దారితప్పిన పాలనతో ఆగమైన తెలంగాణ : దిలీప్‌‌‌‌రెడ్డి

దారితప్పిన పాలనతో ఆగమైన తెలంగాణ : దిలీప్‌‌‌‌రెడ్డి

సకల రక్షణ చర్యలు, నిఘా, గస్తీ నడుమ ఒంటి స్తంభపు మేడపై దాక్కున్నా.. పరీక్షిత్‌‌‌‌ మహారాజు బతకలేదు. పండులో పురుగై వచ్చిన తక్షకుడనే పాముతో చావు తప్పలేదు. వందల మంది టెలిఫోన్‌‌‌‌ సంభాషణల్ని రహస్యంగా విని, రాజకీయ ప్రత్యర్థుల ఎత్తులకు పై ఎత్తులు వేసి, స్వపక్షీయులపైనే పాముపడగలా నిరంతర నిఘా కమ్మి, జర్నలిస్టుల నుంచి జడ్జీల దాకా వ్యక్తిగత సంభాషణల్లో దూరి, వారందరి గోప్యత హక్కును కాలరాసి.. చివరకు ఏం సాధించినట్టు? రాజ్యాంగ స్ఫూర్తిని మంటగలిపి, రాజ్యపు దౌర్జన్యాలకు హద్దులు చెరిపి, రాజకీయంగా ఆధిపత్యం పొందాలని చేసిన యత్నాలన్నీ వికటించాయి. 

ప్రజాక్షేత్రంలో ఘోరపరాజయం తప్పలేదు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం తెలంగాణలో గత పదేండ్ల పాలన ఎలా ఉంది అంటే?   అభివృద్ధి, సంక్షేమ పథకాల్ని సమన్వయపరచినా, పెద్ద ప్రాజెక్టులు కట్టినా, సగటు జీడీపీ పెంచినా, వృద్ధిరేటు సాధించినా, రాజ్యపు దురాగతాలకు, అవినీతి, బంధుప్రీతికి, అప్రజాస్వామిక వాతావరణానికి, అధినేత అహంకార ధోరణికి అన్నీ కొట్టుకుపోయాయి. విలువైన కాలం.. వేళ్ల సందుళ్లోంచి జారిపోయింది. మంచికి మంచి, చెడుకు చెడు.. విడదీసి చూస్తే జనం కళ్లకు గోచరించే పదేండ్ల పాలనా చిత్రం ఇదే!

సబ్బండ వర్ణాలకు చెందిన సకల జనుల ఆకాంక్ష ఉద్యమమై ఉవ్వెత్తున లేస్తే.. పరిష్కారంగా ఏర్ప డింది తెలంగాణ రాష్ట్రం. ఎన్నో ఆశలు, మరెన్నో ఆకాంక్షలు! తొలిదశ నుంచి మలిదశకు మారుతున్నపుడు ఓ హెచ్చరిక ఉద్యమకాలమంతా చెర్నాకొలాలా తెలంగాణ సమాజపు వీపుమీద రళక్‌‌‌‌.. రళక్‌‌‌‌... మనేది. రేపు ఏర్పడబోయేది ‘కేవలం భౌగోళిక తెలంగాణ కాదు, కాకూడదు, అది సామాజిక తెలం గాణ కావాలి’ అన్నదే ఆ నినాదం! చివరకు ఏమైంది? లక్ష్యాలకు తూట్లుపడ్డాయి. వాగ్దానాలు భంగమయ్యాయి. అధికారానికి ఒక కుటుంబమే కేంద్రకమైంది. నియోజకవర్గాలు ఎమ్మెల్యేల జాగీర్లయ్యాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రవాదుల కలలు కల్లలయ్యాయి. ఉద్యమానికి ఊపిరిలూదిన అసలు-సిసలు తెలంగాణ వాదులకు, పచ్చి అవకాశవాదంతో దిగిన ‘బంగారు తెలంగాణ బ్యాచ్‌‌‌‌’ కు మధ్య నిత్య ఘర్షణ అనివార్యమైంది. 

అభివృద్ధి ముసుగులో..

