నైనీ బ్లాక్​లో మార్చి నుంచి బొగ్గు ఉత్పత్తి

నైనీ బ్లాక్​లో మార్చి నుంచి బొగ్గు ఉత్పత్తి
  • అక్కడే 1600 మెగావాట్ల పవర్​ ప్లాంట్​ నిర్మాణం
  • అవసరమైన స్థలాన్ని కేటాయించండి ఒడిశా సీఎం మోహన్​ చరణ్​కు డిప్యూటీ సీఎం భట్టి వినతి
  • కోణార్క్​లో జాతీయ మైనింగ్​మంత్రుల సదస్సుకు హాజరు

హైదరాబాద్​, వెలుగు: ఒడిశాలోని నైనీ బ్లాక్​లో మార్చి నెల నుంచి బొగ్గు ఉత్పత్తి ప్రారంభిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. అక్కడే 1600 మెగావాట్ల పవర్​ ప్లాంట్​ నిర్మించేందుకు సింగరేణి సిద్ధంగా ఉందని తెలిపారు. ఒడిశాలోని కోణార్క్ లో జరుగుతున్న 3వ జాతీయ మైనింగ్ మంత్రుల సదస్సుకు సోమవారం భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ సందర్భంగా ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీతో ఆయన భేటీ అయ్యారు.

 అంగూల్ జిల్లా నైనీలో కోల్ మైన్​ఏర్పాటుకు సహకరించినందుకు ఒడిశా ప్రభుత్వానికి భట్టి విక్రమార్క కృతజ్ఞతలు తెలియజేశారు. ఒడిశాలోని నైనీ బొగ్గు గని సమీపంలో పిట్ హెడ్ ఓవర్ ప్లాంట్ గా 1600 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్​ను ఏర్పాటు చేయాలని సింగరేణి భావిస్తున్నదని మాఝీ దృష్టికి తీసుకెళ్లారు. నైనీ క్యాప్టివ్ బ్లాక్ కావడంతో ఇక్కడ ఉత్పత్తి చేసిన బొగ్గును మంచిర్యాల జిల్లా జైపూర్​లోని థర్మల్​ పవర్ ప్లాంట్​కు తరలించేందుకు దాదాపు 1,000 కిలోమీటర్ల దూరం అవుతుందని, లాజిస్టిక్స్​కు ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు.

 గనులకు దగ్గరగా కొత్త థర్మల్ విద్యుత్ ప్లాంట్లను స్థాపిస్తే బొగ్గు రవాణా ఖర్చు తగ్గడం, నాణ్యమైన విద్యుత్ సరఫరా, పర్యావరణ పరిరక్షణతోపాటు విద్యుత్తు ఉత్పత్తి లాభదాయకంగా ఉంటుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.  నైనీ బొగ్గు గని సమీపంలో సింగరేణి ఆధ్వర్యంలో థర్మల్ పవర్ ప్రాజెక్టును స్థాపించేందుకు తగిన భూమిని కేటాయించాలని, ఈ మేరకు సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని ఒడిశా సీఎం మాఝీకి ఆయన ఓ లేఖను అందజేశారు. 

వచ్చే రెండేండ్లలో 32 ఖనిజ బ్లాక్​ల వేలం

వచ్చే రెండేండ్లలో 32 పెద్ద ఖనిజాల బ్లాకులను వేలం వేయాలన్న కార్యాచరణ ప్రణాళికతో తెలంగాణ ప్రభుత్వం ఉందని భట్టి విక్రమార్క తెలిపారు. ఒడిశాలోని కోణార్క్ కేంద్రంగా జరుగుతున్న మూడవ జాతీయ ఖనిజ మంత్రుల సమావేశానికి సోమవారం ఆయన హాజరై, మాట్లాడారు. ‘‘తెలంగాణ రాష్ట్రం లైమ్ స్టోన్, ఐరన్ ఓర్, మాంగనీసు, క్వార్డ్జ్, గ్రానైట్, రోడ్డు మెటల్, డోలమైట్ తదితర పెద్ద, చిన్న ఖనిజ నిక్షేపాలతో సమృద్ధిగా ఉంది. రాష్ట్రంలో 2014లో ఖనిజ ఆదాయం రూ.1,958 కోట్లు ఉండగా.. 2023–24 నాటికి రూ.5,540 కోట్లకు పెరిగింది. రాష్ట్రంలో మొత్తం 2,552 మైనింగ్,  ఖనిజ గనుల లీజులు ఉన్నాయి. నదీ తీరంలోని మట్టి, మెట్ట ఖనిజాల కోసం ప్రత్యేకమైన విధానాన్ని రూపొందించాం. 

పర్యావరణ, ఇతర నిబంధనలకు తగ్గట్టు రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ అనుమతులు తీసుకుని ఇసుకను తవ్వడం, ప్రజలకు ఆన్‌‌లైన్‌‌లో అందుబాటులో ఉంచడం ద్వారా తక్కువ ధరలకు విక్రయిస్తున్నది” అని వివరించారు. 2024లో సూర్యాపేట జిల్లాలో 2 లైమ్‌‌స్టోన్ బ్లాక్‌‌లను వేలం వేసి బిడ్డర్లకు పత్రాలను జారీ చేశామన్నారు. చిన్న ఖనిజాల లీజుల మంజూరుకు అవసరమైన అనుమతులతో బ్లాక్‌‌ల వేలం విధానాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. ఖనిజాలు విలువైన ప్రకృతి సంపద అని, అవి ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ముడిసరుకుగా ఉంటాయన్నారు. ఖనిజాల అన్వేషణ,  నిర్వహణ  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యాల ప్రకారం ఉండాలని ఆయన పేర్కొన్నారు.