తెలంగాణ విద్యా విధానంలో మార్పు రావాలి

తెలంగాణ విద్యా విధానంలో మార్పు రావాలి
  • టీచర్లు తలుచుకుంటే సమాజాన్ని మార్చొచ్చు: ఆకునూరి మురళి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందాలంటే తెలంగాణ విద్యా విధానంలో మార్పు రావాలని విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని ఎస్టీయూ భవన్‌‌‌‌లో నిర్వహించిన ఎస్టీయూ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఆయన చీఫ్ గెస్టుగా హాజరై, మాట్లాడారు. ప్రైమరీ స్కూళ్లలో క్లాసుకు ఒక టీచర్ ఉండాల్సిన అవసరం ఉందని, అయితే, తక్కువ మంది ఉన్నప్పుడు సాధ్యం కాదని, దీంతో కొన్ని సమస్యలు ఏర్పడుతున్నాయన్నారు. పిల్లలు తక్కువగా ఉంటే దగ్గర్లోని స్కూళ్లను కలిపి.. దూర ప్రాంతాల్లోని స్టూడెంట్లకు రవాణా సౌకర్యం కల్పిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. స్కూళ్లు, కాలేజీల్లో చదువులు చెప్పే టీచర్లు ఎక్కువగా ఫోన్లు యూజ్ చేస్తున్నారని, దీన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. టీచర్లు తలుచుకుంటే మంచి సమాజాన్ని నిర్మించవచ్చని చెప్పారు. త్వరలోనే కమిషన్ సభ్యులు రాబోతున్నారని, వారొచ్చాక పలు అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. 

ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.పర్వత్‌‌‌‌ రెడ్డి, జి. సదానందంగౌడ్ మాట్లాడుతూ.. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ– కుబేర్‌‌‌‌‌‌‌‌లో పెండింగ్‌‌‌‌లో ఉన్న వివిధ రకాల సప్లిమెంటరీ బిల్లులను వెంటనే క్లియర్ చేయాలని డిమాండ్ చేశారు. జీవో 317పై నియమించిన కేబినెట్ సబ్ కమిటీ టీచర్ల సమస్యలు పరిష్కరించాలన్నారు. డీఎస్సీ నియామకాలు పూర్తయిన వెంటనే, బదిలీ అయిన ఎస్జీటీ టీచర్లను రిలీవ్‌‌‌‌ చేయాలని విజ్ఞప్తి చేశారు. పెండింగ్‌‌‌‌లో ఉన్న నాలుగు డీఏలు, సీపీఎస్ రద్దు కోసం సర్కారుపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. ఈ సమావేశంలో ఎస్టీయూ ఫైనాన్స్ సెక్రటరీ ఆట సదయ్య, రాష్ట్ర నాయకులు ఎల్‌‌‌‌ఎం ప్రసాద్, జుట్టు గజేందర్, పోల్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.