కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా పెంచండి

కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా పెంచండి
  • 16వ ఆర్థిక సంఘాన్ని కోరనున్న రాష్ట్రం
  • తెలంగాణలో నేడు, రేపు సంఘం పర్యటన

హైదరాబాద్, వెలుగు: కేంద్ర  పన్నుల్లో రాష్ట్ర వాటా పెంచాలని 16వ ఆర్థిక సంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరనుంది. సోమ, మంగళవారం 16వ ఆర్థిక సంఘం  రాష్ట్రంలో పర్యటించనుంది. సంఘం చైర్మన్​ అరవింద్​పనగారియా, ఇతర సభ్యులు ఇప్పటికే హైదరాబాద్​ చేరుకున్నారు. దీంతో వివిధ విభాగాల్లో ఆర్థిక సంఘాన్ని నిధులు కోరేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. జనాభా ప్రాతిపదికన మాత్రమే కాకుండా అభివృద్ధి కార్యకలాపాలను కూడా పరిగణనలోకి తీసుకుని రాష్ట్రాల వాటాపై నిర్ణయం తీసుకోవాలని ప్రతిపాదించనుంది.

ఇక వర్షాలు, వరదలు, కరువులు వచ్చినప్పుడు వినియోగించే విపత్తు నిధులనూ పెంచాలని, ప్రభుత్వం విజ్ఞప్తి చేయనుంది. అదే సమయంలో నిబంధనల విషయంలోనూ కేంద్రానికి సిఫార్సులు చేయాలని చెప్పనున్నట్లు తెలిసింది. ఆరోగ్య శాఖకు పీహెచ్​సీలకు ఇచ్చే గ్రాంట్లు కూడా మరింత పెంచాలని అధికారులు అడగనున్నారు. కాగా.. పన్నుల ఆదాయంలో 41 శాతం రాష్ర్టాలకు హక్కుగా పంచాల్సి ఉంటే, కేంద్రం ఇప్పుడు 29.6 శాతమే ఇస్తున్నది. మిగతా 11.4 శాతం సెస్సుల రూపంలో కేంద్రం ఆదాయాన్ని సమకూర్చుకొంటున్నది.

రాష్ట్రాలకు 62 శాతం ఖర్చులు ఉంటే 37 శాతం ఆదాయం వస్తున్నదని, కేంద్రానికి 37 శాతం ఖర్చులు ఉంటే 63 శాతం ఆదాయం వస్తున్నదని 16వ ఆర్థిక సంఘానికి అధికారులు వివరించనున్నారు. స్థానిక సంస్థలైన పంచాయతీలు, మున్సిపాలిటీలకు ఇస్తున్న గ్రాంట్లు మరింత పెంచాలని కోరనున్నారు.రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకూ ప్రత్యేక గ్రాంట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేయనున్నారు. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నది. మూసీ రివర్​ ఫ్రంట్ తో పాటు యంగ్  ఇండియా స్కిల్  యూనివర్సిటీకి ప్రత్యేక నిధులు అడగనుంది.