
హైదరాబాద్, వెలుగు: నెల రోజుల్లో 65 రకాల నకిలీ మందులను సీజ్ చేశామని డ్రగ్ కంట్రోల్ అథారిటీ అధికారులు వెల్లడించారు. మార్చిలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన దాడుల్లో నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్న 65 రకాల ఔషధాలను స్వాధీనం చేసుకున్నామని డీసీఏ డైరెక్టర్ వీబీ. కమలాసన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
రూ.3 లక్షలు విలువ చేసే యాంటీ బయోటిక్స్, యాంటీ హెల్మెంటిక్ డ్రగ్స్, స్టెరాయిడ్స్ ను సీజ్ చేశామని ఆయన చెప్పారు. చట్ట విరుద్ధంగా మందులు అమ్మినా, తయారు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. నకిలీ మందులకు సంబంధించిన సమాచారాన్ని 18005996969 నెంబర్ కు కాల్ చేసి తెలియచేయాలని వీబీ కమలాసన్ రెడ్డి సూచించారు.