ఉద్యమానికి ఊపిరిలూదిన మూడు పదాల ‘మూలమంత్రం’ నీళ్లు, నిధులు, నియామకాలు..అడుగడుగునా భంగపడింది. విద్యుత్తు సరఫరా మెరు గయింది కానీ, మోయలేని ఆర్థిక భారాన్ని మిగిల్చింది. ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకున్నాయి కానీ, పుట్టబోయే వారి నెత్తినా ఇప్పట్నుంచే లక్షల కోట్ల అప్పుల భారం వచ్చిపడింది. వ్యవసాయం మళ్లీ నిర్లక్ష్యానికి గురైంది. రాజధాని నగరంలో రోడ్లు-, ఫ్లైఓవర్లు వంటి సదుపాయాలు పెరిగినా.. ఆర్థిక అంతరాలు అసాధారణమయ్యాయి. ఆధునికులు జబ్బలు చరుచుకునే ‘అభివృద్ధి’ ముసుగులో ఇసుక, విలువైన ఇతర ఖనిజాలతో పాటు సహజనవరులను ‘అయినవారు’ స్వేచ్ఛగా కొల్లగొట్టారు.

ఐరావతాలు మిగిలాయి

 సంప్రదింపులు, చర్చ, సమీక్ష.. ఏదీ లేకుండా చేపట్టిన పెద్ద సాగునీటి, విద్యుత్‌‌‌‌ ప్రాజెక్టులు కడకు ‘ఐరావతాలు’గా మిగిలాయి. కాళేశ్వరం, యాదాద్రి, భద్రాద్రి, పాలమూరు ఎత్తిపోతల.. వంటివన్నీ ప్రత్యక్ష ఉదాహరణలు! ఆయా ‘బడా ప్రాజెక్టుల’ పేరుతో రాష్ట్ర ఖజానా ఖాళీ అయి, అప్పులు నెత్తినపడి, ‘తమవారి’ బొక్కసాలు మాత్రం సమృద్ధిగా నిండాయి. ఇప్పుడా ప్రాజెక్టులు ‘కరవమంటే కప్పకు కోపం, వదలమంటే పాముకు కోపం’లాగ తయారయాయి. కొనసాగిస్తే కొంప కొల్లేరయ్యే ఆర్థిక భారం, వదిలేసినా తప్పని అపరాధ రుసుం భారం! అవన్నీ అవినీతి నిలయాలుగా మారడమే కాకుండా ఇప్పుడు ప్రజలకు ఎందుకూ పనికిరాకుండా పోవడం రెండువిధాల‌‌‌‌ నష్టం.

మంచయితే తాను..

తెలంగాణ దక్కన్‌‌‌‌ పీఠభూమి కావడంతో చెరువుల పునరుద్ధరణకు ప్రాధాన్యత ఇవ్వాలని ‘మిషన్‌‌‌‌ కాకతీయ’ చేపట్టింది ప్రభుత్వం. అటువంటిదే, ఇంటింటికీ తాగునీటి కోసం చేపట్టిన ‘మిషన్‌‌‌‌ భగీరథ’. వాటిల్లో అవినీతి ఆరోపణల సంగతెలా ఉన్నా.. ప్రజలకు కొంత ఉపయోగపడ్డాయనే భావన తొలి అయిదేండ్ల కాలంలో ఉండింది. మలి విడత ప్రభుత్వంలో విమర్శలకు తావిచ్చేలా సాగింది వాటి నిర్వహణ! కాళేశ్వరం ప్రాజెక్టును చారిత్రాత్మక ఎత్తిపోతలుగా చెప్పుకున్నపుడు ‘అంతా తానే!’ అయిన అధినేత, పంపులు మునిగి, పిల్లర్‌‌‌‌ ఇసుకలో కుంగినప్పుడు మాత్రం మౌనాన్ని ఆశ్రయించారు. 

