- ప్రజాపాలన విజయవంతంగా ఏడాది పూర్తి
- ఇబ్బందులొచ్చినా కొనసాగిస్తం: భట్టి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర సర్కారు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా వాణిలో ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తున్నది. ఏడాది కాలంలో ఇప్పటివరకూ 27 వేలకుపైగా దరఖాస్తులను పరిష్కరించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు కొలువుదీరిన మరుస టి రోజే ప్రగతి భవన్ ను ప్రజా భవన్‌గా మార్చి సీఎం రేవంత్ రెడ్డి ప్రజా వాణి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ నెల 8వ తేదీకి సరిగ్గా ప్రజావాణి కార్యక్రమం మొదలుపెట్టి ఏడాది అవుతున్నది. ఈ సందర్భంగా వార్షిక రిపోర్ట్‌ను ప్రభుత్వం రిలీజ్ చేసింది. వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ ప్రజావాణికి ఇప్పటివరకూ మొత్తం 82,955 అప్లికేషన్లు వచ్చాయి. ఇందులో గ్రీవెన్స్‌కు సంబంధించినవి 43, 272 ఉండగా.. 62 శాతం పరిష్కారమయ్యాయి. మిగతావి ప్రాసెస్ లో ఉన్నట్టు వెల్లడించారు.
ప్రభుత్వ ఉద్యోగులు, వారి గ్రీవెన్స్‌కు సంబంధించి 4,713 అర్జీలు వచ్చినట్టు తెలిపారు. ఇక మిగిలిన 34,970 అప్లికేషన్లు ప్రభుత్వ పథకాలు, లబ్ధికి సంబంధించినవి కాగా.. అర్హత, నిబంధనల ప్రకారం వాటిని ప్రాసెస్ చేయాలని ఆయా శాఖలకు ఫార్వ ర్డ్ చేసినట్టు వెల్లడించారు. ధరణిలో సమస్యల పరిష్కారానికి, ఆరోగ్య సమస్యలకు సంబంధించి వెంట వెంటనే పరిష్కారం చూపించారు.
ప్రతి పౌరుడికి నమ్మకం కలిగేలా: భట్టి
ప్రజావాణి ఏడాది పూర్తయిన సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంగళవారం స్వయంగా ప్రజా భవన్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్ని ఇబ్బందులొచ్చినా ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ‘‘ప్రజావాణిలో ఇచ్చిన దరఖాస్తులు పరిష్కారం అవుతున్నాయి. ప్రతి పౌరుడికి నమ్మకం కలిగేలా ప్రజావాణి నిర్వహిస్తున్నాం. ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, ప్రజల అవసరాలు తీర్చాలనేదే మా ప్రభుత్వ లక్ష్యం. మీ కోసమే మేం ఉన్నామనే భావన ప్రజలకు అధికారులు కల్పించాలి. రాజ్యాంగ పీఠికలోని లక్ష్యాలను ప్రజలకు అందించాలని ప్రయత్నిస్తున్నాం’’ అని భట్టి తెలిపారు.
ప్రజావాణి కార్యక్రమాన్ని భవిష్యత్తులో మరింత మెరుగుపరుస్తామని తెలిపారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం 70 ఏండ్లు వెనక్కి పోయిందని విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని, ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నామని వివరించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజావాణి ఏర్పాటు చేశామని, నిరంతర పర్యవేక్షణతో ప్రజా సమస్యలకు పరిష్కారం చూపుతున్నామని తెలిపారు. ఆదిలాబాద్‌లో పోడు భూముల పట్టాలకు తమ ప్రభుత్వం పరిష్కారం చూపించిందని చెప్పారు. అటవీ ప్రాంతాల్లో నివసించే వారికి సోలార్ పవర్ ఇస్తామని పేర్కొన్నారు. ఏ శాఖలో సమస్య ఉన్నా ప్రజావాణిలో పరిష్కారం దొరుకుతుందని చెప్పారు.
వారానికి 2 రోజులు.. ఇబ్బందుల్లేకుండా ఏర్పాట్లు
వారంలో మంగళ, శుక్రవారాలు మహాత్మా జ్యోతిబాఫూలే భవన్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇక్కడ అర్జీ రాయడం రాని వాళ్లకు కూడా ఇబ్బంది లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. అక్కడున్న సిబ్బంది ప్రజల సమస్యను తెలుసుకొని, దరఖాస్తు రాసి ఇస్తున్నారు. అలాగే, దరఖాస్తులను స్వీకరించేందుకు ప్రజావాణిలో విభాగాలవారీగా ప్రత్యేక డెస్క్‌లను ఏర్పాటు చేశారు.
రెవెన్యూ నుంచి తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, సీసీ ఎల్ఏ అధికారులు, పోలీస్ విభాగం నుచి సీఐ, డీఐజీ, డీసీపీ ర్యాంకు అధికారులు, హెల్త్ తో పాటు అన్ని సంక్షేమ విభాగాల నుంచి అడిషనల్ డైరెక్టర్ స్థాయి అధికారులు ప్రజావాణి డెస్క్ లలో అందుబాటులో ఉంటారు. ఆరోగ్య శ్రీ జనరల్ మేనేజర్ అధ్వర్యంలో ఆరోగ్యశ్రీ డెస్క్ ఉంటుంది.