కరీంనగర్, వెలుగు: బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణలో యూనిఫామ్ సివిల్ కోడ్(యూసీసీ) ను అమల్లోకి తీసుకొస్తామని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ అన్నారు. ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్ పెంచుతామని స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో శుక్రవారం బీజేపీ అభ్యర్థి బొడిగ శోభ ఆధ్వర్యంలో నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్ కు హిమంత బిశ్వ శర్మ హాజరై మాట్లాడారు.
కేంద్రంలో బీసీ వర్గానికి చెందిన నరేంద్ర మోదీ ప్రధానిగా ఉన్నారని, తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలోనూ బీసీని సీఎం చేస్తామని స్పష్టం చేశారు. అస్సాంలో పెట్రోల్ లీటర్ రూ.97 మాత్రమే ఉందని ఇక్కడ రూ.110కి అమ్ముతూ కేసీఆర్ పేదలను దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వస్తే రూ.100లోపే లీటర్ పెట్రోల్, డీజిల్ ఇస్తామన్నారు. ఎస్సీ వర్గీకరణ డిమాండ్ ను బీజేపీ 100 శాతం పూర్తి చేస్తుందని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తే అయోధ్యలో రామ్ మందిరం చూడడానికి అందరినీ ఉచితం గా తీసుకెళ్తామని తెలిపారు. హైదరాబాద్ పేరు భాగ్య నగర్ గా మార్చుతామని చెప్పారు.
పోలీసులు ధమ్కీలు ఇస్తున్నా చర్యలు లేవ్
హైదరాబాద్ వచ్చాక తాను ఒక వీడియో చూశానని, అందులో ఓవైసీ సోదరుడు పోలీసులకు ధమ్కీ ఇవ్వడం కనిపించిందని హిమంత అన్నారు. ఇక్కడ ఆయనను కంట్రోల్ చేసేవాళ్లు లేరని, ఇదే అస్సాంలో జరిగితే 5 నిమిషాల్లో వాళ్ల భరతం పట్టేవాడినన్నారు. కేసీఆర్ సర్కార్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడం లేదని, తరుచూ పేపర్ లీకేజీలు అవుతున్నాయని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ అవినీతిపై విచారణ జరిపి జైలులో పెడతామని హామీ ఇచ్చారు.