రేషన్ కార్డులు లేని 6 లక్షల మంది కుటుంబాలకు రూ.2 లక్షల రుణమాఫీ: డిప్యూటీ సీఎం భట్టి కీలక ప్రకటన

హైదరాబాద్: తెలంగాణలో రైతు రుణ మాఫీపై హాట్ హాట్ గా చర్చ జరుగుతున్న వేళ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. రేషన్ కార్డులు లేని ఆరు లక్షల మంది రైతు కుటుంబాలకు రుణమాఫీ అందిస్తామని ప్రకటించారు. ఆగస్టు దాటకుండానే రెండు లక్షల రుణమాఫీ పూర్తి చేస్తామని చెప్పారు. రుణమాఫీ కార్యక్రమం అమలు చేసేందుకు నిద్రలేని రాత్రులు గడిపామని గుర్తుచేశారు. రూపాయి రూపాయి పోగుచేసి ఈ కార్యక్రమం చేపట్టామని, అన్ని కుటుంబాలకు రుణమాఫీ చేస్తామని భట్టి స్పష్టం చేశారు. ఎవరిని వదలం అని రైతులకు డిప్యూటీ సీఎం భట్టి భరోసా కల్పించారు. ప్రజాభవన్ లో కాంగ్రెస్ కీలక నాయకులు సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దిశానిర్దేశం చేశారు. రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రతి పోలింగ్ బూత్, ప్రతి ఓటర్ దగ్గరకు తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తల ఎత్తుకొని ఎక్కడ తగ్గకుండా ప్రచారం చేయాలని సూచించారు. మిగులు బడ్జెట్తో అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం లక్ష రూపాయల రుణమాఫీని 25,000 చొప్పున నాలుగు దఫాలుగా పూర్తి చేసిందని గుర్తుచేశారు. ఏడు లక్షల కోట్ల అప్పులతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ రెండు లక్షల రుణమాఫీనీ నెలల వ్యవధిలోనే అమలు చేస్తుందని భట్టి చెప్పారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే ఐదు హామీలు అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. అయితే అనుకున్నంతగా ఈ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రచారం జరగడం లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. 

పార్లమెంటు ఎన్నికల ముందు సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టులోపు 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటిస్తే అంతా ఆశ్చర్యపోయారని,  సీఎం సవాల్ ఓట్ల కోసమే.. ఎన్నికల సవాల్ అనుకున్నారని చెప్పారు. కానీ.. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ రూపాయి రూపాయి పోగుచేసి రుణమాఫీని అమలు చేయబోతున్నామని తెలిపారు. కాంగ్రెస్ నేతలందరికీ పెద్ద ఎత్తున ఉపయోగపడే కార్యక్రమం రుణమాఫీ అని, చెప్పిన మాట ప్రకారం చేస్తున్నామని ప్రతి గ్రామానికి కాంగ్రెస్ నాయకులు వెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని వివరించి రైతులు ప్రజల హృదయాలు గెలవాలని కాంగ్రెస్ కార్యకర్తలకు, నేతలకు భట్టి సూచించారు.

Also Read :- అన్నారం బ్యారేజ్‌ టెస్టుల నిలిపివేత