రాష్ట్రంలో ఈ ఏడాది క్రైమ్ రేటు 4.4 శాతం పెరిగిందని డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు. సైబర్ క్రైమ్స్ బాగా పెరిగినందు వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆయన చెప్పారు. అంతక్రితం ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం సైబర్ క్రైమ్స్ 57 శాతం పెరిగాయని తెలిపారు. వైట్ కాలర్ నేరాలు కూడా 35 శాతం పెరిగాయన్నారు. ‘యానువల్ రౌండప్ 2022’ పేరుతో 2022 తెలంగాణ వార్షిక క్రైమ్ రిపోర్ట్ ను డీజీపీ మహేందర్ రెడ్డి విడుదల చేశారు. ఈసందర్భంగా ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘తెలంగాణను మావోయిస్టురహిత రాష్ట్రంగా మార్చేందుకు కృషిచేశాం. మావోయిస్టులు రాష్ట్రంలోకి ఎంటర్ కాకుండా చేయడంలో సక్సెస్ అయ్యాం. 2022 లో రాష్ట్రవ్యాప్తంగా 3 ఎన్ కౌంటర్లు జరిగాయి. ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు. 120 మంది మావోయిస్టులు లొంగిపోయారు. మావోయిస్టుల నుంచి 14 ఆయుధాలు, 12 లక్షల 65 వేల నగదును స్వాధీనం చేసుకున్నాం’’ అని వివరించారు.
మహిళలపై నేరాలు 3.8 శాతం పెరిగాయి
‘‘మతపరమైన హింస జరగకుండా శాంతిభద్రతలు పరిరక్షించాం. రాష్ట్రంలో హత్యలు 12.5 శాతం, హత్యాయత్నాలు 52 శాతం, దొంగతనాలు, లూటీల్లో 35 శాతం, రేప్ కేసులు 17 శాతం తగ్గాయి’’ అని డీజీపీ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు.‘‘ మహిళలపై నేరాలు 3.8 శాతం పెరిగాయి. అయితే ఈ విభాగంలో రేప్ కేసులు, పోక్సో కేసులు తగ్గాయి. వరకట్న వేధింపులు, గృహ హింస కేసులు బాగా పెరిగాయి’’ అని తెలిపారు. కేసులను వేగంగా ఛేదించి.. దోషులకు త్వరగా శిక్ష పడేలా చేయడంలో తెలంగాణ పోలీసులు సక్సెస్ అయ్యారని డీజీపీ కొనియాడారు. కన్విక్షన్ రేటు 50 శాతం నుంచి 56 శాతానికి పెరిగింది. ఈ ఏడాది వ్యవధిలో వివిధ కేసుల్లో 152 మందికి జీవితఖైదు శిక్ష పడింది. మొత్తం 1176 డ్రగ్స్ కేసులు నమోదవగా.. 2582 మంది నిందితులను అరెస్ట్ చేశారు. ఈ ఏడాది సీసీ కెమెరాల ద్వారా 18,234 కేసులను, ఫింగర్ ప్రింట్స్ ద్వారా 420 కేసులను ఛేదించారు.
ట్రాఫిక్ జరిమానాలతో రూ.612 కోట్లు వసూల్
‘‘ ఈ ఏడాది 431 మంది పై పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపినం. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై రూ.612 కోట్ల జరిమానాలు వేశాం. మోటార్ వెహికల్ యాక్ట్ కింద ఒక కోటి 65 లక్షల 84 వేల కేసులు నమోదు చేశాం’’ అని డీజీపీ చెప్పారు. ‘‘2022 లో 24,127 దోపిడీ కేసులు నమోదయ్యాయి. రూ.148 కోట్ల దోపిడీ జరగగా, రూ.74 కోట్లు రికవరీ చేశాం’’ అని వివరించారు. ‘‘ఈ సంవత్సరం 762 హత్యకేసులు, 2126 రేప్ కేసులు, 2432 పోక్సో కేసులు నమోదయ్యాయి. మహిళలపై క్రైమ్ కేసులు 17,908 రిజిస్టర్ అయ్యాయి. ఈ ఏడాది 19,456 రోడ్ యాక్సిడెంట్స్ జరగగా.. 6,746 మంది ప్రాణాలు కోల్పోయారు’’ అని డీజీపీ వెల్లడించారు.
డీజీపీ ప్రకటించిన ఉత్తమ పోలీసుస్టేషన్లు ఇవే..
- కేటగిరీ1 లో 1000కి పైగా ఎఫ్ఐఆర్ లు నమోదయ్యే పోలీసు స్టేషన్లు ఉంటాయి. ఈ జాబితాలో ఉత్తమ పోలీస్ స్టేషన్ గా ఉప్పల్ పీఎస్ నిలిచింది.
- కేటగిరి 2లో 500 నుంచి 1000 ఎఫ్ఐఆర్ లు నమోదయ్యే స్టేషన్లు ఉంటాయి. వీటిలో కోదాడ టౌన్ స్టేషన్ మొదటి స్థానం సాధించింది.
- కేటగిరి 3లో 250 నుంచి 500 ఎఫ్ఐఆర్ లు నమోదయ్యే స్టేషన్లు ఉంటాయి. వీటిలో ఆదిలాబాద్ వన్ టౌన్ స్టేషన్ మొదటి స్థానం పొందింది.
- కేటగిరి 4లో 150 నుంచి 200 ఎఫ్ఐఆర్ లు నమోదయ్యే స్టేషన్లు ఉంటాయి. వీటిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని లక్ష్మీదేవిపల్లి స్టేషన్ మొదటి స్థానం సాధించింది.
- కేటగిరి 5లో 150 కంటే తక్కువ ఎఫ్ఐఆర్ లు నమోదయ్యే స్టేషన్లు ఉంటాయి. వీటిలో మహబూబాబాద్ జిల్లాలోని సీరోలు మొదటి స్థానంలో ఉంది. కార్యక్రమం సందర్భంగా ఆయా పోలీసు స్టేషన్ల SHO లను డీజీపీ సత్కరించారు.