చెరుకు రైతులు నామినేషన్ వేస్తే.. కేసీఆర్కే లాభం: అరవింద్

మన రాష్ట్రంలో పంట బీమా లేదు.. మనిషికి బీమా లేదు..కానీ  చచ్చిపోయిన మనిషికి మాత్రం బీమా ఉందని నిజామాబాద్ ఎంపీ, కోరుట్ల బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ కవిత.. పైసల పిశాచి అని, బతుకమ్మకు.. మహిళలకు చెడ్డ పేరు తెచ్చిన నల్ల మచ్చ అని విమర్శించారు. హిందువుల ఓట్లు చీల్చడానికి ఇక్కడ కుల రాజకీయాలు తీసుకొస్తారని.. వాళ్ల ట్రాక్ లో పడవద్దని కోరారు. ఖాదీ బోర్డును పూర్తిగా ప్రక్షాళన చేసి.. ఎక్కడ అవినీతి జరగకుండా చూస్తామని చెప్పారు.  ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం(నవంబర్ 6)జగిత్యాల జిల్లా  మెట్ పల్లిలో  నిజామాబాద్ ఎంపీ, కోరుట్ల బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ రోడ్ షో నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం.. ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా ఐదు లక్షలు రూపాయలు ఇస్తే.. అది అమలు చేయకుండా పేదలను లూటీ చేశారని ఆరోపించారు. తెలంగాణ విద్యాసంస్థలను అభివృద్ధి చేయడానికి  కేంద్రం రూ.17వేల కోట్లు ఇస్తే.. రాష్ట్రం వాటా ఇవ్వకపోవడంతో నిధులు వాపస్ వెళ్ళిపోయాయని చెప్పారు. పాత ప్రాజెక్టుల మరమ్మత్తులకు ఒక్క రూపాయి పెట్టకుండా.. రూ.లక్ష కోట్లతో కట్టిన ప్రాజెక్టులు కూలిపోతున్నాయని మండిపడ్డారు. దొరలను గద్దె దించడానికి ఇక్కడ పోటీ చేస్తున్నానని.. బీజేపీని గెలిపిస్తే, గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని చెప్పారు.

వ్యవసాయ ఆధారిత ఫ్యాక్టరీలను ఏర్పాటు చేస్తామని... దాంతో ఇక్కడి యువత గల్ఫ్ కు పోవలసిన అవసరం ఉండదన్నారు. ఐదేళ్లు ఎంపీగా ఉన్న తనపై ఒక్క అవినీతి ఆరోపణ లేదని అన్నారు. మాకు డబ్బులు అవసరం లేదని.. మోడీ ఆశీర్వాదం, మీ ఆశీర్వాదం కావాలన్నారు. 

ఇక్కడ ప్రజల బీజేపీని కోరుకుంటున్నారని.. కోరుట్లలో రెండు దశాబ్దల తర్వాత భారీ మెజార్టీతో బీజేపీ గెలువబోతోందని జోష్యం చెప్పారు. నరేంద్ర మోడీ పాలన కేంద్రంలో ఎంత అవసరమో.. రాష్ట్రంలో కూడా అంతే అవసరమన్నారు.  పిఎఫ్ఐ లాంటి ఉగ్రవాద సంస్థల ఆక్టివిటీస్ జగిత్యాల, నిజాంబాద్ లలో ఎలా పెరిగాయని.. అందుకే తెలంగాణలో కాషాయ జెండా ఎగరడం అవసరమని అన్నారు. ఇంటర్నల్ సెక్యూరిటీ, అవినీతి రహిత పాలన కోసం మోడీ నాయకత్వం అవసరమన్నారు.

ఈ ప్రాంతం గోదావరి పరివాహక ప్రాంతమని.. బ్రహ్మాండమైన పంటలు పండే ప్రాంతమని చెప్పారు. షుగర్ ఫ్యాక్టరీ మూసేసి తెరిపిస్తామని చెప్పి.. అడ్రస్ లేకుండా పోయారని అరవింద్ ఫైర్ అయ్యారు. ఉత్తరప్రదే,శ్ మహారాష్ట్రలో మూతపడ్డ చెరుకు ఫ్యాక్టరీలను మోడీ, యోగి తెరిపిస్తే బ్రహ్మాండంగా నడుస్తున్నాయని చెప్పారు.

మెట్పల్లి, బోధన్,  మెదక్ షుగర్ ఫ్యాక్టరీలను బీజేపీ పునరుద్ధరిస్తుందని హామీ ఇచ్చారు. చెరుకు రైతులు నామినేషన్ వేస్తామని చెప్పడం సరికాదని.. అది కేసిఆర్ కు లాభం జరుగుతుందన్నారు. మీకోసం కొట్లాడుతున్న వారికి చెరుకు రైతులు మద్దతు తెలిపి ఓటు వేయాలని కోరారు.పసుపుకు రూ.12వేల మద్దతు ధర ఇప్పించే బాధ్యత బీజేపీదని అన్నారు.

భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తే ఒక్క కిలో కూడా తరుగు ఉండదని,  ప్రతి క్వింటాలకు బోనస్ ఇస్తామని తెలిపారు. 18 వేల కోట్ల రూపాయల సబ్సిడీ యూరియా కేంద్ర ప్రభుత్వం ఇస్తుందన్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, ఒక్కరికి ఉద్యోగం రాలే.. ఎన్నిసార్లు కేసీఆర్ యువతను మోసం చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపికి ఓటు వేస్తే పెన్షన్లు రావని బీఆర్ఎస్ నాయకులు భయపడుతున్నారని.. కానీ, బీజేపీకి ఓటు వేస్తే పెన్షన్లు పెరుగుతాయన్నారు.బీజేపీ గెలిస్తే.. కోరుట్ల నియోజకవర్గంలో పదిహేను వేల ఇండ్లు కట్టి ఇస్తానని అరవింద్ చెప్పారు. అరవింద్ ర్యాలీలో ట్రాన్స్ జెండర్స్ పాల్గొని ఆయనకు సంఘీభావం తెలిపారు. గెలిపిస్తే మాకేం చేస్తావని  ట్రాంజెండర్స్ అడగగా.. మీరు కోరింది చేస్తానని అరవింద్ తెలిపారు. దీంతో ర్యాలీలో  ట్రాన్స్ జెండర్స్.. నృత్యం చేసి సంతోషం వ్యక్తం చేశారు.