కోరుట్ల, వెలుగు: కామారెడ్డిలో గల్ఫ్ కార్మికులు, గల్ఫ్ దేశాలకు పోయి చనిపోయినవాళ్ల కుటుంబాలతో ఈ ఎన్నికల్లో నామినేషన్లు వేయిస్తామని గల్ఫ్ కార్మికుల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గుగ్గిళ్ల రవి గౌడ్ అన్నారు. కామారెడ్డిలో 100 మందితో నామినేషన్లు , గల్ఫ్ కార్మికుల ప్రభావిత ప్రాంతాల నియోజకవర్గాల్లో కూడా నామినేషన్లు వేయించి పోటీలో నిలుపుతామని చెప్పారు.
బుధవారం జగిత్యాల జిల్లా కోరుట్ల లో గల్ఫ్ కార్మికుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో గల్ఫ్ ప్రభావిత ప్రాంతాలైన కోరుట్ల, జగిత్యాల, సిరిసిల్ల , వేములవాడ, బాల్కొండ, నిర్మల్ నియోజకవర్గాల్లో గల్ఫ్ కార్మికుల పక్షాన అభ్యర్థులను పోటీలోకి దించుతామని చెప్పారు. సీఎం కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టో లో గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి రూ500 కోట్లతో సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తానని, బాధిత కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్ గ్రేషియో, జైళ్లలో చిక్కుకున్న వారికి ఎన్ఆర్ఐ సెల్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారని గుర్తుచేశారు.
అవేవీ తీర్చకుండా సీఎం మోసం చేశారని, హామీలు విస్మరించిన కేసీఆర్ సర్కారుకు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్తామని రవి గౌడ్ హెచ్చరించారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక గల్ఫ్కార్మికుల బతుకులు మారలేదని, ఏ రాజకీయ పార్టీ తమ బాగోగులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.