బీజేపీ లీడర్లు ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నరు : హరీశ్ రావు

బీజేపీ లీడర్లు ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నరు :  హరీశ్ రావు

సిద్దిపేట, వెలుగు:  బీజేపీ, కాంగ్రెస్​పార్టీలు రైతుల పాలిట శత్రువులని మంత్రి హరీశ్​రావు విమర్శించారు. పంట పొలాల్లోని మోటార్లకు మీటర్లు బిగించాలని కేంద్రం ఆదేశించింది నిజమేనని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారని హరీశ్​గుర్తుచేశారు. ఈ విషయాన్ని రైతులు గమనించాలన్నారు. బుధవారం ఆయన సిద్దిపేటలో మీడియాతో మాట్లాడారు.

ఇన్నాళ్లు అబద్ధాలతో ఊదరగొడుతున్న బీజేపీ లీడర్లు మోటార్లకు మీటర్ల అంశంపై సమాధానం చెప్పాలన్నారు. ఏ మొహం పెట్టుకుని రైతులను ఓట్లు అడుగుతున్నారని హరీశ్ రావు ప్రశ్నించారు. మోటార్లకు మీటర్లు పెట్టబోమని అసెంబ్లీ సాక్షిగా తేల్చిచెప్పిన వ్యక్తి, ఏకైక సీఎం కేసీఆర్ అని చెప్పారు. కేంద్ర మంత్రి నిర్మల బీజేపీతోపాటు కాంగ్రెస్ బండారం బయటపెట్టారన్నారు. తెలంగాణలో మోటార్లకు మీటర్లు  బిగించకపోవడంతోనే డబ్బులు ఇవ్వలేదని నిర్మల చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు.

రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలోని కాంగ్రెస్​ప్రభుత్వాలు మీటర్లు పెట్టేందుకు అంగీకరించాయన్నారు. రాష్ట్రంలోని 69 లక్షల మంది రైతుల ప్రాణాలే తమకు ముఖ్యమని, రూ.25 వేల కోట్లు కాదని హరీశ్​స్పష్టం చేశారు. ఒకవేళ తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే ఇక్కడ కూడా మోటార్లకు మీటర్లు బిగిస్తుందన్నారు. కాంగ్రెస్​కు ఓటు వేస్తే అందుకు అంగీకరించినట్లేనని హెచ్చరించారు.

2014తో పోలిస్తే తెలంగాణ తలసరి ఆదాయం రెండున్నర రెట్లు పెరిగిందని, ఇదే సమయంలో దేశ తలసరి ఆదాయం తెలంగాణ కన్నా తగ్గిందన్నారు. అప్పుల గురించి కేంద్రం తెలంగాణ ప్రభుత్వానికి చెప్పడం సిగ్గుచేటు అన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాక ముందు రూ.55 లక్షల కోట్లు అప్పు ఉంటే, ఇప్పుడు రూ.155 లక్షల కోట్లు దాటిందన్నారు.

ప్రతి నెలా లక్ష కోట్లు అప్పు చేసిన ఘనత బీజేపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలతోనే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడంలో కొంత ఆలస్యం అయ్యిందన్నారు. హరీశ్​రావు వెంట లీడర్లు రాధాకృష్ణశర్మ, సంపత్ రెడ్డి ఉన్నారు.