం నీళ్లు తీసుకెళ్లింది
- 11 ప్రాంతాల్లో టెలిమెట్రీలు ఏర్పాటు చేయాలి
- శ్రీశైలం డ్యామ్ ప్లంజ్ పూల్వద్ద పడిన గొయ్యికి రిపేర్లు చేపట్టాలని కోరిన అధికారులు
హైదరాబాద్, వెలుగు: కృష్ణా జలాల్లో 71 శాతం వాటా తెలంగాణకే దక్కాలని కేఆర్ఎంబీ మీటింగ్ లో రాష్ట్ర అధికారులు తేల్చి చెప్పారు. అంతర్జాతీయ నదీ ఒప్పందాల ప్రకారం పరీవాహక ప్రాంతం, కరువు ప్రాంతాలు, నది పరీవాహకంలోని జనాభా నిష్పత్తి ఆధారంగా నీటి కేటాయింపులు చేపట్టాలని కోరారు.
అదీ కుదరకపోతే రెండు రాష్ట్రాలకు సగం చొప్పున వాటాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. పరీవాహక ప్రాంతం ఆధారంగా ఏపీకి 29 శాతం నీళ్లే వస్తాయని తెలిపారు. కానీ 2015లో జరిగిన ఒప్పందం ప్రాతిపదికన ఏపీకి 66 శాతం, తెలంగాణకు 34 శాతం నీళ్లు కేటాయించారని చెప్పారు.
అంతేకాకుండా ఆ కేటాయింపులకు మించి, 76 శాతం మేర నీటిని ఏపీ తరలించుకుపోతున్నదని పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్ లోని జలసౌధలో కృష్ణా రివర్మేనేజ్మెంట్బోర్డు (కేఆర్ఎంబీ) 19వ సమావేశం నిర్వహించారు.
బోర్డు చైర్మన్అతుల్ జైన్నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర ఇరిగేషన్ శాఖసెక్రటరీ రాహుల్‌బొజ్జా, ఈఎన్సీలు అనిల్ కుమార్, విజయ్‌భాస్కర్‌రెడ్డి, ఇంటర్స్టేట్వాటర్ రీసోర్సెస్ఎస్ఈ విజయ్‌కుమార్, నల్గొండ సీఈ అజయ్‌కుమార్, ఏపీ ఈఎన్సీ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
టెలిమెట్రీల ఏర్పాటుకు ఏపీ ససేమిరా..
బేసిన్అవతలకు తరలిస్తున్న జలాల లెక్కింపుకు 11 ప్రాంతాల్లో టెలిమెట్రీలు ఏర్పాటు చేయాలని తెలంగాణ కోరింది. అయితే అందుకు ఏపీ అంగీకరించలేదు. దీనిపై ప్రభుత్వాన్ని అడిగి చెబుతామని ఏపీ ఈఎన్సీ వెంకటేశ్వర్లు తెలిపారు.
టెలిమెట్రీల ఏర్పాటు అంశంపై కమిటీ వేద్దామని బోర్డు చైర్మన్అతుల్ జైన్ సూచించగా.. అందుకు కూడా ఏపీ ఈఎన్సీ నిరాకరించినట్టు తెలిసింది. మరోవైపు ఏపీ చేపడుతున్న బనకచర్ల, రాయలసీమ లిఫ్ట్ఇరిగేషన్ ప్రాజెక్టులు, తెలంగాణలో చేపడుతున్న పాలమూరు–రంగారెడ్డి, కొడంగల్లిఫ్ట్ఇరిగేషన్స్కీమ్వంటి వాటిపై చర్చకు రాగా.. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి చర్చ వద్దని బోర్డు అధికారులు చెప్పినట్టు సమాచారం.
ప్రస్తుతం నీటి వాటాల కేటాయింపుకు సంబంధించి ట్రిబ్యునల్‌లో వాదనలు జరగనుండడంతో ఆ తర్వాతే వాటి గురించి మాట్లాడితే బాగుంటుందని చెప్పినట్టు తెలిసింది. కాగా, కృష్ణా బోర్డు ప్రతిపాదించిన రూ.24 కోట్ల బడ్జెట్‌కు రెండు రాష్ట్రాలూ ఆమోదం తెలిపాయి. ఇక బోర్డు ఆఫీసును విజయవాడకు తరలించే అంశంపై ప్రభుత్వాన్ని అడిగి నిర్ణయం చెబుతామని ఏపీ ఈఎన్సీ చెప్పారు. సమావేశంలో బోర్డు అధికారులు రఘునాథ్, రవిచంద్ర, వేణు, శ్రీధర్, శివశంకర్ పాల్గొన్నారు.