కీలకమైన చాలా విషయాల్లో ఆయనది ఇదే పంథా! రాష్ట్రంలో నిరవధికంగా నాణ్యమైన విద్యుత్తు ఇచ్చామనేది  బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రభుత్వ పెద్దల వాదన. కానీ, అధిక ధరకు విద్యుత్‌‌‌‌ కొనుగోళ్లు చేసి, జెన్‌‌‌‌కో, డిస్కంలను దివాలా తీయించి, మొత్తం వ్యవస్థను ఎంతలా భ్రష్టుపట్టించారంటే.. అసలు బాధ్యత తీసుకునే వారే ఉండరు!

స్వామికార్యం, స్వీయకార్యం

 రాబడి ఉన్న విభాగాలు, స్వీయ ప్రయోజనాలుంటేనే తప్ప మిగతా శాఖల్లో ఏండ్ల తరబడి.. నిఘా, నిర్వహణ లేక, సరైన సమీక్షలు జరుగక వ్యవస్థలన్నీ నిద్రాణమైపోయాయి. తమకు ప్రయోజనాలో, ఆసక్తో లేని విభాగాలన్నింటినీ అధికారుల ఇష్టారాజ్యానికి వదిలివేయడం పదేండ్ల పాలనలో పెద్ద లోపం. అందుకు, ‘టెలిఫోన్‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌’ లో వెలుగుచూస్తున్న అంశాలే నిలువెత్తు సాక్ష్యాలు! 

అభివృద్ధా? అది ఓ బ్రహ్మపదార్థం

రాష్ట్రంలో ఉపఎన్నికలు జరిగితే తప్ప ‘అభివృద్ధి’ అసాధ్యం అనే పరిస్థితి వచ్చింది. ఈ విషయంలో సవాళ్లు- ప్రతిసవాళ్ల ఫలితంగానే ‘మునుగోడు’కు ఉపఎన్నిక వచ్చింది! అంతకు ముందు జరిగిన దుబ్బాక, హుజూర్‌‌‌‌నగర్‌‌‌‌, నాగార్జునసాగర్‌‌‌‌, హుజూరాబాద్‌‌‌‌ ఉప ఎన్నికల వేళ ప్రభుత్వ నిర్వాకాల వల్లే ఆ అభిప్రాయం జనంలో బలపడింది. అప్పటివరకు ఆ వంకే చూడని సర్కారు, ఉప ఎన్నిక అనగానే ఆగమేఘాల మీద అన్నీ సమకూర్చడం, పెండింగ్‌‌‌‌ నిధుల విడుదల, విచ్చలవిడిగా మద్యం, డబ్బు, కానుకలు, భవిష్యత్‌‌‌‌ హామీలు గుప్పించడం రివాజయింది. ‘ఎలక్షన్‌‌‌‌ అయి, కోడ్‌‌‌‌ పోని..నేనొచ్చి, కుర్చీ వేసుకొని పనులు చేసిపెట్టి పోతా’ అనే హామీ ఒకటి తేరగా దొరికేది. అలా తప్ప మరోలా ఏ నియోజకవర్గమూ ప్రగతికి నోచని పరిస్థితి. అభివృద్ధి అంటే, గజ్వేల్‌‌‌‌, సిద్దిపేట, సిరిసిల్ల మాత్రమే! మిగతా ఏవీ బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ సర్కారుకు పట్టలేదు.

దర్శనాలు కరువు

 నిజానికి నియోజకవర్గాలన్నీ ఎమ్మెల్యేల సంస్థానాలు! వారు ఆడింది ఆట, పాడిందిపాట! వారందరినీ గణరాజ్యాధీశులుగా పరిగణించే అధినేత, తనను తాను చక్రవర్తి అనుకుంటారు. ఎమ్మెల్యేలకూ దర్శనాలు లేవు, మంత్రులకూ అపాయింట్‌‌‌‌మెంట్‌‌‌‌ దుర్లభం. ఏలిన వారే కాదు, వారి ముఖ్య అధికారులూ ఎవరినీ కలిసే పరిస్థితే లేదు. ప్రశ్నించడాన్ని, నిరసించడాన్ని ఏ మాత్రం సహించని పెద్దలకు పోలీసు వ్యవస్థ మొత్తం ఊడిగం చేసేది. ఏ ఊరికి సీఎం వెళ్లినా, కడకు మంత్రులు వెళ్లినా.. ముందే ఆ గ్రామాన్ని చెరబడతారు. హౌస్​ అరెస్టులు చేస్తారు.

