ఎన్నికల షెడ్యూల్ కన్నా నెలల తరబడి ముందే పార్టీలు అభ్యర్థులను ప్రకటించడం చాలా అరుదు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు మూడు నెలల ముందే టీఆర్ఎస్ తన పార్టీ అభ్యర్థులను ప్రకటించి కొత్త సంప్రదాయాన్ని నెలకొల్పొంది. ఈ మధ్యనే మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు 4 నెలల ముందే, బీజేపీ కూడా వినూత్నంగా కొన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. తెలంగాణలోనూ డిసెంబర్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ముందే ప్రకటించాలనే ఆరాటంలో ప్రధాన పార్టీలు కొంతకాలంగా ఆరాటపడుతున్నాయి. ముఖ్యంగా అధికారపార్టీ బీఆర్ఎస్లో అభ్యర్థుల ఎంపికపై చాలా రోజులుగా ఒక రకమైన ఉత్కంఠ కొనసాగుతూ వచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అభ్యర్థుల ఎంపికపై చాలాకాలంగా కసరత్తు చేస్తున్నారనే వార్తలు వినిపించాయి.
చివరకు శ్రావణ సోమవారం మంచి ముహూర్తం రోజు ఏకంగా115 మంది బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించి రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేశారు. 9 మందికి తప్ప, సిట్టింగులందరికీ టికెట్ ఇచ్చారు. ఇందులో ఇద్దరు సిట్టింగుల ఎంపికను మాత్రం హోల్డ్‌లో పెట్టారు. 90 శాతం మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తిరిగి టికెట్ ఇవ్వడం కేసీఆర్ చేసిన రాజకీయ సాహమనే చెప్పాలి. ఇలాంటి సాహసం 2018లోనూ చేశారు. అదే ఫార్ములాను ఈ సారి కూడా అమలులో పెట్టారనుకోవచ్చు. ఆ ఫార్ములా వెనుక ఉన్న కేసీఆర్ అపారమైన నమ్మకం ఏమిటో ఇప్పుడే చెప్పలేం! కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా!
గత ఎన్నికతో పోల్చలేం..
ఇంత ముందుగా అభ్యర్థులను ప్రకటించడం వల్ల ప్రచారానికి కావల్సినంత సమయం దొరుకుతుందనేది బీఆర్ఎస్ప్రాథమిక ఆలోచనగా కనిపిస్తున్నది. అలాగే ప్రధాన ప్రతిపక్షాల సంసిద్ధతకు ఒక సవాలుగా మార్చాలనే ఉద్దేశం కూడా అంతకన్నా బలమైనది. ముందుగానే తమ అభ్యర్థులను ప్రకటించి, ఎన్నికలకు పూర్తి స్థాయిలో సిద్ధం కాని ప్రతిపక్షాలను మానసికంగా బలహీనపర్చడం కేసీఆర్వ్యూహం అయి ఉండొచ్చు. కారణం ఏదైనా కేసీఆర్ తన పార్టీని ఎన్నికల రంగంలోకి దింపేశారు. ప్రతిపక్షాలు ఏమేరకు సిద్ధమయ్యాయి?, అవుతున్నాయి ? అనేది మరో 15 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
కాకపోతే 2018లో లాగా ప్రతిపక్షాలు అంత బలహీనంగా మాత్రం లేవనే చెప్పాలి. 2018 ఎన్నికల్లో కేసీఆర్వ్యూహాలకు తిరుగులేదు. కానీ ప్రస్తుత 2023 ఎన్నికలు 2018 నాటి ఎన్నికల వలే కేసీఆర్‌కు కేక్వాక్మాత్రం కాదు. అప్పట్లో ముందస్తుగా అభ్యర్థులను ప్రకటిస్తే అధికార పార్టీకి కలిసొచ్చింది. అయితే ఈసారి అలా జరగాలని లేదు. అలాగే కలిసిరావడం అంత సులభం కాదు. పదేండ్ల అధికార పార్టీలో నేతలకు కొదవలేదు.
