మెట్ పల్లి, వెలుగు: జగిత్యాల జిల్లా మెట్పల్లిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఘర్షణ జరిగింది. టౌన్‌లోని బిస్మిల్లా మసీదు వద్ద ఎమ్మెల్యే విద్యాసాగర్ రావుతో కలిసి బీఆర్ఎస్ లీడర్లు.. కాంగ్రెస్అభ్యర్థి జువ్వాడి కృష్ణారావుతో కలిసి ఆ పార్టీ లీడర్లు ప్రచారం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు కారుపై గుర్తు తెలియని వ్యక్తి కాంగ్రెస్ స్టిక్కర్ అతికించాడు. దీంతో బీఆర్ఎస్ లీడర్లు కాంగ్రెస్ నాయకులే స్టిక్కర్ అతికించారని ఆందోళనకు దిగారు. దీంతో ఇరువర్గాలు పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు.
ఇది ఒకరికొకరు తొసుకుని కొట్టుకునేవరకు వెళ్లింది. దీంతో గంట సేపు నేషనల్ హైవే 63పై ఉద్రిక్తత చోటుచేసుకుంది. రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు మసీదు వద్దకు భారీగా చేరుకోగా, పోలీసులు సముదాయించడానికి ప్రయత్నించారు. ఒక దశలో కొందరు పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. పరిస్థితి విషమించడంతో ఆందోళనకారులను చెదరగొట్టాల్సి వచ్చింది. సీఐ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పరిస్థితి అదుపులో ఉందని, ఇప్పటివరకు ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు.