- 18న అమిత్‌షా ప్రచార సభలు.. 19న నడ్డా రోడ్‌షో
- బీజేపీ అగ్రనేతల షెడ్యూల్ఖరారు
- ఈ నెల 25 నుంచి 27 వరకు మోదీ టూర్‌కు ప్లాన్!
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం కోసం కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా టూర్లు ఖరారు అయ్యాయి. ఈ నెల 18న అమిత్ షా, ఈ నెల19న నడ్డా రాష్ట్రంలో బీజేపీ ఏర్పాటు చేసే పలు ప్రచార సభల్లో పాల్గొననున్నారు. ప్రధాని మోదీ టూర్ ఇంకా ఖరారు కావాల్సి ఉంది. ఆయన టూర్ ఈ నెల 25 నుంచి 27 వరకు ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నా, పీఎంవో నుంచి అధికారిక షెడ్యూల్ ఇంకా పార్టీ రాష్ట్ర నాయకత్వానికి అందలేదు. శుక్రవారం రాత్రే కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ చేరుకోనున్నారు.
శనివారం మూడు బహిరంగ సభల్లో ఆయన పాల్గొంటారు. షా పాల్గొనే సభలకు “సకల జనుల విజయ సంకల్ప సభ”గా బీజేపీ పేరు ఖరారు చేసింది. ఖరారైన అమిత్ షా టూర్ షెడ్యూల్ ప్రకారం అమిత్‌షా శుక్రవారం రాత్రి10 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకొని, అక్కడి నుంచి నేరుగా ఐటీసీ కాకతీయ హోటల్ కు వెళ్లి, రాత్రి అక్కడే బస చేస్తారు. ఈ నెల18న ఉదయం 10:30 గంటలకు హోటల్ కత్రియకు చేరుకుంటారు. అక్కడ బీజేపీ మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు. హెలికాప్టర్ లో గద్వాల చేరుకొని మధ్యాహ్నం అక్కడి సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి నల్గొండ జిల్లాకు చేరుకొని సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి వరంగల్ కు వెళ్లి సాయంత్రం 4:15 గంటల నుంచి 4:55 గంటల వరకు సభలో పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్ లో మాదిగ రిజర్వేషన్ల పోరాట సమితితో పాటు అన్ని అనుబంధ విభాగాలతో నిర్వహించే జాతీయ సమావేశానికి అమిత్ షా హాజరవుతారు. ఆ భేటీ అనంతరం షా ఢిల్లీ వెళ్లనున్నారు.
నడ్డా షెడ్యూల్ ఇదీ..
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ నెల 19 న ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనేందుకు రాష్ట్రానికి రానున్నారు. ఆదివారం మధ్యాహ్నం12 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ఆయన హెలికాప్టర్ లో నారాయణపేటలో నిర్వహించే బహిరంగ సభకు వెళ్లనున్నారు. ఆ సభ తర్వాత చేవెళ్లలో నిర్వహించే సభలో పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం మల్కాజిగిరిలో నిర్వహించే రోడ్‌షోలో నడ్డా పాల్గొంటారు. తిరిగి బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకొని రాత్రి 9 గంటలకు ఢిల్లీ వెళ్లనున్నారు.