రాష్ట్రంలో జర్నలిస్టులకు ఒకే రూల్ వర్తించదా..?

ఖమ్మంలో జర్నలిస్టుల కోసం 23 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ కొన్ని రోజుల క్రితం రాష్ట్ర కేబినెట్ తీర్మానించింది. ఇటీవల మంత్రి శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ లో 155 మంది జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూం ఇండ్లు పంపిణీ చేశారు. ఏప్రిల్ లో ఆందోల్ నియోజకవర్గంలోని జర్నలిస్టులకు మంత్రి హరీశ్ రావు ఇండ్ల పట్టాలను అందజేశారు. మరో నాలుగైదు మండలాలు, నియోజకవర్గ కేంద్రాల్లో ఇలాగే ఇండ్ల స్థలాలను అందజేశారు. అయితే ఏ ప్రాతిపదికన ఆయా చోట్ల జర్నలిస్టులకు ప్రభుత్వం ఇండ్లస్థలాలు, డబుల్ బెడ్ రూం ఇండ్లను పంపిణీ చేస్తున్నదో తెలియడంలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి ఇలాంటి కార్యక్రమం చేపట్టకుండా, నియోజకవర్గం, మండలాల వారీగా జర్నలిస్టులను విడదీయడం సరికాదు. అసలు స్టేట్ మొత్తం ఒకే రూల్స్ ఎందుకు వర్తింపజేయడం లేదోనని జర్నలిస్టుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ముందుకు పడని అడుగు..

ఉద్యమ సమయంతోపాటు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక అనేక సార్లు జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు అందజేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అనేక సమావేశాల్లోనూ దీనిపై స్పష్టత ఇచ్చారు. అయినా అడుగు ముందుకు పడలేదు. అయితే 2022 ఆగస్టులో సుప్రీం కోర్టులో కేసు పరిష్కారం కావడం, చిన్న వేతన జీవులైన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వొచ్చని అప్పటి చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తీర్పు చెప్పడంతో ప్రక్రియ కాస్త స్పీడప్ అయినట్లు కనిపించింది. ఇండ్ల స్థలాల కేటాయింపు బాధ్యతలను మంత్రి కేటీఆర్ మీడియా అకాడమీకి అప్పగించారు. దీంతో మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ జర్నలిస్టు సంఘాలు, మీడియా సంస్థలతో సంప్రదింపుల ప్రక్రియ మొదలు పెట్టారు. అభిప్రాయాలను సేకరించారు. అయితే ఆ తర్వాత అడుగు ముందుకు పడలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఏమో కానీ.. సుప్రీం కోర్టులో కేసు పరిష్కారమైన జవహర్ సొసైటీ సభ్యులకే ఇంకా ఇండ్ల స్థలాలు కేటాయించలేదు. కానీ కొన్ని చోట్ల మాత్రమే వేర్వేరుగా ఇండ్ల స్థలాలు కేటాయించడంలో మతలబేమిటని జర్నలిస్టు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.

ఖమ్మం జర్నలిస్టులను ఊరించడానికేనా?

మిగతా చోట్ల స్థలాలు, డబుల్ బెడ్ రూం లు పంపిణీ చేసినట్లుగానే ఖమ్మంలోనూ జర్నలిస్టులకు స్థలాలు పంపిణీ చేసే వీలుంది. అయితే అలా చేయకుండా 23 ఎకరాలను కేటాయిస్తూ కేబినెట్ తీర్మానించింది. దీని వెనక ఓ మతలబు దాగి ఉన్నదని జర్నలిస్టు సంఘాలు, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఖమ్మంలో అధికార బీఆర్ఎస్ పార్టీ వీక్ గా ఉన్నది.  ఇతర పార్టీల ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరినా.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ జిల్లాల్లో బీఆర్ఎస్ 
పరిస్థితి అగమ్యగోచరంగానే ఉన్నట్లు తెలుస్తున్నది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అధికార పార్టీ అనుకూల పవనాలు వీచేలా జర్నలిస్టులను ఇండ్ల స్థలాల పేరిట ఊరించే ప్రోగ్రామ్ ను క్రియేట్ చేశారని పలువురు జర్నలిస్టులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నెల రోజుల్లోపు ఇండ్ల స్థలాల పంపిణీ ప్రక్రియ పూర్తి చేయవచ్చని అంటున్నారు. అయితే ఎన్నికలయ్యే వరకు ఖమ్మం జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఎలాగూ కేటాయించరని, మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి, ఖమ్మంలో ఆ పార్టీకి మంచి ఫలితాలు వస్తేనే ఇండ్ల స్థలాలు ఇస్తారనే ప్రచారం జరుగుతున్నది. 

మిగతా ఎమ్మెల్యేలు..

జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల కేటాయింపులో పలు చోట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రత్యేక చొరవ తీసుకొని చర్యలు చేపట్టారు. ఖమ్మంలో 23 ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్ తీర్మానం కోసం మంత్రి పువ్వాడ ఎంతో కృషి చేశారు. మహబూబ్ నగర్ లో జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూం ఇండ్లను ఇస్తానని చెప్పి, దాని కోసం సీఎంను ఒప్పించి, 155 మందికి పట్టాలు అందజేసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట నిలుపుకున్నారు. ఆందోలులో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల కేటాయింపు వెనక ఎమ్మెల్యే క్రాంతి కృషి ఎంతో ఉంది. ఇలా సింగిల్ డిజిట్ ఎమ్మెల్యేలే జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల కేటాయింపునకు ప్రయత్నించారు. అంటే మిగతా చోట్ల ఎమ్మెల్యేలు చేతగానివారన్నట్టేనా? రాష్ట్రవ్యాప్తంగా ఒకే రూల్​ తీసుకొచ్చి, అర్హతలను నిర్ధారించి, పంపిణీ చేయాలని జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఫిరోజ్ ఖాన్, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్