విజయవాడ: ఇంద్రకీలాద్రిపై వెలసిన బెజవాడ కనకదుర్గమ్మకు తెలంగాణ భక్తులు బంగారు పాత్రలో బోనం సమర్పించారు. ఆషాడ మాసంలో తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండుగ ఉత్సవాలు వైభవంగా జరుపుకోవడం ఆనవాయితీ. ఈ ఆనవాయితీలో భాగంగా తెలంగాణ భక్తులు హైదరాబాద్ పాతబస్తీలోని భాగ్యనగర్ మహాంకాళి బోనాల ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో గత 12 సంవత్సరాలుగా బెజవాడ కనకదుర్గమ్మకు బోనం సమర్పిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా ఉత్సవాల్లో భాగంగా భక్తులు, కళాకారులు, పోతు రాజుల విన్యాసాలతో విజయవాడ బ్రహ్మణ వీధి నుంచి కళాకారుల నృత్యాలతో దేవాలయానికి సామూహిక ఊరేగింపు బయలు దేరి వచ్చారు. అమ్మ వారి పట్టు వస్త్రాలు సమర్పించారు. కార్యక్రమంలో దుర్గ గుడి ఈవో భ్రమరాంబ, పాలకమండలి ఛైర్మన్ పైలా స్వామి నాయుడు, పాలక మండలి సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. బెజవాడ కనకదుర్గమ్మ ఆలయం నుంచి ఈనెల 30వ తేదీన హైదరాబాద్, సికింద్రాబాద్ లో వెలసిన అమ్మవార్లకు బోనం తీసుకెల్లనున్నారు.