విద్యారంగం..విధ్వంసం

విద్యారంగం..విధ్వంసం

తొమ్మిదేళ్ల  బీఆర్​ఎస్ పాలనలో విద్యా రంగం విధ్వంసమైంది. పాఠశాల  నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు జరిగిన నష్టం ఊహకందనిది.  విద్యా రంగానికి అరకొర బడ్జెట్ కేటాయింపులు,  బోధన, బోధనేతర నియామకాల భర్తీలో అలవిమాలిన అలసత్వం, మౌలిక వసతుల కొరత ఇలా  ప్రభుత్వ అలసత్వం తెలంగాణ విద్యార్థుల పట్ల శాపమైంది. ఉద్యమ సమయంలో ఏళ్ల పాటు అనేక మార్లు నాణ్యమైన విద్య అంటూ నినదించి, అధికార పీఠమెక్కిన అనంతరం కేజీ టూ పీజీ ఉచిత విద్య అని ప్రకటించిన ముఖ్యమంత్రి అందుకు పూర్తి విరుద్ధంగా కేజీ టూ పీజీ వరకు ప్రైవేట్ కార్పొరేట్ శక్తులను ప్రోత్సహిస్తూ విద్యా రంగాన్ని కార్పొరేట్ వశం చేశారు. దేశంలోనే విద్యా సంస్థలకు తెలంగాణ లాభసాటిగా మారిందంటే  కార్పొరేట్ విద్యా సంస్థల ఆగడాలను ప్రోత్సహిస్తున్న  ప్రభుత్వ తీరు అద్దం పడుతోంది. 

2014లో రాష్ట్రం ఏర్పడే నాటికీ రాష్ట్రంలో ఉన్న సర్కారు బడులనూ హెతుబద్దీకరణ పేరుతో 12000 పాఠశాలలను మూసివేయగా  నేడు కేవలం 26,074 పాఠశాలలకు పరిమితమయ్యాయి. ఈ పాఠశాలలలో  దాదాపుగా 15000  ఉపాధ్యాయులు ఖాళీగా ఉండడంతో దాదాపుగా 6,392  ఎకోపాధ్యాయగా దర్శనమిస్తున్నాయి.  ఉపాధ్యాయులు కొరతతో  సర్కారు విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. నిధులు లేక శిథిలావస్థకు చేరిన సర్కారు బడుల్లో మంచి నీటి వసతి, మూత్రశాలలు వంటి కనీస సదుపాయాల కరువు. హాస్టళ్లలో నాణ్యతలేని ఆహారం, పురుగుల అన్నం.  ఆ మధ్య ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలో భాగంగా  మాట్లాడుతూ ఢిల్లీ విద్యా వ్యవస్థ చాలా బాగుందని కొనియాడారు. కానీ తెలంగాణలో పతనావస్థలో ఉన్న విద్యా వ్యవస్థను గాడిలో పెడతామని మాత్రం చెప్పలేదు. కొఠారీ కమిషన్ సిఫార్సు ప్రకారం బడ్జెట్ లో విద్యా రంగానికి 30% నిధులు కేటాయించాలి. 

కానీ తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్ లో విద్యా రంగానికి 10.89% నిధులు కేటాయించిన ప్రభుత్వం ఆ తర్వాత ప్రవేశ పెట్టిన బడ్జెట్ అన్నింటిలోనూ క్రమంగా నిధులు తగ్గిస్తూ సగానికి కుదించి విద్యా రంగానికి తీరని అన్యాయం చేశారు. ఇటీవల ప్రవేశ పెట్టిన 2023-–24 వార్షిక బడ్జెట్ లో 6.57% (రూ. 19,093) నిధులు కేటాయించింది.  విద్యా రంగానికి నిధుల ప్రాధాన్యత తగ్గిస్తూ సర్కారు బడుల నుంచి యూనివర్సిటీల వరకు నియామకాలు, అభివృద్ధి, మౌలిక వసతులు కల్పనను తొక్కిపడేశారు.

 సంక్షేమ వసతి గృహాలు నరక కూపాలు 

విద్యార్థులు వినియోగించే వస్తువుల ధరలు పెరిగినప్పటికీ మెస్ ఛార్జీలు 2016 నుంచి నేటికీ సవరించకపోవడంతో విద్యార్థులకు నాణ్యమైన భోజనం,  మౌలిక వసతుల అందకపోవడం, తరచూ ఆహారం విషతుల్యమై వేల మంది విద్యార్థులు ఆసుపత్రి పాలు కావడం అనేక మంది మరణించడం నిత్యకృత్యమైంది. ఏళ్లుగా వసతి గృహల నియామకాలు లేకపోవడంతో సిబ్బంది కొరతతో పారిశుధ్యం కొరవడి విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారు. విద్యా ఉపాధి అవకాశాల్లో ప్రసిద్ధిగాంచిన రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్  లో సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు చేసిన ఆందోళనల కారణంగా త్రిబుల్​ఐటీ బాసర ప్రతిష్ట దిగజారింది.

