తెలంగాణలో డీఎస్సీ పరీక్షలు వాయిదా పడ్డాయి. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఉపాధ్యాయ నియామక పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు పాఠశాల విద్యా డైరెక్టర్ దేవసేన ప్రకటించారు. నవంబర్ 20 నుంచి 30 వరకు డీఎస్సీ పరీక్షలు జరగాల్సి ఉంది. తాజాగా వాయిదా పడిన నేపథ్యంలో త్వరలో కొత్త షెడ్యూల్ ప్రకటిస్తామని విద్యాశాఖ తెలిపింది. ఇప్పటికే ఎన్నికల నేపథ్యంలో గ్రూప్-2 పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి
ALSO READ : కాంగ్రెస్ నేత ఇంట్లో రూ. 42 కోట్లు... పట్టుకున్న ఐటీ అధికారులు
సెప్టెంబర్ 8వ తేదీన తెలంగాణ డీఎస్సీ 2023 నోటిఫికేషన్ విడుదలైంది. 5,089 టీచర్ల పోస్టుల భర్తీకి విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 21 వరకు దరఖాస్తులు చేసుకోవడానికి అనుమతిచ్చింది. నవంబర్ 20వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పరీక్షలను నిర్వహిస్తామని ప్రకటించింది. అయితే తాజాగా ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఈ పరీక్షలు వాయిదా పడ్డాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే గ్రూప్ 2 పరీక్షలు వాయిదా పడ్డాయి. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పరీక్షల నిర్వహణకు సిబ్బంది కొరత ఏర్పడుతుందని భావించి టీఎస్పీఎస్సీ అధికారులు వాయిదా వేశారు. వాస్తవానికి నవంబర్ 2, 3 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు జరగాలి. ఈ పరీక్షలను వచ్చే ఏడాది జనవరి 6, 7 తేదీల్లో నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది.