బహుజనుల్లో పెరుగుతున్న చైతన్యం

బహుజనుల్లో పెరుగుతున్న చైతన్యం

అధికార బీఆర్​ఎస్​ పార్టీ దాదాపు సిట్టింగ్​లందరికీ టికెట్లు ఖరారు చేయడంతో తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైంది. 2018 నాటి అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే.. అధికార పార్టీ అడుగుల్లో పెద్దగా మార్పులేమీ లేవు. మునుపటి లాగే మిగతా పార్టీల కంటే ముందుగా టికెట్లు కేటాయించడం, దాదాపు సిట్టింగులకే సీట్లు ఇవ్వడం.. లాంటివన్నీ అప్పటిలాగే ఉన్నాయి. అయితే తెలంగాణ సమాజం దృష్టి మాత్రం మారిందనిపిస్తున్నది. ముఖ్యంగా సామాజిక చైతన్యం కనిపిస్తున్నది. పార్టీ అధినేత టికెట్లు ప్రకటించిన కొన్ని గంటల్లోనే.. అనేక ప్రశ్నలు, నిలదీతలు అటు మీడియాలో, ఇటు సోషల్​ మీడియాలో కనిపించాయి. టిక్కెట్​ ఆశించి భంగపడ్డ బీఆర్​ఎస్​ పార్టీ సొంత నేతలు సహా.. ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, బీసీ సంఘాలు, విద్యార్థి సంఘాల నుంచి అనేక ప్రశ్నలు వచ్చాయి. 

మహిళలకు చట్టసభల్లో 33 శాతం కోటా కల్పించే బిల్లు కోసం సీఎం కేసీఆర్​ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత మార్చి10న ఢిల్లీలోని జంతర్​ మంతర్​లో దీక్ష చేశారు. దేశంలోని 18 పార్టీలు సహా ప్రజా సంఘాలు ఆమెకు మద్దతు తెలిపాయి. అయితే నాడు చట్టసభల్లో మహిళా రిజర్వేషన్​ కోసం దీక్ష చేసిన కవిత.. సొంత పార్టీలో ఎందుకు మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని కేసీఆర్​ను కోరలేదని ప్రతిపక్ష పార్టీలు సహా.. సోషల్​ మీడియా వేదికగా వందల మంది ప్రశ్నల వర్షం కురిపించారు. తాజాగా తొలిజాబితాలోనే 115 మంది అభ్యర్థులను ప్రకటించిన బీఆర్​ఎస్​ అధినేత సీఎం కేసీఆర్..​ ఆ జాబితాలో ఏడుగురు మహిళలకే(6 శాతం) మాత్రమే స్థానం కల్పించారు. దీనిపై ప్రతిపక్ష పార్టీలకు, ఎమ్మెల్సీ కవితకు మధ్య మాటల యుద్ధం సాగింది. 

పార్టీల ప్రాధాన్యం పెరుగుతున్నా?

2018 నాటి ఎన్నికలతో పోలిస్తే.. బీసీల నినాదం ఈసారి ఎక్కువగా తెరమీదకు వచ్చింది. రాబోయే ఎన్నికల్లో 60 నుంచి 70 శాతం సీట్లు బీసీలకు కేటాయిస్తామని సరూర్​నగర్​ స్టేడియంలో జరిగిన బహిరంగ సమావేశంలో బీఎస్పీ అధినేత్రి మాయావతి సమక్షంలో ఆ పార్టీ తెలంగాణ చీఫ్​ ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​ ప్రకటించారు. కాంగ్రెస్​ పార్టీ కూడా ప్రతి పార్లమెంట్​ నియోజకవర్గంలో రెండు అసెంబ్లీ సీట్లను.. బీసీలకు కేటాయిస్తామని నిర్ణయం తీసుకున్నారు.

