పోచారం’కు పోటీ ఎవరు?.. బాన్సువాడలో రసవత్తరంగా అసెంబ్లీ రాజకీయం

కామారెడ్డి, వెలుగు:  ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సీనియర్​నేతగా, ప్రభుత్వంలోనూ పలు కీలక పదవుల్లో చక్రం తిప్పిన అసెంబ్లీ స్పీకర్​పోచారం శ్రీనివాస్​రెడ్డి, ఈ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్​తరఫున బాన్సువాడ నుంచి బరిలో నిలవబోతున్నారు. ఈయనకు ప్రత్యర్థులుగా ప్రతిపక్షాల నుంచి ఎవరు బరిలో నిలుస్తారనే చర్చ జరుగుతోంది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న శ్రీనివాస్​రెడ్డిని ఎదుర్కొనేందుకు బలమైన అభ్యర్థిని బరిలో నిలిపి, బాన్సువాడ సీటును తమ ఖాతాలో వేసుకోవాలని బీజేపీ, కాంగ్రెస్​భావిస్తున్నాయి. అయితే ఈ  రెండు పార్టీల తరఫున ఎవరు బరిలో ఉండబోతున్నరనేది ఇంకా స్పష్టం కాలేదు. కాంగ్రెస్​నుంచి బాన్సువాడలో పోటీకి సై అంటూ ఏకంగా 16 మంది గాంధీభవన్​కు అర్జీలు పెట్టుకున్నారు.

పోచారం సిక్సర్..​

1952 నుంచి 2018 వరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బాన్సువాడలో  కాంగ్రెస్​7 సార్లు, టీడీపీ 6 సార్లు,  2011లో జరిగిన ఉప ఎన్నికను కలుపుకొని బీఆర్ఎస్​3 సార్లు విన్నయింది. పోచారం శ్రీనివాస్​రెడ్డి టీడీపీ నుంచి 3 సార్లు, బీఆర్ఎస్​నుంచి 3 సార్లు మొత్తంగా 6సార్లు విజయం సాధించారు. 1994,1999లో టీడీపీ తరఫున గెలిచిన స్పీకర్, ​2004లో కాంగ్రెస్​అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్​చేతిలో పరాజయం పాలయ్యారు. మళ్లీ 2009లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

 ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీఆర్ఎస్​లో చేరారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో 2011 జరిగిన ఉపఎన్నికలో, ఆ తర్వాత జరిగిన 2014,2018 ఎన్నికల్లోనూ బీఆర్ఎస్​ నుంచి విజయం సాధించారు. మొదటి తెలంగాణ క్యాబినెట్​లో వ్యవసాయ మంత్రిగా, ప్రస్తుతం అసెంబ్లీ స్పీకర్​గా కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తన వారుసుడిగా కొడుకుని బరిలో నిలపాలని పోచారం ముమ్మర ప్రయత్నాలు చేయగా, సిట్టింగులకే సీట్లు కేటాయించడంతో తిరిగి ఆయనే పోటీ చేయనున్నారు. 

పాగా వేయలాని కమల దళం ప్రయత్నాలు

బాన్సువాడలో గెలిచి సత్తా చాటాలని బీజేపీ భావిస్తోంది. ఇక్కడి నుంచి ప్రస్తుతం మల్యాద్రిరెడ్డి టికెట్​ ఆశిస్తున్నారు.కాంగ్రెస్​లో కొనసాగిన ఈయన 2 ఏండ్ల కింద బీజేపీలో చేరారు. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. తనకే టికెట్​వస్తోందని నమ్మకంతో ఉన్నారు.

తమ ఖాతాలో వేసుకోవాలని..

ఒకప్పుడు కంచుకోటగా ఉన్న బాన్సువాడను మళ్లీ తమ ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్​ ఉవ్విళ్లూరుతోంది. 1952 నుంచి 1983 వరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా 6 సార్లు, 2004 లో ఒకసారి కాంగ్రెస్​ఇక్కడ విజయం సాధించింది. ఆ తర్వాత వరుసగా ఓటమిని చవిచూసింది. ఇక్కడ పార్టీకి మంచి ఓటు బ్యాంకు ఉంది. 2014లో 41,938 ఓట్లు, 2018లో 59,458 ఓట్లు వచ్చాయి. ఈ రెండు సార్లు కాసుల బాలరాజు కాంగ్రెస్​నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 

ఈయన ఈ సారి మళ్లీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. బీసీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడం, తన సామాజిక వర్గానికి ఓట్లు ఎక్కువగా ఉన్న దృష్ట్యా తనకే మళ్లీ టికెట్​వస్తుందని ఆశతో ఉన్నారు. 2011లో ఉప ఎన్నికల్లో కాంగ్రెస్​నుంచి పోటీ చేసి పోచారం మీద ఓడిపోయిన శ్రీనివాస్​గౌడ్​కూడా టికెట్​కోసం ట్రై చేస్తున్నారు. పార్టీలో వివిధ పదవులు నిర్వహించిన మిగతా 14 మంది లీడర్లు సైతం టికెట్​ఆశిస్తున్నారు.