- గుంటూరు మార్కెట్‌కు మన మిర్చి
- ప్రతీ రోజు లారీల్లో తరలిపోతున్న సరుకు
- ఇక్కడి కంటే క్వింటాల్‌కు రూ.5వేల దాకా ఎక్కువ
- ఆఫీసర్లతో కుమ్మక్కై రేటు తగ్గిస్తున్న స్థానిక వ్యాపారులు
- మార్కెట్లపై నియంత్రణ లేని తెలంగాణ సర్కారు
- ఏపీకి క్యూ కడుతున్న మిర్చి రైతులు
జయశంకర్ భూపాలపల్లి/ వెంకటాపురం, వెలుగు : తెలంగాణ దేశీ మిర్చి గుంటూరు మార్కెట్‌కు తరలిపోతోంది. వరంగల్, ఖమ్మం వ్యవసాయ మార్కెట్లలో జరుగుతున్న మోసాలను భరించలేక రైతన్నలు తమ పంటను గుంటూరుకు తరలిస్తున్నారు. ఇక్కడి లాగా వ్యవసాయ మార్కెట్లలో మిర్చి కొనే వ్యాపారులు కుమ్మక్కై ఒకేసారి రేట్ తగ్గించడం.. తూకం మోసాలు వంటివి అక్కడ లేకపోవడం రైతులకు కలిసొస్తున్నది. కొనుగోలుదారులు ఎక్కువగా ఉండడంతో మంచి ధరకు తమ పంటను అమ్ముకుంటున్నారు. మన రాష్ట్రంలో దేశి 341 రకం మిర్చికి క్వింటాల్‌కు రూ.16,500 వరకు చెల్లిస్తుండగా గుంటూరులో కనిష్ఠ ధరే రూ.18 వేలు ఉంది. గరిష్ఠంగా క్వింటాల్‌కు రూ.23 వేల వరకు పెడుతున్నట్లు రైతులు చెబుతున్నారు. దీంతో క్వింటాల్‌కు రూ.5 వేలకు పైగా అధికంగా వస్తుండడంతో భూపాలపల్లి, ములుగు జిల్లాల నుంచి ప్రతీ రోజు పది, పదిహేను లారీలలో మిర్చి లోడ్లు గుంటూరు మార్కెట్‌కు తీసుకెళ్తున్నారు. ఇప్పటికే గడిచిన వారం పది రోజుల్లో సుమారు రూ.150 కోట్లకు పైగా విలువైన మిర్చి పంటను విక్రయించినట్లుగా రైతులు తెలిపారు. మరో రెండొందల కోట్ల సరుకు గుంటూరు మార్కెట్‌కు వెళ్లడానికి రెడీగా ఉన్నట్లు చెబుతున్నారు.
గుంటూరు మార్కెట్ కే ఎందుకు?
వరంగల్, ఖమ్మం వ్యవసాయ మార్కెట్లలో ప్రతీ రోజు ఉదయం జెండా పాట పెట్టి ఆ రోజుకు మిర్చి ధరను నిర్ణయిస్తారు. ఈ సందర్భంగా వరుస క్రమంలో ముందున్న మిర్చికే ప్రయారిటీ ఇస్తారు. దీని కారణంగా జెండా పాట పెట్టిన మిర్చిలాట్ కన్నా వరస క్రమంలో వెనుక ఉన్న మిర్చి మంచి క్వాలిటీ ఉన్నా తక్కువ రేటుకే అమ్ముడు పోతోంది. ఈ రెండు మార్కెట్లలో మిర్చి కొనే వ్యాపారులు (బయ్యర్లు) చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. ఆ రోజు మార్కెట్ కు ఎక్కువ సరుకు వస్తే.. కమీషన్ వ్యాపారులు సిండికేట్ గా మారి రేటు తగ్గిస్తారు. మార్కెట్ కమిటీ వాళ్లు, మార్కెటింగ్ శాఖ ఆఫీసర్లు సైతం బయ్యర్లకు సపోర్ట్ చేసి రైతుల నడ్డి విరుస్తున్నారు. తరుగు పేరిట బస్తాపై 2 కిలో ల వరకు దోపిడీ చేస్తున్నారు. ఒకవేళ రైతుకు ధర నచ్చకపోతే మిర్చి బస్తాలను కోల్డ్ స్టోరేజ్ లో పెట్టుకుందామంటే ఇవి ఎక్కువ సంఖ్యలో లేవు. ఉన్నా అవి కూడా బయ్యర్ల అధీనంలోనే నడుస్తున్నాయి.గుంటూరు మార్కెట్లో జెండా పాట పెట్టిన తర్వాత మిర్చి క్వాలిటీ బట్టి రేటు నిర్ణయిస్తారు. జెండా పాట అనేది ఆ రోజుకు మెజర్మెంట్ మాత్రమే. మిర్చి క్వాలిటీని బట్టి రేటు స్వల్పంగా తగ్గడం, పెరగడం జరుగుతుంది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద మిర్చి మార్కెట్ ఇది. ఇక్కడ మిర్చి కొనే వ్యాపారులు (బయ్యర్లు) వందల సంఖ్యలో ఉంటారు. కుమ్మక్కై ధరలను తగ్గించి రైతులను దోచుకోవడం అనేది చాలా తక్కువ. తూకం మోసాలు కూడా చాలా తక్కువ. మార్కెట్ ధర తగ్గితే రైతులు తమ మిర్చి బస్తాలను కోల్డ్ స్టోరేజీలో దాచుకోవచ్చు. గుంటూరు వ్యవసాయ మార్కెట్‌కు అనుబంధంగా వందల సంఖ్యలో కోల్డ్ స్టోరేజ్ లు ఉన్నాయి.
