డయల్ 100కు కాల్‌ వస్తే వెంటనే స్పందించండి

డయల్ 100కు  కాల్‌ వస్తే వెంటనే స్పందించండి
  •     పోలీసు అధికారులకు  డీజీపీ జితేందర్‌‌ ఆదేశం

హైదరాబాద్‌, వెలుగు: డయల్‌ 100, డయల్‌ 112కు కాల్‌ వచ్చిన వెంటనే స్పందించాలని పోలీసు అధికారులను డీజీపీ జితేందర్‌‌ ఆదేశించారు. ఈ క్రమంలో డయల్‌ 100, 112 సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. శాంతి భద్రతలు కాపాడటం, ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించడంలో ఈ రెండు విభాగాలు కీలకంగా వ్యవహరించాలని చెప్పారు. డయల్ 100, డయల్‌ 112 పనితీరుపై శుక్రవారం డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, స్టేషన్ హౌస్ ఆఫీసర్ల (ఎస్‌హెచ్‌వో)తో చర్చించారు. కాల్స్ వచ్చిన సమయంలో సిబ్బంది ఎలా స్పందిస్తున్నారనే దానిపై ఆయన ఆరా తీశారు. 

ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడే విషయంలో డయల్ 100, డయల్‌ 112 సమర్థవంతంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాల్సి ఉందని స్పష్టం చేశారు. పోలీసు సిబ్బందిపై ప్రజల విశ్వాసాన్ని పెంపొందించే లక్ష్యంతో అత్యున్నత ప్రమాణాలు పాటించాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు డీజీపీలు మహేశ్‌ భగవత్, శ్రీనివాస్‌రావు, ఐజీపీలు ఎం.రమేశ్‌, సత్యనారాయణ, హైదరాబాద్‌ సిటీ జాయింట్‌ సీపీ పరిమళ హననూతన్‌ ఇతర పోలీస్‌ అధికారులు పాల్గొన్నారు.