సిట్టింగులకు టికెట్లివ్వడం వల్ల మిగతా ఆశావహులు అవకాశమున్న ఇతర పార్టీల్లో చేరే అవకాశాలు ఇప్పుడు పెరిగాయి. అధికార పార్టీ అభ్యర్థుల లిస్టు ముందే ప్రకటించి ప్రతిపక్షాలను ఉక్కిరిబిక్కిరి చేసింది ఎంత నిజమో.. అది అధికార పార్టీలో మిగిలిన అశావహులను ప్రతిపక్షాలకు అందించిందనేది కూడా అంతే నిజం. ఈసారి ముందస్తు అభ్యర్థుల ప్రకటన లాభంతో పాటు, నష్టం కూడా కావొచ్చు.
అవినీతి అంటూనే.. అందరికీ టిక్కెట్లు
చాలా రోజుల నుంచి అధికార పార్టీ అభ్యర్థుల లిస్టు ఇదీ.. అంటూ కొన్ని పేర్లు మీడియాలో చక్కర్లు కొట్టాయి. కనీసం 25 నుంచి 30 మంది సిట్టింగ్‌లకు భంగపాటు తప్పదనే వార్తలు, విశ్లేషణలు వెలువడ్డాయి. కొందరు ఎమ్మెల్యేలపై వచ్చిన ఆరోపణల ఆధారంగా, మరికొందరిపై ప్రజావ్యతిరేకత ఆధారంగా టికెట్ల నిరాకరణ ఉంటుందని ప్రజలు కూడా విశ్వసించారు. కానీ తీరా వారందరికీ టికెట్ కేటాయించడం చూసి అంతా ఆశ్చర్యపోయారు. జనగామ ఎమ్మెల్యేకు తెలియకుండానే మరొకరు అక్కడ తనదే టికెట్అంటూ.. హైదరాబాద్‌లో ప్రగతి భవన్పక్కనే క్యాంపు పెట్టడం చూస్తే.. ఆ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మరొకరిని ఉసిగొల్పిన బీఆర్ఎస్అధిష్టానం తీరు చర్చనీయాంశమైంది.
చివరకు జనగామ టికెట్ ను కేసీఆర్ హోల్డ్‌లో పెట్టక తప్పలేదు. మహిళల వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న ఎమ్మెల్యేలూ ఉన్నారు. మరికొందరు నిరుద్యోగులను మోసం చేసినవారున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో 40 మందికి పైగా ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారనే సర్వేలు వచ్చాయి. మూడేండ్ల నుంచి సొంత సర్వేలు, పీకే సర్వేలు చేయించి, వాటి ఫలితాలు చూశాక కూడా సిట్టింగ్‌లందరికీ టిక్కెట్లు కేటాయించడం రాజకీయ సాహసం అనుకోవాలా? స్వయంగా పార్టీ అధినేతనే, పలు సమావేశాల్లో కొందరు ఎమ్మెల్యేలను హెచ్చరించారు. దళితబంధు స్కీంలో 30 శాతం కమీషన్తింటున్నారని, తనకు సమాచారం ఉందని కుండబద్ధలు కొట్టారు.
కానీ తిరిగి దాదాపు అందరికీ టికెట్లుకేటాయించడం వెనుక గల వ్యూహమేమిటనే దానిపై రచ్చబండల కాడ చర్చ జరుగుతున్నది. తన మాటే శాసనంగా పార్టీనీ, ప్రభుత్వాన్ని ఒంటిచేత్తో నడిపిస్తున్న ముఖ్యమంత్రి.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను కూడా తొలగించలేని అశక్తుడిగా ఎందుకు మారాల్సి వచ్చిందో తెలియదు మరి! ప్రకటించిన లిస్ట్‌లో 90 శాతం పైగా సిట్టింగ్‌లను చూసి.. తమకు ఇప్పటిదాకా వస్తాయనుకుంటున్న సీట్ల సంఖ్య మరింత పెరుగొచ్చని బహుశా ప్రతిపక్షాలు కూడా సంబరపడుతుండొచ్చు! రాజకీయాల్లో కేసీఆర్ఎంత బలవంతుడు అనుకుంటుంటామో.. అంతే బలహీనుడు కూడా అనే విషయం ప్రకటించిన అభ్యర్థుల లిస్టే స్పష్టంగా చెబుతున్నది.
