
- తెలంగాణ డాక్యుమెంట్ రైటర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జన్పాల్
యాదగిరిగుట్ట, వెలుగు : సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్లాట్ల రిజిస్ట్రేషన్ల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టాలని చూస్తున్న స్లాట్ విధానాన్ని విరమించుకుని పాత విధానాన్నే కొనసాగించాలని తెలంగాణ డాక్యుమెంట్ రైటర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జన్పాల్, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. స్లాట్ విధానాన్ని విరమించుకోవాలని కోరుతూ మంగళవారం యాదగిరిగుట్టలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట డాక్యుమెంట్ రైటర్లు ఆందోళన నిర్వహించారు. ఆ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం స్లాట్ విధానాన్ని తీసుకొస్తే రాష్ట్రంలో డాక్యుమెంట్ రైటర్లుగా పనిచేస్తున్న వేలాది మంది నిరుద్యోగుల జీవితాలు రోడ్డున పడే ప్రమాదముందని ఆవేదన వ్యక్తం చేశారు.
కొత్త విధానాన్ని అమలు చేస్తే చదువురాని చాలామంది ప్రజలు రిజిస్ట్రేషన్ల సమయంలో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. అదే పాత విధానాన్నే కంటిన్యూ చేస్తే డాక్యుమెంట్లలో ఏవైనా తప్పులు దొర్లితే డాక్యుమెంట్ రైటర్లు సరిచేసే అవకాశం ఉంటుందని, తద్వారా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ పేపర్లలో తప్పులకు చాన్సే ఉండదన్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఏవైనా సమస్యలుంటే సరిచేసుకోవాలే తప్ప పాత విధానాన్ని రద్దు చేసి స్లాట్ సిస్టంను తీసుకొచ్చి డాక్యుమెంట్ రైటర్ల పొట్ట కొట్టొద్దని ప్రభుత్వాన్ని వేడుకున్నారు. కార్యక్రమంలో తెలంగాణ డాక్యుమెంట్ రైటర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణగౌడ్, డాక్యుమెంట్ రైటర్లు తదితరులు పాల్గొన్నారు.