Rain alert: తెలంగాణలో రెండ్రోజులపాటు భారీ వర్షాలు..

Rain alert: తెలంగాణలో రెండ్రోజులపాటు భారీ వర్షాలు..

తెలంగాణలో రానున్న 2 రోజులపాటు  ( ఆగస్టు 1,2) భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని  వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో రాష్ట్రంలో మరో రెండ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. గడిచిన వారం పదిరోజులుగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.రాష్ట్రవ్యాప్తంగా జలాశయాలన్ని నిండు కుండలను తలపిస్తున్నాయి. 

ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టులు నిండుతుండటంతో అధికారులు నీటిని దిగువకు వదులుతున్నారు. నిర్మల్‌, పెద్దపల్లి, కామారెడ్డి, కరీంనగర్‌, మంచిర్యాల, హన్మకొండ, జగిత్యాల, నిజామాబాద్‌, రాజన్న సిరిసిల్ల, వరంగల్‌, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి, సూర్యాపేట, యాదాద్రి భువనగరి, మహబూబ్‌నగర్, నారాయణపేట, వికారాబాద్, నల్గొండ, నాగర్ కర్నూల్ జిల్లాలకు మోస్తరు వర్షసూచనను ప్రకటించారు. హైదరాబాద్‌లో రానున్న రెండ్రోజులపాటు వాతావరణం పొడిగా ఉంటుందని.. సాయంత్రం వేళల్లో చిరుజల్లులు కురుస్తాయని వివరించారు.