
- మార్చి 6న ఐసెట్.. 12న పీజీఈసెట్ నోటిఫికేషన్స్ రిలీజ్
- సెట్స్ కమిటీ సమావేశాల్లో షెడ్యూల్స్ విడుదల
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పలు ముఖ్యమైన ప్రవేశ పరీక్షలకు షెడ్యూళ్లు విడుదలయ్యాయి. 2025–-26 విద్యా సంవత్సరానికి గాను రాష్ట్రంలో ఇంజినీరింగ్/ అగ్రికల్చర్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఈఏపీసెట్ (ఎప్‌సెట్) తో పాటు టీజీ ఐసెట్, పీజీ ఈసెట్‌కు ఉన్నత విద్యామండలి వేర్వేరుగా అధికారిక వెబ్‌సైట్‌లో షెడ్యూల్స్‌ను సోమవారం రిలీజ్చేసింది. సోమవారం జేఎన్టీయూహెచ్ లో టీజీ ఈఏపీసెట్, పీజీ ఈసెట్, ఐసెట్ కమిటీల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా షెడ్యూల్‌పై చర్చించి, విడుదల చేశారు. ఈ నెల20న ఎప్‌సెట్ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు ప్రకటించారు. 25 నుంచి ఏప్రిల్4 వరకు ఆన్ లైన్లో ఎలాంటి ఫైన్ లేకుండా అప్లికేషన్ల ప్రక్రియ నిర్వహించనున్నట్టు తెలిపారు.
కాగా, ఏప్రిల్ 29,30 తేదీల్లో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ఎగ్జామ్ నిర్వహించనుండగా, మే 2 నుంచి 5 వరకు ఇంజినీరింగ్ స్ట్రీమ్‌కు ఎగ్జామ్స్ జరగనునున్నాయి. ఎప్‌సెట్ లో మొత్తం ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ సిలబస్ ఉంటుందని అధికారులు ప్రకటించారు. ఈ సమావేశాల్లో ఎప్‌సెట్ కన్వీనర్ దీన్ కుమార్, కో కన్వీనర్ విజయ్‌కుమార్ రెడ్డి , హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ వైస్ చైర్మన్లు ఎస్కే మహమూద్, పురుషోత్తం, కౌన్సిల్ సెక్రెటరీ శ్రీరామ్ వెంకటేశ్, ప్రొఫెసర్ తారా కళ్యాణి, పీజీఈసెట్ కన్వీనర్ అరుణకుమారి, కో కన్వీనర్ రవీంద్ర రెడ్డి , మహాత్మాగాంధీ వర్సిటీ వీసీ ఆల్తాఫ్ హుస్సేన్, ఐసెట్ కన్వీనర్ అలువాల రవి తదితరులు పాల్గొన్నారు.
జూన్ 16–19 వరకు పీజీఈ సెట్ ఎగ్జామ్స్
రాష్ట్రంలోని ఎంటెక్, ఎం ఫార్మసీ, ఎంఈ తదితర కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించనున్న పీజీఈసెట్ నోటిఫికేషన్ మార్చి 12న రిలీజ్ కానున్నది. మార్చి 17 నుంచి మే 19 వరకు ఎలాంటి ఫైన్ లేకుండా ఆన్ లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. కాగా, పీజీఈసెట్ ఎగ్జామ్స్ జూన్16 నుంచి 19 వరకు జరుగుతాయి.
జూన్ 8, 9న ఐసెట్ ఎగ్జామ్స్
ఎంబీఏ, ఎంసీఏ తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ ఐసెట్ దరఖాస్తుల ప్రక్రియ మార్చి 10 నుంచి ప్రారంభం కానున్నది. మార్చి 6న నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. మార్చి 10 నుంచి మే 3 వరకు ఫైన్ లేకుండా దరఖాస్తులు స్వీకరిస్తారు. జూన్ 8, 9న రెండు సెషన్లలో పరీక్ష ఉంటుంది. కాగా, ఎస్సీ, ఎస్టీ, దివ్వాంగ అభ్యర్థులకు రూ.550, ఇతర విద్యార్థులకు రూ.750 అప్లికేషన్ ఫీజుగా నిర్ణయించారు.
ప్రిలిమినరీ ‘కీ’ పై ఆబ్జెక్షన్లకు రూ.500
వివిధ ప్రవేశ పరీక్షల్లో రిలీజ్ చేసే ప్రిలిమినరీ ‘కీ’ పై చాలెంజ్ ఇక ఉచితం కాదు. ప్రతి ఆబ్జెక్షన్ కు రూ. 500 కట్టాల్సిందేనని కౌన్సిల్ అధికారులు నిర్ణయించారు. జేఈఈ తరహాలో ఎప్‌సెట్ సహా అన్ని ప్రవేశపరీక్షలకూ కీ పై ఆబ్జెక్షన్లకు ఫీజును నిర్ణయించారు. అభ్యర్థులు సూచించిన ఆన్సర్ కరెక్ట్ అయితే.. ఆ డబ్బులు వారికి తిరిగి ఇవ్వనున్నట్టు కౌన్సిల్ చైర్మన్ బాలకిష్టారెడ్డి చెప్పారు.