రేటులో భారీ తేడా..
గుంటూరు వ్యవసాయ మార్కెట్ రేట్లకు వరంగల్, ఖమ్మం వ్యవసాయ మార్కెట్లలోని మిర్చి రేట్లకు భారీ తేడా కన్పిస్తుంది. ఇక్కడ వ్యాపారులు కుమ్మక్కై కొద్ది రోజులుగా రేట్లను ఘోరంగా తగ్గించారు. దేశీ రకం, 341 రకం మిర్చి క్వింటాల్‌కు రూ.16,500 మించి రేటు పెట్టడం లేదు. సరుకు క్వాలిటీ పేరిట భారీగా ధరలు తగ్గించి కొంటున్నారు. అదే గుంటూరు మార్కెట్‌లో ఇదే మిర్చికి గరిష్ఠంగా రూ.23 వేల నుంచి కనిష్ఠంగా రూ.18 వేల వరకు చెల్లిస్తున్నారు. అక్కడికి అమ్మడానికి పట్టుకెళ్లిన మిర్చి బ్యాగులను మార్కెట్ సిబ్బంది జాగ్రత్తగా చూసుకుంటారు. వరంగల్, ఖమ్మం మార్కెట్ లో కాంటా, క్వాలిటీ చెకింగ్ సాకుతో రెండు, మూడు కేజీల మిర్చిని తీసివేస్తారు. గుంటూరు మార్కెట్ కన్నా ఏనుమాముల మార్కెట్లో రైతుల దగ్గర నుంచి అధికంగా కమీషన్ తీసుకుంటారు.
పంటకు సరైన ధర ..
గుంటూరు మిర్చి మార్కెట్ కు పట్టుకెళ్లిన మిర్చి బ్యాగులను సిబ్బంది జాగ్రత్తగా చూసుకుంటారు. మన మార్కెట్లలో లాగా కాంటా, క్వాలిటీ చెకింగ్ సాకుతో రెండు, మూడు కేజీలను తీసివేయరు. ఇక్కడ మార్కెట్ కు ఎక్కువ సరుకు వస్తే.. కమీషన్ వ్యాపారులు సిండికేట్ గా మారి రేటు తగ్గిస్తారు. గుంటూరులో అలా చేయరు. ఇవన్నీ చూసుకున్నాకే పంటను గుంటూరుకు తీసుకెళ్తున్నాం.
‒చిటమట నారాయణ, రైతు, వాజేడు, ములుగు జిల్లా
మన మిర్చికి మంచి డిమాండ్..
గుంటూరు మిర్చి మార్కెట్లో మన ఏరియాలో పండిన మిర్చికి మంచి డిమాండ్ ఉంది. నేను ప్రతీ సంవత్సరం 30 ఎకరాల్లో మిర్చి సాగు చేస్తాను. మూడు కోతలకు గాను 800 క్వింటాళ్ల మిర్చి పండిస్తాను. పండించిన పంట మొత్తం గుంటూరు మార్కెట్లో అమ్ముతాను. మార్కెట్ లో దిగుమతి, కాంటా రుసుం, షాపు కమీషన్ తక్కువ తీసుకుంటారు. దోపిడీ తక్కువ. ఒకేసారి రేటు డౌన్ చేయడం జరగదు. కొనుగోలు చేసిన వెంటనే డబ్బులు చెల్లిస్తారు.
‒ గడ్డం వివేక్, రైతు, వెంకటాపురం, ములుగు జిల్లా