25 మందితో ధర్మసమాజ్ పార్టీ రెండో లిస్ట్ రిలీజ్

25 మందితో ధర్మసమాజ్ పార్టీ రెండో లిస్ట్ రిలీజ్
  • 25 మందితో డీఎస్పీ రెండో లిస్ట్ రిలీజ్
  • అగ్రవర్ణ పార్టీలను ఓడించడమే లక్ష్యం: విశారదన్ మహారాజ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అగ్రవర్ణాలకు చెందిన బీఆర్ఎస్, బీజేపీ కాంగ్రెస్ పార్టీలను ఓడించడమే తమ లక్ష్యమని ధర్మసమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ విశారదన్ మహారాజ్ అన్నారు. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తాము పోటీ చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇటీవల 53 మందితో  బీఎస్పీ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసిన విశారదన్..గురువారం బర్కత్ పురలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో  25 మందితో రెండో  లిస్ట్ ప్రకటించారు. 

అనంతరం ఆయన మాట్లాడుతూ.. చివరి జాబితాను ఈ నెల 30న రిలీజ్ చేస్తామని ప్రకటించారు.  తెలంగాణలోని బహుజనుల రాజ్యాధికారం కోసమే ఎన్నికల బరిలో నిలుస్తున్నామని చెప్పారు. అగ్రవర్ణ ఆధిపత్య రాజకీయాల నుంచి తెలంగాణకు విముక్తి కల్పించడానికి ధర్మసమాజ్ పార్టీ పనిచేస్తున్నదని తెలిపారు. రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలు 70 ఏండ్లుగా ఓటు వేసే బానిసలుగా మాత్రమే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి అధికారం కోసమే  డీఎస్పీ గుర్తు అయిన టార్చ్ లైట్ కు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. 

 సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిసున్న గజ్వేల్, హుజూర్నగర్, మునుగోడు, అంబర్ పేట్, యాకత్ పురా నుంచి ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థులను పోటీలో నిలుపుతున్నట్లు వివరించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు లక్ష్మణ్, దుర్గ ప్రసాద్, ఎంఏ రెహమాన్, శివరన్ తదితరులు పాల్గొన్నారు.