 తెలంగాణ సిద్దించిన అనంతరం

స్వపరిపాలనలో యూనివర్సిటీలు ప్రగతి పథంలోకి నాణ్యమైన విద్య,  ఉపాధి అవకాశాలతో పేద విద్యార్థుల భవిష్యత్ మెరుగు పడుతుందని ఆశించాం. కానీ బీఆర్​ఎస్​ పాలనలో అందుకు పూర్తి విరుద్ధంగా తిరోగమనంతో యూనివర్సిటీలు నిర్వీర్యం అయ్యాయి. 2013 లో చేపట్టిన అధ్యాపక నియామకాలు మినహా గత పదేళ్లలో ఒక్క టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయలేదంటే యూనివర్సిటీల అధోగతి పరిస్థితి అవగతమౌతోంది. యూనివర్సిటీలలో దాదాపుగా 80%  టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉండడంతో  నాణ్యమైన విద్యా, పరిశోధన కుంటుపడుతోంది.

ఇటీవల విడుదల చేసిన నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ (ఎన్ ఐ ఆర్ ఎఫ్ ) ర్యాంకులలో ఉస్మానియా యూనివర్సిటీ, JNTUH ర్యాంకులు దిగజారడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రస్పుటమౌతోంది. తెలంగాణ సిద్దించి పదేళ్లవుతున్న సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రజానీకం క్షేత్ర స్థాయిలో ఉన్న స్థితిగతులను బేరీజు వేయాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రముఖంగా ప్రభుత్వ నిర్లక్ష్యంతో అస్తవ్యస్థమైన విద్యా రంగం పాఠశాల స్థాయి నుండి యూనివర్సిటీ స్థాయి వరకు విద్యాసంస్థల దిగజారిన వైనం, వసతి గృహాలలో విషతుల్యమైన ఆహారంతో మరణమృదంగం, 

ఇంటర్ బోర్డు అధికారుల నిర్లక్ష్యంతో పదుల సంఖ్యలో విద్యార్థులు, కార్పొరేట్ విద్యా సంస్థల ఒత్తిడి చదువులతో వందల సంఖ్యలో ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడడం, పేద విద్యార్థుల ఉన్నత చదువుకు ఉపకరించే ఫీజు రియంబర్స్​మెంట్ పథకాన్ని నీరుగార్చడం దరిమిలా తెలంగాణలో విద్యా విధ్వంసం జరిగింది.  ఈ క్రమంలో తెలంగాణ విద్యా వేత్తలు, మేధావులు, విద్యార్థులు, యువత, తెలంగాణ సమాజం జాగృతమై భవిష్యత్ తరాలకు నాణ్యమైన విద్య అందించే దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది.

వ్యాపారమైన విద్య

కార్పొరేట్ శక్తుల చేతిలో ఇంటర్ విద్యను బందీ చేసి ప్రభుత్వం, ప్రభుత్వ అధి కారులు చేష్టలుడిగి వ్యవహరిస్తున్న తీరు అత్యంత జూగుప్సాకరం. నారాయణ, శ్రీచైతన్య, ఎక్సలెన్సియా, ఎస్సార్ సహా ఇతర కార్పొరేట్ కళాశాలలు బహిరంగ ఫీజు దోపిడీ చేస్తున్నా ప్రభుత్వం కనీస నియంత్రణ కొరవడింది. ఇంటర్ బోర్డు అధికారులు ఎలాంటి చర్యలకు ఉప క్రమించకపోవడం కార్పొరేట్ శక్తుల చేతి వాటంకు అలవాటుపడ్డ స్థితికి పరాకాష్ట. ఒకే పేరుతో వందల బ్రాంచ్ లు ఉండడం నిబంధనలకు వ్యతిరేకమైనా తెలంగాణలో అది సాధారణమైపోయింది. కార్పొరేట్ కళాశాలలో ఒత్తిడితో కూడిన బట్టీ చదువులతో విద్యార్థులు మానసిక ఆందో ళనకు గురై ఆత్మహత్యల పాలవుతున్న ఘటనలు అనేకం జరుగుతున్నాయి. ఇంతటి ఆగడాలు జరుగుతున్నా ప్రభుత్వ పెద్దలు కార్పొరేట్ శక్తులపై ఉక్కుపాదం మోపకుండా ఉదాసీనంగా వ్యవహరించడం వెనుక మతలబేంది?

డా. కె.ప్రవీణ్ రెడ్డి, వర్కింగ్ కమిటీ మెంబర్ ఏబీవీపీ తెలంగాణ