కేంద్రంలో ఒక బీసీ ప్రధాన మంత్రిగా ఉన్నారని, స్వాతంత్ర్యం తర్వాత ఎన్నడూ లేనివిధంగా కేంద్ర మంత్రివర్గంలో 27 మంది బీసీలకు అవకాశం కల్పించామని, తెలంగాణలోనూ బీసీలకు అత్యధిక సీట్లు కేటాయిస్తామన్నట్లు బీజేపీ నేతలు చాలా కాలంగా చెప్పుకొస్తున్నారు. అధికార బీఆర్​ఎస్​ పార్టీ ఇప్పటికే ప్రజల్లో కొంత చర్చనీయాంశంగా మారిన బీసీలకు రాజ్యాధికారం అనే అంశాన్ని ఏమాత్రం పట్టించుకోకపోవడంపై ఆయా సామాజిక వర్గాల నుంచి అసహనం వ్యక్తమవుతున్నది. నిజానికి బీసీల్లో ఇంత చైతన్యం రావడానికి పరోక్షంగా అధికార బీఆర్​ఎస్​ పార్టీ కూడా కారణమే! ‘ప్రతి కులసంఘానికి హైదరాబాద్​లో స్థలం కేటాయిస్తున్నం..

భవనం నిర్మించి ఇస్తాం.. గొల్ల, కురుమలకు గొర్రెలు ఇస్తున్నం.. బెస్త, ముదిరాజ్​ తదితర కులాలకు చేపలు ఇస్తున్నం.. నాయీ బ్రాహ్మణులకు మోడ్రన్​ సెలూన్లు, రజకులకు దోబీఘాట్​లు.. ఇప్పుడు బీసీ బంధు పేరిట.. కుల వృత్తులకు లక్ష రూపాయల చొప్పున సాయం చేస్తున్నం’ అని బీఆర్​ఎస్​ ప్రభుత్వం కులాల వారీగా పథకాలు అమలు చేస్తున్నట్లు చెబుతూ వచ్చింది. ‘పథకాలు మాకు పంచి.. అధికారం మీ దగ్గరే పెట్టుకుంటారా?.. రాజ్యాధికారంలో మా వాటా ఏది?’ అనే ప్రశ్నలొస్తున్నాయి.  

ముదిరాజ్​లకు చేపపిల్లలు ఇచ్చిన బీఆర్​ఎస్​ ప్రభుత్వం.. 60 లక్షల మంది ఓటర్లు ఉన్న కమ్యూనిటీకి ఒక్క సీటు కూడా కేటాయించదా? అని నీలం మధు వేసిన ప్రశ్న అక్కడి నుంచి ఉదయించినదే. కులాల వారీగా పథకాలు అమలు చేసినట్టే.. ఆయా కులాల్లోని జనాభా లెక్కన సీట్లు కూడా ఇవ్వాలని ఆయా సామాజిక వర్గాలు ప్రశ్నిస్తున్నాయిప్పుడు. నిజానికి ఇలాంటి చైతన్యం గత ఎన్నికల్లో కనిపించలేదు. అధికార పార్టీని ఢీకొనేందుకు సమాయత్తమవుతున్న ప్రతిపక్ష కాంగ్రెస్​, బీజేపీ తదితర పార్టీలు ఏ సామాజికవర్గానికి ఎన్ని సీట్లు 
కేటాయిస్తాయో వేచి చూడాలి.

బీసీలకు సీట్ల కేటాయింపు తగ్గడంపై..

