ప్రజల దగ్గర ఉన్న వజ్రాయుధం ఓటేనని సీఎం కేసీఆర్ అన్నారు. పేదల కోసం,రైతుల కోసం ఎవరు ఏం చేశారో ఆలోచించి ఓటేయాలని సూచించారు. ఎన్నికలకు ముందు ఆగమాగంకావొద్దన్నారు. 50 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ఒరిగిందేమి లేదన్నారు. మంథని బహిరంగ సభలో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ పాలనలో రైతులను పట్టించుకోలేదని విమర్శించారు. ఎన్నికలు వస్తాయి పోతాయి కానీ ప్రజలు గెలవాలన్నారు. రేవంత్ రెడ్డి మూడు గంటల కరెంట్ చాలంటున్నారని..మూడుగంటల్లో పొలం ఎలా పారుతుందని ప్రశ్నించారు. ప్రత్యేక రాష్ట్రం విషయంలో కాంగ్రెస్ 15 ఏళ్లు మోసం చేసిందని విమర్శించారు. ప్రజలు గెలిచే ప్రజాస్వామ్య ప్రక్రియ రావాలన్నారు కేసీఆర్. అన్ని ఆలోచించి ఓటు వేయాలన్నారు.
రైతుబంధు పదాన్ని పుట్టించిందే బీఆర్ఎస్ అని కేసీఆర్ అన్నారు. రైతుబంధు ఉండాలా? వద్దా అని ప్రజలను అడిగారు. కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ చేస్తారని.. ధరణిని బంద్ చేస్తే రైతుబంద్ ఎలా వస్తుందని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పుట్టిందే ప్రజల హక్కుల కోసం పోరాడటానికి అన చెప్పారు. రాహుల్ గాంధీకి ఎద్దు ఎరకనా? ఎవుసం ఎరకనా.? అని ప్రశ్నించారు కేసీఆర్.
24 గంటల విద్యుత్ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ ఇస్తున్నారో చూపించాలని సవాల్ విసిరారు కేసీఆర్. గుజరాత్ లో కూడా 24 గంటల కరెంట్ ఇవ్వట్లేదన్నారు. తెలంగాణ ప్రజలే తమకు బాసులని తమకు బాసులు ఢిల్లీలో ఉండరని చెప్పారు. ప్రజల్లో ఉండే పుట్టా మధును గెలిపించాలని.. పుట్టా మధును గెలిపిస్తే మంథని దరిద్రం పోగొడుతానని తెలిపారు. ఇప్పుడిప్పుడే ప్రజలు బాగుపడుతున్నారని.. ఈ ఎన్నికల్లో బీసీల చైతన్యం ఏంటో చూపించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.
ALSO READ : అవ్వా ఐడియా అదిరింది : కొడుకుపై కోపం.. ఎన్నికల నామినేషన్ వేసిన వృద్ధురాలు