
హైదరాబాద్, వెలుగు: క్రీడలను, క్రీడా రంగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. శుక్రవారం సచివాలయంలోని తన చాంబర్‌లో స్పోర్ట్స్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ తెలంగాణ (ఎస్‌జేఏటీ) 2025 డైరీని భట్టి విక్రమార్క ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ గత బడ్జెట్‌లో క్రీడా రంగానికి అధిక నిధులు కేటాయించామని తెలిపారు. ఇకపైనా ఇదే పంథా కొనసాగిస్తూ, క్రీడా రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో నేషనల్ గేమ్స్ నిర్వహించేందుకు చొరవ తీసుకుంటానని డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌జేఏటీ ప్రెసిడెంట్ కృష్ణా రెడ్డి, జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ దాస్, వైస్ ప్రెసిడెంట్ సంజయ్, జాయింట్ సెక్రటరీ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.