ఏప్రిల్ తర్వాత డీఎస్సీ! ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై కమిషన్ సంప్రదింపులు

ఏప్రిల్ తర్వాత డీఎస్సీ! ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై కమిషన్ సంప్రదింపులు
  • కమిషన్ నివేదిక తర్వాతేకొత్త నోటిఫికేషన్లు వచ్చే చాన్స్  
  • 4 వేల నుంచి 5 వేల పోస్టులతో డీఎస్సీ వేసే అవకాశం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు బడుల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించే డీఎస్సీ నోటిఫికేషన్ కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ప్రభుత్వం రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. కానీ, ప్రస్తుతమున్న పరిస్థితుల్లో అది సాధ్యమయ్యే పరిస్థితి కన్పించడం లేదు. మూడు, నాలుగు నెలల తర్వాతే కొత్త నోటిఫికేషన్ రావొచ్చని అధికార వర్గాలు చెప్తున్నాయి.గత ప్రభుత్వం రాష్ట్రంలో 5,089 టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వగా, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్​ గతేడాది దాన్ని రద్దు చేసి 11,062 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. కొత్త నోటిఫికేషన్ కు సంబంధించిన టీచర్ రిక్రూట్​మెంట్​ప్రక్రియ వేగంగా పూర్తయింది. 

వచ్చిన ఏడాదిలోనే టీచర్ల నియామక ప్రక్రియ పూర్తిచేసి ప్రభుత్వం రికార్డు సృష్టించింది. ఈ క్రమంలోనే ప్రతి ఏటా ఎన్ని టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే అన్ని పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్  ఇస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఏటా టీచర్ ఎలిజిబులిటీ టెస్టు (టెట్) నవంబర్, ఏప్రిల్ నెలల్లో నిర్వహిస్తామని తెలిపింది. 

దీనికి అనుగుణంగా జాబ్ క్యాలెండర్​ను సర్కారు రిలీజ్ చేసింది. ఈ క్రమంలోనే నవంబర్ లో టెట్ నోటిఫికేషన్ ఇవ్వగా, ఇటీవలే ఆన్ లైన్ పరీక్షలు పూర్తయ్యాయి. ఈ క్రమంలోనే జాబ్ క్యాలెండర్ ప్రకారం వచ్చేనెల (ఫిబ్రవరి)లో డీఎస్సీ నోటిఫికేషన్ రావాల్సి ఉంది. కానీ కొన్ని టెక్నికల్ సమస్యలతో నోటిఫికేషన్ ఆలస్యమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. 

కమిషన్ రిపోర్టు తర్వాతే..

దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విభజన కోసం కమిషన్ ఏర్పాటు చేసింది. అన్ని డిపార్ట్ మెంట్లలో జరిగిన రిక్రూట్​మెంట్ డేటాను సేకరిస్తున్నది. 2000 నుంచి 2024 వరకు రికార్డులను పరిశీలిస్తున్నారు. త్వరలోనే రిపోర్టును సర్కారుకు ఇవ్వనున్నది. ఆ తర్వాత దానిపై కేబినెట్ సబ్ కమిటీలో, కేబినెట్ లో చర్చించనున్నారు. దీని అమలు కోసం లీగల్  ఒపీనియన్ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియకు కొంత టైమ్ పట్టే అవకాశం ఉంది. ఎస్సీ రిజర్వేషన్ల అంశం తేలకుండా ఏ నోటిఫికేషన్ వచ్చే అవకాశం లేనట్టు తెలుస్తున్నది. ఈ క్రమంలోనే ఏప్రిల్, మే నెలల్లోనే డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉందని అధికారులు చెబుతున్నారు. 

ఐదు వేల పోస్టులతో డీఎస్సీ!  

గతేడాది  డీఎస్సీ వేసి 11 వేల టీచర్ పోస్టులను సర్కారు భర్తీ చేసింది. ప్రస్తుతం శాంక్షన్ పోస్టులు లెక్కేస్తే.. సుమారు పది వేల వరకు ఖాళీలుంటాయి. అయితే, దీంట్లో ప్రమోషన్ కేటగిరీలో కొన్ని పోతాయి. ఈ లెక్కన సుమారు 4 వేల నుంచి 5 వేల పోస్టులతో డీఎస్సీ–2025 నోటిఫికేషన్ వేసే అవకాశం ఉంది.

 అయితే, ఇప్పుడు నోటిఫికేషన్ వేస్తే ఐదు జిల్లాలకు టీచర్ పోస్టులే అవసరం లేదని అధికార వర్గాలు చెప్తున్నాయి. నోటిఫికేషన్​లో దాదాపు పోస్టులన్నీ ఎస్​జీటీలే ఉండే అవకాశం ఉంది. చాలా జిల్లాల్లో స్కూల్ అసిస్టెంట్లు, పండిట్ పీఈటీల అవసరం కూడా ఉందని అంటున్నారు. మిగిలిన జిల్లాల్లోనూ చాలా తక్కువ పోస్టులు ఉండే అవకాశం ఉంది. మరోసారి టీచర్లకు ప్రమోషన్లు కల్పిస్తే కొన్ని స్కూల్ అసిస్టెంట్ పోస్టులు పెరుగుతాయి.