ఖమ్మం టౌన్, వెలుగు : పదేండ్ల కేసీఆర్ పాలనలో నిరుద్యోగం, అవినీతి పెరిగిపోయాయని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ ఆరోపించారు. ఖమ్మం సిటీలోని పార్టీ జిల్లా ఆఫీసు గిరిప్రసాద్ భవన్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నారాయణ మాట్లాడారు. దేశ వ్యాప్తంగా బీజేపీని ఓడించడమే లక్ష్యంగా సీపీఐ పనిచేస్తోందన్నారు. తాము ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్నామని, రాష్ట్రంలో కాంగ్రెస్ భాగస్వామ్యంతో ఒక్క స్థానంలో పోటీ చేస్తున్నామని చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్,ఎంఐఎం లోపాయికారి ఒప్పందం తో పనిచేస్తున్నాయని..అందుకే గోషామహల్లో రాజాసింగ్ పై ఎంఐఎం పోటీ పెట్టలేదన్నారు. దీన్ని బట్టే మూడు పార్టీలు ఒక్కటేనని అర్థం చేసుకోవచ్చన్నారు.
తెలంగాణ ప్రజలు ఒక్క ఓటుతో మూడు పార్టీలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ ఒకప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా పని చేయడం వల్లే మునుగోడు ఎన్నికల్లో మద్దతు ఇచ్చామన్నారు. కానీ, కేసీఆర్ కూతురు లిక్కర్ కేసులో ఇరుక్కున్న తర్వాత సీఎం వైఖరి మారిపోయిందన్నారు. మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్, బెయిల్ వెనుక బీజేపీ ఉందని ఆరోపించారు. పార్టీ మారిన నాలుగు రోజులకే మాజీ ఎంపీ వివేక్ ఆర్థిక నేరస్థుడయ్యాడా? అని నిలదీశారు. జైలులో ఉండాల్సిన జగన్ బెయిల్ పై ఉండడం జాతీయ రికార్డు అని అన్నారు. కాళేశ్వరం కూలిపోవడం, పేపర్ లీకులు, 50 శాతం కమిషన్లు కేసీఆర్ పుట్టిముంచనున్నాయని జోస్యం చెప్పారు.
తెలంగాణ ప్రజలు అవినీతినైనా సహిస్తారు కానీ, అహంకారాన్ని సహించారన్నారు. కేసీఆర్ క్యాబినెట్ లో తెలంగాణ ద్రోహులే ఎక్కువగా ఉన్నారని ఆరోపించారు. ఖమ్మం నియోజకవర్గంలో సీపీఐ, కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడం లేదనే అపవాదు సరికాదన్నారు. ఉమ్మడి జిల్లాలోని 9 సెగ్మెంట్లలో కాంగ్రెస్ గెలుపుకు సీపీఐ కృషి చేస్తోందన్నారు. పువ్వాడ అజయ్ కుమార్ కు మద్దతు ఇస్తామనుకోవడం అవివేకమన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, సహాయ కార్యదర్శి దండి సురేష్, జితేందర్ రెడ్డి, జానిమియా పాల్గొన్నారు.
పువ్వాడ అజయ్ గంజాయి...
ఖమ్మంలో కాంగ్రెస్ తరపున సీపీఐ శ్రేణులు ప్రచారం చేయడం లేదని అపవాదు ఉందని నారాయణ అన్నారు. సీపీఐ నేత పువ్వాడ నాగేశ్వరరావు కొడుకు అజయ్ కాబట్టి అతడిని సపోర్ట్ చేస్తున్నామని ప్రజలు అనుకుంటున్నారని, పొరపాటున అయినా తమ పార్టీకి చెందిన వారు కాంగ్రెస్‌ను వ్యతిరేకిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. పువ్వాడ నాగేశ్వరరావు పెరట్లో మామిడి చెట్టుకి గంజాయి కాసిందని మంత్రి అజయ్‌ని ఉద్దేశించి అన్నారు. ‘ఎన్నాళ్లు చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకుంటాం. తండ్రికి నామాలు పెట్టేవాడు ఎవడైనా ఉంటే..అతను అజయ్’ అని అన్నారు.