71:29 నిష్పత్తిలో వాటాలుండాలి: రాహుల్ బొజ్జా
2015లో ఏపీ, తెలంగాణ మధ్య జరిగిన 66:34 నీటి వాటాలు ఆ ఒక్క ఏడాదికేనని ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్‌బొజ్జా తెలిపారు. బోర్డు మీటింగ్అనంతరం ఈఎన్సీ అనిల్‌కుమార్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
నీటి వాటాలపై ప్రస్తుతం ట్రిబ్యునల్‌లో విచారణ కొనసాగుతున్నదని.. తెలంగాణకు 71 శాతం, ఏపీకి 29 శాతం చొప్పున నీటి వాటాలు కేటాయించాలని ట్రిబ్యునల్‌లో ఇప్పటికే వాదనలు వినిపిస్తున్నామని చెప్పారు. ఇదే అంశాన్ని కేఆర్ఎంబీకి కూడా వివరించామని తెలిపారు. ట్రిబ్యునల్ తీర్పు వచ్చే వరకు ఈ వాటాలు ఇవ్వాలని, లేదంటే కనీసం సగం వాటానైనా తెలంగాణకు కేటాయించాలని కోరామని తెలిపారు.
ఏపీ 500 టీఎంసీలు వాడుకుంది: ఈఎన్సీ అనిల్
శ్రీశైలం, నాగార్జునసాగర్ డ్యాముల సేఫ్టీకి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై బోర్డు మీటింగ్‌లో చర్చించామని ఈఎన్సీ అనిల్‌కుమార్ తెలిపారు.‘‘ శ్రీశైలం డ్యామ్ప్లంజ్ పూల్వద్ద ఏర్పడిన గొయ్యికి త్వరగా రిపేర్లు చేయించాలని ఏపీకి విజ్ఞప్తి చేశాం.
300 నుంచి 400 మీటర్ల లోతుతో ఆ గొయ్యి ఏర్పడింది. నిరుడు కృష్ణా జలాల్లో తెలంగాణ 180 టీఎంసీలే వాడుకుంటే, ఏపీ 500 టీఎంసీలకుపైగా వాడుకున్నది. ఆ నీటిని అడ్జస్ట్ చేయాలని కేఆర్ఎంబీని కోరాం. అందుకు బోర్డు సానుకూలంగా స్పందించింది. ఏపీ ప్రభుత్వం చేపట్టిన గోదావరి–బనకచర్ల లింక్ ప్రాజెక్టు డీపీఆర్‌ను, అందుకు సంబంధించిన అన్ని వివరాలను కూడా అందివ్వాలని బోర్డును కోరాం” అని చెప్పారు.
పాత వాటాలే ఉండాలి: ఏపీ ఈఎన్సీ
గతంలో జరిగిన ఒప్పందం మేరకు 66:34 నిష్పత్తిలోనే నీటి వాటాలను కొనసాగించాలని బోర్డును కోరామని ఏపీ ఈఎన్సీ వెంకటేశ్వర్లు తెలిపారు. నీటి వాటాలను తగ్గించడం వల్ల ఏపీలో ఇప్పటికే సాగులో ఉన్న ఆయకట్టుపై ప్రభావం పడుతుందని చెప్పామన్నారు. ‘‘శ్రీశైలం డ్యామ్‌వద్ద పడిన భారీ గొయ్యిపై రూ.15 కోట్లతో సీఎస్ఎంఆర్ఎస్(సెంట్రల్సాయిల్అండ్మినరల్ రీసెర్చ్‌స్టేషన్)తో స్టడీ చేయిస్తున్నాం. రిపోర్టు అనంతరం చర్యలు తీసుకుంటాం. ఆలోపు తాత్కాలిక మరమ్మతులు చేయిస్తాం. దీనిపై సెంట్రల్వాటర్కమిషన్కు కూడా వివరాలు ఇస్తాం” అని చెప్పారు.
నీటి వాటాలపై త్రీమెన్ కమిటీలో నిర్ణయం: బోర్డు చైర్మన్
నీటి వాటాల కేటాయింపుపై ముగ్గురు సభ్యుల కమిటీతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని, ప్రస్తుతం ఆ అంశం ట్రిబ్యునల్‌లో ఉన్నందున ఇప్పుడే ఏం చెప్పలేమని కేఆర్ఎంబీ చైర్మన్ అతుల్కుమార్జైన్తెలిపారు. అందుబాటులో ఉన్న జలాలను రెండు రాష్ట్రాలు సర్దుబాటు చేసుకోవాలని సూచించారు. నాగార్జున సాగర్‌నుంచి సీఆర్పీఎఫ్బలగాలను తొలగించేందుకు రెండు నెలల సమయం ఇవ్వాలని కోరారు. ఆలోగా ఎలాంటి వివాదాలు, గొడవలు లేకుండా రెండు రాష్ట్రాలు చూసుకోవాలని.. ఆ తర్వాత కేంద్రానికి ప్రతిపాదనలు పంపి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.