సామాజికవర్గం పరంగా అభ్యర్థుల సంఖ్యపై ఈసారి అనేక అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. పాతవాళ్లనెవరినీ పెద్దగా మార్చకపోవడంతో.. కేసీఆర్‌‌ ప్రకటించిన బీఆర్‌‌ఎస్‌‌ అభ్యర్థుల జాబితాలో సగం మంది ఓసీలే ఉన్నారు. మొత్తం115 మంది అభ్యర్థుల్లో 58 మంది ఓసీ అభ్యర్థులు ఉంటే.. బీసీలకు 23 సీట్లే ఎలా ఇస్తారంటూ బీసీ సంఘాల నాయకులతోపాటు ఆయా సామాజికవర్గంలోని మేధావులు, యువకులు సోషల్​ మీడియాలో ప్రశ్నిస్తూ పోస్టులు పెట్టారు. ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏపాల్​ కూడా ఓసీలకు ఎక్కువ సీట్లు, బీసీలకు తక్కువ సీట్లు కేటాయించడాన్ని తప్పుపట్టారు. 58 మంది ఓసీ అభ్యర్థుల్లో రెడ్లు 40 మంది, వెలమలు 11 మంది, కమ్మ సామాజికవర్గం వారు ఐదుగురు, బ్రాహ్మణులు, వైశ్యులు ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.

ఆయా సామాజిక వర్గం సుమారు జనాభా.. కేటాయించిన సీట్లపై ఈసారి చర్చ బాగా నడుస్తున్నది. నిజానికి 2018లో ఇలాంటి చైతన్యం కనిపించలేదు. పటాన్​చెరు నియోజకవర్గం నుంచి బీఆర్​ఎస్​ టిక్కెట్​ ఆశించిన అభ్యర్థి నీలం మధుకు.. సీటు రాకపోవడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో 60 లక్షల మంది ముదిరాజ్​ ఓటర్లు ఉంటే.. ఒక్క సీటు కూడా కేటాయించరా? అని ప్రశ్నించాడు. కేసీఆర్​ ముదిరాజ్​ సామాజికవర్గాన్ని పక్కనపెట్టారని విమర్శించారు. మొత్తంగా రాష్ట్రంలో 60 శాతం ఉన్న బీసీలకు 20 శాతం టికెట్లా? అనే ప్రశ్నలు వాట్సాప్​ స్టేటస్​లుగా, ఫేస్​బుక్​ పోస్టులుగా కనిపించాయి.

సిట్టింగ్​  స్థానాల్లో మార్పులు చేసిన మెజార్టీ స్థానాలు కూడా ఎస్సీ, ఎస్టీ స్థానాలే కావడం ఆయా సామాజిక వర్గాల్లో చర్చనీయాంశమైంది. తమకు 24 సీట్లు ఇవ్వాలని మొన్న కోరుట్ల ‘పద్మశాలీ రాజకీయ యుద్ధ భేరీ’ వేదిక నుంచి పద్మశాలీలు చేసిన విజ్ఞప్తిని అధికార బీఆర్​ఎస్​ పార్టీ పెద్దగా ఖాతరు చేయకపోవడంపై.. ఆ సామాజికవర్గం సోషల్​ మీడియా గ్రూపుల్లోనూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. తమ సామాజికవర్గానికి ఎక్కువ సీట్లు కేటాయించే పార్టీకే మద్దతు ఇవ్వాలన్న ప్రతిపాదనకు అన్ని కులాల నుంచి వినిపిస్తున్నది.

అధికారం అంటే అగ్రవర్ణాలదే అనే భ్రమ ఇప్పుడిప్పుడే తొలగిపోతున్నది. బహుజనులు రాజ్యాధికారం కోసం వేచి చూడటం.. దక్కకుంటే ఆందోళన చేయడం కాకుండా.. మేము ఇంత మంది.. మాకు ఇన్ని సీట్లు ఇవ్వాల్సిందే అనే అల్టిమేటం ఇచ్చే స్థాయికి చేరుకోవాలి. అందుకు ఐక్యత అవసరం.ఆ మధ్య షాద్​నగర్​లో జరిగిన ముదిరాజ్​మహాసభ వేదికలా, మొన్న కోరుట్లలో జరిగిన పద్మశాలీల రాజకీయ గర్జనలా.. సబ్బండ వర్గాల్లో ఐక్యతా గూడుకట్టుకోవాలి. అప్పుడే రాజకీయ పార్టీలు రాజ్యానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం ఇస్తాయి.

- కరుణాకర్​ కాశెట్టి