ప్రజాభిప్రాయానికి చోటు లేదు

లక్షల కుటుంబాలలోని కోట్ల మంది అస్తిత్వంతో ముడిపడ్డ భూమి యాజమాన్య హక్కుల అంశం ఖరారు చేసే ‘ధరణి’ రూపకల్పనలోనూ ప్రజాసమూహాల అభిప్రాయాలకు చోటు దక్కలే! రెవెన్యూ విభాగమే రద్దయినా, నిర్ణయం ఏకపక్షమే! ప్రజాస్వామ్య వాతావరణమే రాష్ట్రంలో బలహీనపడుతూ వచ్చింది. ‘కాపురం చేసే కళ.. కాళ్లు తొక్కిననాడే తెలిసింద’న్నట్టు.. ఎన్నికైన ఎమ్మెల్యేల పార్టీ మార్పిడి పర్వంతో మొదలైంది బంగారు తెలంగాణ స్వీయ రాష్ట్ర పాలన!  

నియంతృత్వాన్ని  సహించని తెలంగాణ

నిధులు కేటాయించక స్థానిక సంస్థలు నిర్వీర్యమయ్యాయి. పాలకపక్ష సర్పంచులు కూడా నిరసనగా బిచ్చమెత్తిన, ఆత్మహత్యలకు పాల్పడ్డ దృశ్యాలు పలు జిల్లాల్లో కళ్లకు కట్టాయి. అననుకూల పరిస్థితులను, స్వీయ కష్టాలనైనా భరించే తెలంగాణ సమాజం అప్రజాస్వామిక ధోరణులను, నియంతృత్వ పాలనను సహించదని నిరూపిస్తూ పదేండ్ల పాలనకు జనం స్వస్తి పలికారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరాక దాదాపు ఆరు మాసాల పాలనా ఈ దశాబ్దిలోదే! జనం గమనిస్తున్నారు, సమయం వచ్చినప్పుడు తీర్పు వెల్లడిస్తారు. ఇది ప్రజాస్వామ్యం అని గుర్తించుకుంటే చాలు.

ఎవరినీ లెక్కచేయనితనం

ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు వంటి చర్చలు, సంప్రదింపులు ఈ పదేండ్ల కాలంలో ఓ రకంగా మరుగునపడ్డాయి. ఉద్యమానికి వేదిక కట్టిన ఉస్మానియా విశ్వవిద్యాలయమే కాదు ఏ ఉద్యోగ సంఘాలు, ప్రజాసంఘాలు, పౌర సంస్థలకూ సంప్రదింపుల గౌరవం దక్కలేదు. రోజులు, నెలల తరబడి నిరసన, ఆందోళన చేసినవారిని కూడా ప్రభుత్వ ప్రతినిధులుగా ఎవరూ వచ్చి సంప్రదించి, ఆందోళనలు విరమింపజేసింది లేదు. ఉద్యమాలంటేనే ఉలికిపాటు, ఆందోళనలు, నిరసనలు అంటే కంపరం! ఆర్టీసీ ఉద్యోగులు, జీహెచ్‌‌‌‌ఎమ్​సీ సిబ్బంది సమ్మె సమయంలో ఇది తేటతెల్లమైంది. అత్యున్నత విధాన నిర్ణాయక సభ అసెంబ్లీలోనూ ఆ వాతావరణం ఉండేది కాదు. నామమాత్రంగా కొన్ని రోజులే జరిగే సభ  ఏకపక్షంగానే సాగేది.  విమర్శిస్తే సస్పెండ్ చేసేవారు.

‑ దిలీప్‌‌‌‌రెడ్డి, పొలిటికల్‌‌‌‌ అనలిస్ట్‌‌‌‌,  పీపుల్స్‌‌‌‌పల్స్‌‌‌‌ రీసెర్చ్‌‌‌‌ సంస్థ
 

  • Beta
Beta feature
  • Beta
Beta feature