ప్రభుత్వ వ్యతిరేకత..
కేసీఆర్పాలనపై ప్రజల్లో గతం కంటే వ్యతిరేకత బాగా పెరిగి ఉంది. ఇదీగాక నియోజకవర్గాల్లో నియంతల్లా మారిన కొందరు ఎమ్మెల్యేలపై అసహనం గూడుకట్టుకున్నది. ఈ రెండూ ఉన్న చోట అధికార పార్టీ విజయం దూరం అయ్యే ప్రమాదం పొంచి ఉన్నా.. ఆ నిశ్శబ్ద వ్యతిరేకతను గుర్తించినట్లు లేదు. అంతా బాగుందనే భావన కేసీఆర్‌లో ఇప్పటికీ కనిపిస్తున్నది. ఎప్పుడూ ఒకేలా ఉండదనే సూత్రాన్ని చాలమేరకు కేసీఆర్గుర్తించలేకపోతున్నారు. అభ్యర్థుల లిస్ట్ ప్రకటించి ప్రతిపక్షాలను ఉక్కిరి బిక్కిరి చేస్తే, గెలుపు ఖాయం అయిపోదు. 4 నెలల ముందుగా, అన్ని పార్టీల కన్నా ముందుగా అభ్యర్థులను ప్రకటించడం రాజకీయ సాహసమే! అది ఎంత గొప్ప విషయంగా చెప్పుకున్నా.. ఈ మూడో ఎన్నిక అత్యంత సంక్లిష్టమైనదనే విషయాన్ని మర్చిపోవద్దు.
భంగపడ్డ కామ్రేడ్లు..
మునుగోడు ఉప ఎన్నిక ఆపద మొక్కుల కోసం.. ఉభయ కమ్యూనిస్టులను అలుముకొని అక్కున చేర్చుకున్న కేసీఆర్.. గెలిచి బయటపడ్డాక ఇప్పుడు అక్కెరే లేదన్నట్లుగా కూరలో కరివేపాకులా పక్కనపడేశారు. టిక్కెట్లన్నీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే కేటాయించి.. మీతో పొత్తు, గిత్తు జాన్తా నై అని పరోక్షంగా కమ్యూనిస్టులకు కటీఫ్చెప్పారు. తమ మద్దతు వల్లే అధికార పార్టీ మునుగోడు ఉప ఎన్నిక గెలిచిందని ఉభయ కమ్యూనిస్టులు ధీమాగా మరోసారి ఉనికి చాటుకునేందుకు ఉవ్విళ్లూరారు.
స్నేహం కుదిరిందని, పొత్తులతో అసెంబ్లీలో అడుగుపెట్టాలని ఆశపడితే భంగపాటే మిగిలింది. ‘అయ్యో.. ఇదెంతటి మిత్రద్రోహం’ అని కామ్రేడ్లు ఇప్పుడు ఎంత మొత్తుకున్నా.. జాలిచూపే వారు ఎవరు ఉంటారు? బీజేపీని ఓడించడమే తమ అంతిమ లక్ష్యమని చెప్పిన కమ్యూనిస్టులు.. కేసీఆర్ఇంత పనిచేస్తాడని కలలో కూడాఊహించి ఉండరేమో! కమ్యూనిస్టు పార్టీల పయనం ఇక గాంధీభవన్వైపేనా?
– కల్లూరి శ్రీనివాస్ రెడ్డి, పొలిటికల్ ఎనలిస్ట్