మాయమాటలతో అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు అయినా ఏం అభివృద్ధి చేయలేదని మధిర కాంగ్రెస్ అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. 2023, నవంబర్ 13వ తేదీ సోమవారం భట్టి మధిరలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధనిక రాష్ట్రంతో తెలంగాణ ఇస్తే.. కేసీఆర్ కుటుంబం ప్రజల సోమ్మును దోచుకుందని మండిపడ్డారు.
ఈ ఎన్నికలు దొరలకు, నాలుగు కోట్ల తెలంగాణ -ప్రజలకు మధ్య జరుగుతున్నాయని.. పోరులో ప్రజలే గెలుస్తారని అన్నారు. బీఆర్ఎస్ అవినీతి పాలనను అంతమొందించాలంటే.. కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 100రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని.. రైతులకు2 లక్షల రుణమాఫీ చేస్తామని అన్నారు. ఇళ్ల స్థలాలు ఉంటే ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. ఈ రాష్ట్రం అందరిదని.. ఈ సంపద అందరికి దక్కాలని భట్టి విక్రమార్క అన్నారు.