హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో డ్యూటీ చేస్తున్న ఉపాధ్యాయ భార్యాభర్తలకు సర్కారు త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతున్నది. స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలో సుమారు 840 మందికి స్పౌజ్ కేటగిరిలో బదిలీలు అయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు సర్కారుకు పంపించారు. గత ప్రభుత్వం జీవో 317 ద్వారా జిల్లాల అలకేషన్ చేసింది. ఈ క్రమంలో చాలామంది భార్యాభర్తలు వేర్వేరు జిల్లాలకు బదిలీలు అయ్యారు.
కొంతమందిని సొంత జిల్లాలకు మళ్లీ తీసుకొచ్చినా.. ఇంకొందరు అలాగే ఉన్నారు. ఈ క్రమంలో స్పౌజ్ కేటగిరిలో బదిలీల కోసం గతేడాది జూన్ లో ఆన్ లైన్ లో దరఖాస్తులను స్వీకరించింది. వారిలో అర్హులైన అందరికీ బదిలీలు నిర్వహించాలని నిర్ణయించింది. దీంట్లో బ్లాక్ చేసిన 13 జిల్లాలకు వచ్చే వారే ఎక్కువ మంది ఉన్నారు. అయితే, త్వరలో వీరి బదిలీకి ఆదేశాలు రానున్నట్టు అధికారులు చెప్తున్నారు.